- నూతన పాలకవర్గాలకు సమస్యల స్వాగతం
- జిల్లా అంతటా తాగునీటి సమస్య
- అధ్వానంగా డ్రెయిన్లు, అంతర్గత రోడ్లు
మచిలీపట్నం : ఎట్టకేలకు పురపాలక సంఘాల్లో నూతన పాలకవర్గాలు గురువారం నుంచి కొలువుదీరనున్నాయి. జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాలను గత మూడున్నర సంవత్సరాలుగా ప్రత్యేకాధికారులే పాలిం చారు. సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన తదితర అంశాల నేపథ్యంలో పాలన కుంటుపడింది. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
నందిగామ, ఉయ్యూరు, తిరువూరు నగర పంచాయతీల్లో తొలిసారిగా పాలకవర్గాలు పాలనా పగ్గాలు చేపట్టనున్నాయి. ప్రతి పురపాలక సఘంలోనూ తాగునీరు, డ్రెయినేజీ, అంతర్గత రహదారులు, డంపింగ్ యార్డులు, దోమల బెడద వంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. చాలా సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన పైప్‌లైన్లకు లీకేజీలు ఏర్పడి తాగునీరు కలుషితమవుతోంది.
జగ్గయ్యపేట, తిరువూరు వంటి పురపాలక సంఘాలకు నూతన పైప్‌లైన్ నిర్మాణం కలగానే మిగిలిపోయింది. కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్లు, డ్రెయినేజీలు ఏకమై మురుగునీరు రోడ్లపైనే ప్రవహించటం రివాజుగా మారింది. ఈ నేపథ్యంలో కొలువుదీరుతున్న నూతన పాలకవర్గాలకు ప్రధాన సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
ఉయ్యూరు నగర పంచాయతీలో తాగునీరు ప్రధాన సమస్యగా మారింది. నివేశనా స్థలాల కోసం వందలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఈ పురపాలక సంఘానికి సొంత భవనం లేదు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ సమస్య పట్టణవాసులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
తిరువూరు నగర పంచాయతీలోనూ తాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. రూ.100 కోట్ల అంచనాలతో కృష్ణానది నంచి పైప్‌లైన్ నిర్మాణానికి అంచనాలు రూపొందించి అనుమతి కోసం పంపారు. ఈ ప్రతిపాదనలు కాగితాలను దాటడం లేదు. పురపాలక సంఘానికి కార్యాలయం నిమిత్తం రూ.50 లక్షలతో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులు పునాదుల దశలోనే నిలిచిపోయాయి. డ్రెయినేజీ సమస్యతోపాటు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు లేరు.
నందిగామ నగర పంచాయతీలో మునేరు నుంచి పట్టణంలోకి తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన పైప్‌లైన్ దెబ్బతిన్నది. దీంతో గత నెల రోజులుగా పట్టణవాసులకు తాగునీటి సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. అంతర్గత రహదారులు దారుణంగా ఉన్నాయి. పురపాలక సంఘానికి కార్యాలయ భవనం లేదు. సిబ్బంది కొరత ఉంది.
గుడివాడలో పురపాలక సంఘ నూతన భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన పైపులైన్లు లీకవుతూ తాగునీరు కలుషితమవుతోంది. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. నూతనంగా నిర్మించిన కాలనీల్లో మౌలిక వసతుల కల్పన కలగానే మిగిలింది.
పెడన పురపాలక సంఘంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. రూ.2 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మించేందుకు రూపొందిం చిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ ఇబ్బందికరంగా మారింది. డంపింగ్ యార్డు అవసరం. ఎన్టీఆర్ కాలనీ, వైఎస్సార్ కాలనీ, బ్రహ్మపురం తదితర ప్రాంతాల్లో తాగునీరుతోపాటు అనేక సమస్యలు తిష్టవేశాయి.
జగ్గయ్యపేటలో తాగునీటి సమస్య పరిష్కారానికి ముక్త్యాల నుంచి 9 కిలో మీటర్ల మేర పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా కార్యరూపం దాల్చలేదు. పట్టణం నడిబొడ్డున ఉన్న చెరువు అభివృద్ధికి నోచుకోవటం లేదు. డంపింగ్‌యార్డు సమస్య ఏళ్ల తరబడి అలాగే ఉంది.
నూజివీడులో రూ.66 కోట్లతో నిర్మిస్తున్న పైప్‌లైన్ పనులు పూర్తికావాల్సి ఉంది. విజయవాడ సమీపంలోని గొల్లపూడి నుంచి నూజివీడు వరకు ఈ పైప్‌లైన్‌ను నిర్మిస్తున్నారు.
మచిలీపట్నంలో డ్రెయినేజీ సమస్య ప్రధానంగా ఉంది. తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి మచిలీపట్నం పుట్లమ్మచెరువు వరకు 11.5 కిలోమీటర్ల మేర తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైప్‌లైన్లకు లీకేజీలు ఏర్పడి నీరు వృథా అవుతోంది. రూ. 80 కోట్లతో ప్రారంభించిన ఓపెన్ డ్రెయినేజీ పనులు కూడా నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. డంపింగ్‌యార్డు సమస్య ఉంది.