కృష్ణా డెల్టాలో భారీగా చమురు !
రూ. 3 లక్షల కోట్ల విలువైన ఆయిల్ నిక్షేపాలు
ఓఎన్‌జీసీ-కెయిర్న్ ఎనర్జీ పరిశోధనలు సక్సెస్
భూగర్భంలో 4 కి.మీ. లోతులో 1,697 చ.కి.మీటర్లలో విస్తరణ
కేజీ బేసిన్‌లోనే అత్యంత భారీ భూగర్భ క్షేత్రం
దివిసీమ నుంచి గుంటూరు జిల్లా రేపల్లె వరకు చమురే
బొల్లోజు రవి, సాక్షి ప్రతినిధి విజయవాడ: కృష్ణా డెల్టా ప్రాంతంలో భారీగా చమురు నిల్వలు బయటపడ్డాయి. ఓఎన్‌జీసీ-కెయిర్న్ ఎనర్జీ సంస్థలు సంయుక్తంగా 8 ఏళ్ల పాటు చేసిన పరిశోధన విజయవంతమైంది. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లోనే ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన చమురు నిక్షేపంగా మారనుంది. 550 మిలియన్ బ్యారర్ల చమురు ఈ క్షేత్రంలో నిక్షిప్తమై ఉండొచ్చని అంచనా వేశారు. దీని విలువ ప్రస్తుత లెక్కల ప్రకారం ఏకంగా రూ.3 లక్షల కోట్లపైనే ఉంటుందని ఈ అన్వేషణలో పాలుపంచుకున్న కంపెనీ వర్గాల ద్వారా తెలిసింది. రాబోయే రెండు, మూడేళ్లలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి.
2006 నుంచే పరిశోధనలు: మొదట్లో కృష్ణా డెల్టాలో చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తిపై పెద్దగా అంచనా ఉండేది కాదు. కేజీ బేసిన్‌లో భాగమైన ఈ ప్రాంతాన్ని గతంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రిలయన్స్ సంస్థ కూడా పెద్దగా ఖాతరు చేయలేదు. ఓఎన్‌జీసీ మాత్రమే కృష్ణా జిల్లాలోని మల్లేశ్వరం ప్రాంతంలో 16 ఆయిల్, 16 చమురు బావుల నుంచి నిక్షేపాలను వెలికి తీస్తోంది. దివిసీమలోని నాగాయలంక, గుంటూరు జిల్లా రేపల్లె వరకు భూగర్భంలో నిక్షేపాలపై కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎక్స్‌ఫ్లోరేషన్ లెసైన్సింగ్ పాలసీ (ఎన్‌ఈఎల్‌పీ-నెల్ప్) బిడ్డింగ్ నిర్వహించింది.
ఆ బిడ్డింగ్‌ను ఓఎన్‌జీసీ, కెయిర్న్ ఎనర్జీ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. అందులో ఓఎన్‌జీసీ వాటా 51 శాతం కాగా... కెయిర్న్ ఎనర్జీ వాటా 49 శాతంగా ఉంది. 2006-07లో ఆ క్షేత్రంలో ఇవి కాలుమోపాయి. అప్పట్నుంచి పరిశోధనలు చేశాయి. నాగాయలంకలో ప్రయోగాత్మకంగా మూడు బావులను తవ్వారు. 2011లో ఒక బావిని, 2012లో మరో బావిని, 2013లో మూడో బావిని తవ్వారు. ఆ మూడు బావులు విజయవంతమయ్యాయి. ఈ క్షేత్రంలో గ్యాస్ కంటే కూడా చమురు నిక్షేపాలే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఏకంగా 550 మిలియన్ బ్యారళ్ల ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చమురు బ్యారల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ.106 డాలర్లు ఉంది. ఆ ప్రకారం చూస్తే మొత్తం ఇక్కడి నిక్షేపాల విలువ ఏకంగా రూ.3 లక్షల కోట్లు పైనే ఉంటుందని అంచనా.
ప్రయోగాలు చేశారు ఇలా: ఈ ప్రయోగాలకు ముందు కృష్ణా డెల్టాలోని నాగాయలంక-రేపల్లె క్షేత్రంలో 2011 వరకు 3 కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే ప్రయోగాలు చేసేవారు. ఆ లోపు ఎప్పుడూ నిక్షేపాలు బయటపడలేదు. అంతర్జాతీయ డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా ఓఎన్‌జీసీ-కెయిర్న్‌లు 4 కిలోమీటర్ల వరకు పరిశోధన సాగించాయి. అక్కడ భారీ ఒత్తిడితోపాటు 178 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటిచోట సాధారణమైన పరికరాలు పనిచేయవు. ఈ నేపథ్యంలో శంబర్గర్ అనే అంతర్జాతీయ కంపెనీకి చెందిన డిజిటల్ టెక్నాలజీతో ప్రయోగాలు చేపట్టారు. 4 కి.మీ. లోతులో.. 1,697 చదరపు కి.మీ. విస్తరణలో ఉన్న ఈ నిక్షేప ప్రాంతాన్ని మరింత పరిశోధిస్తున్నారు.