వినూత్న నిరసనలతో సమైక్య పోరు
సమైక్యమే ఆశ.. శ్వాసగా జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర పరిరక్షణే మహా సంకల్పంగా సమైక్యవాదులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తమ వాదన గట్టిగా వినిపిస్తున్నారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయంపై అన్ని వర్గాల వారూ తమ నిరసనలను విభిన్న తరహాల్లో తెలియజేస్తున్నారు. బుధవారం జిల్లా అంతటా నిరసనలు హోరెత్తాయి.
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్రకు మద్దతుగా ఉయ్యూరులో బుధవారం నిర్వహించిన మహా రైతు గర్జనకు జనం పోటెత్తారు. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణాడెల్టా ఎడారిగా మారుతుందని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పామర్రులో జేఏసీ నాయకులు ఆకులను వస్త్రాలుగా చుట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. బీజేపీ జిల్లా యువమోర్చా అధ్యక్షుడు లావేటి వీరశివాజీ సమైక్యాంధ్ర విషయంలో బీజేపీ వైఖరిని నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అనిగండ్లపాడు గ్రామంలో ఆటోడ్రైవర్లు బంద్ నిర్వహించి ర్యాలీ చేపట్టారు. నూజివీడులో ‘సమైక్యాంధ్ర-ఆవశ్యకత’ అనే అంశంపై న్యాయవాదులు చర్చా కార్యక్రమం నిర్వహించారు.
నాగాయలంకలో 29 మంది మహిళలు దీక్ష చేశారు. చల్లపల్లిలో ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. సినీనటుడు మురళీమోహన్ మోపిదేవిలో చేపట్టిన సమైక్యాంధ్ర దీక్షకు మద్దతు తెలిపారు. మైలవరం మండలంలో ఉద్యోగ, ఆర్టీసీ, ఉపాధ్యాయ, ఎన్జీఓల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహిస్తున్న రిలే దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. ప్రైవేట్ వాహనాల బంద్‌ను పురస్కరించుకుని సమైక్యవాదులు మైలవరం యార్డు వద్ద జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు ప్రధాన రహదారిలో రెండోరోజూ ధర్నా చేపట్టారు.
కైకలూరు దీక్షలకు 50 రోజులు..
కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు బుధవారానికి 50వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షల్లో ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కైకలూరు తాలూకా సెంటర్‌లో ఎన్జీవో దీక్షలు 43వ రోజుకు చేరాయి. వారికి మద్దతుగా స్థానిక డిగ్రీ కళాశాల అధ్యాపకులు రిలేదీక్షలు చేశారు. కలిదిండిలో మూలలంక గ్రామస్తులు రిలే దీక్షలు నిర్వహించారు. ఉపాధ్యాయులు ప్లేట్లలో ఒట్టి గడ్డి ఉంచి నిరశనలు తెలిపారు. కోరుకొల్లులో విద్యార్థులు రాస్తారోకో చేశారు. మండవల్లిలో కొర్లపాడు గ్రామస్తులు రిలే దీక్షలు చేపట్టారు. ముదినేపల్లి జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు 30వ రోజుకు చేరాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ తిరువూరు తాలూకా ఎన్జీవో అసోసియేషన్, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చిట్టేలలో జలదీక్ష నిర్వహించారు.
రెండోరోజుకు ఆమరణదీక్ష..
జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో బీసీ నాయకులు తూమాటి కృష్ణమాచారి, వడేగర్ విజయకుమార్‌లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రతినిధులు రోడ్డుపై ప్లాట్‌ఫాం రిక్షాలు తొక్కి వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో అధ్యాపక, విద్యార్థుల నేతృత్వంలో వంటావార్పు నిర్వహించారు. గుడివాడ నెహ్రూచౌక్‌లో చేస్తున్న రిలేదీక్షలు 51వ రోజుకు చేరుకున్నాయి. ఉపాధ్యాయులు జై సమైక్యాంధ్ర అంటూ చేతులపై గోరింటాకు వేసుకుని నిరసన తెలిపారు.
నందివాడ మండల పరిధిలోని టెలిఫోన్‌నగర్ కాలనీలోఎంఎన్‌కే రహదారిపై ఉపాధ్యాయ జేఏసీ నేతలు మాక్‌డ్రిల్ నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ పరుచూరి అశోక్‌బాబును తెలంగాణవాదులు ‘నాలుక చీరుస్తా’ అని చేసిన వాఖ్యలకు నిరసనగా ఉపాధ్యాయులు తెలంగాణ వాదులకు సద్బుద్ధి కలిగించాలంటూ గుడివాడ పురపాలక కార్యాలయం ఎదుట రోడ్డుపై పొర్లుదండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. నూజివీడులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో స్థానిక జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 30వ రోజుకు చేరాయి. ఉద్యోగ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కంచికచర్ల జాతీయ రహదారిపై ర్యాలీలు, రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహించారు.
విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు జాతీయ రహదారిపైనే శీర్షాసనాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నూజివీడు బస్టాండు సెంటరులో మానవహారం నిర్వహించారు. మచిలీపట్నం ఫ్లవర్ డెకరేషన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. కోనేరుసెంటర్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మను అసోసియేషన్ నాయకులు, వర్కర్లు దహనం చేసి నిరసన తెలియజేశారు. కొంతమంది చిన్నారులు కోరుకొల్లు సీబీ కెనాల్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా జలదీక్ష చేశారు. కలిదిండి జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు వరిగడ్డి తింటూ నిరసన వ్యక్తం చేశారు.
రోడ్డుపై వరినాట్లతో నిరసన..
పెదపారుపూడిలో రోడ్డు పై వరినాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు. తిరువూరు మండలంలోని చిట్టేల వద్ద కట్టెలేరులో జలదీక్ష నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో పెడనలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో కృత్తివెన్ను మండలం పాశ్చాపురం గ్రామానికి చెందిన మహిళలు కూర్చున్నారు. తాడంకిలో జరిగిన దీక్షలో లారీఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని రాస్తారోకో చేశారు. వడ్రంగి మేస్త్రీలు రోడ్డు మీద పనిచేస్తూ నిరసన తెలిపారు.
కృష్ణానదిలో పడవలపై..
విజయవాడలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణానదిలో పడవలపై వినూత్న ప్రదర్శన చేశారు. సమైక్యాంధ్ర జెండాలు పట్టుకుని పడవలపై పున్నమిఘాట్ వద్ద నీటిలో నిరసన తెలిపారు. మూడో రోజు కూడా విద్యాసంస్థల బంద్ విజయవంతంగా జరిగింది.