కాంగ్రెస్‌కు అభ్యర్థి దొరికాడోచ్..
- బందరు లోక్‌సభకు శ్రీనాథ్
- బాడిగ స్వతంత్ర బాట?
- మారుతున్న సమీకరణలు
సాక్షి, మచిలీపట్నం : ఆర్థిక తోడ్పాటు అందిస్తామన్నా అభ్యర్థి దొరకని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరికాడని సంబరపడాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజాగ్రహ జ్వాలల్లో కాంగ్రెస్, టీడీపీలు మాడి మసైపోతాయన్న భయం ఆ పార్టీ నేతలను ఆవరించింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన టీడీపీ జిల్లాలో కాంగ్రెస్ నకలుగా మారిపోయింది.
జిల్లాలో వైఎస్సార్‌సీపీ గాలి పెరగడంతో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై ముందు నుంచి కసరత్తు చేసింది. అంతకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం వెదుకులాట చేపట్టినా ఫలితం దక్కలేదు. ఖర్చులకు ఎదురు డబ్బులు ఇస్తామన్నా.. ఓడిపోయేదానికి ఎందుకొచ్చిన ప్రయత్నం అంటూ అభ్యర్థులు ముందుకు రాలేదు. దీంతో ఈసారికి చిత్తుగా ఓడిపోయినా పోటీ పెట్టినట్టు పరువు దక్కించుకునేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలూ చేసింది.
గత నెలలో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశానికి వెళ్లిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు జిల్లా అభ్యర్థుల జాబితాను సేకరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాద్ సమావేశంలో ప్రతి నియోజకవర్గానికి ఏదో ఒక పేరును ప్రకటించేలా నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేపడుతున్నారు.
ఇప్పటికే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను ప్రకటించడం, ఆయన ప్రచారం ప్రారంభించడం జరిగింది. మచిలీ పట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలుత ఐలాపురం వెంకయ్య కుమారుడు రాజా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణకు టీడీపీ సీటు దక్కకుంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఇవేమి కాదని ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ సోదరుడు బూరగడ్డ శ్రీనాథ్ పేరును పీసీసీ ఆమోదం కోసం పంపించినట్టు సమాచారం.
వైద్య వృత్తిలో కొనసాగుతున్న శ్రీనాథ్ హైదరాబాద్‌లో ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌లో పలు పదవులు నిర్వహించిన శ్రీనాథ్ తన తండ్రి బూరగడ్డ నిరంజన్‌రావు, సోదరుడు వ్యాస్ పోటీచేసిన ఎన్నికల్లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా వ్యవహరించేవారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన్ను ఖరారు చేస్తే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్టు అవుతుంది. ఇదే విషయమై శ్రీనాథ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తనకు కాంగ్రెస్ బందరు ఎంపీ టిక్కెట్ దాదాపు ఖరారైనట్టేనని స్పష్టం చేశారు. రాజకీయంగా పట్టు నిలుపుకొనేందుకు వ్యాస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టే శ్రీనాథ్ పోటీ ఆధారపడి ఉంటుందని ఆంతరంగికులు చెబుతున్నారు.
బాడిగ స్వతంత్ర బాట..
అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్ పార్టీల్లో అవకాశం దక్కని మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే యోచనలో ఉన్నట్టు పలువురు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎంపీగా పనిచేసి బాడిగ ఇటీవల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారవడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసే సాహసం చేయలేకపోతున్నారు. ఇదే క్రమంలో ఆయన టీడీపీ ఎంపీ టిక్కెట్ కోసం విఫలయత్నం చేసినట్టు సమాచారం. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మచిలీపట్నం కదిలేందుకు ససేమిరా అనడంతో బాడిగ ప్రయత్నాలు నెరవేరలేదని చెబుతున్నారు.
టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొనకళ్ల నారాయణరావును చంద్రబాబు బుధవారం ప్రకటించారు. దీంతో టీడీపీ సీటు కోసం బాడిగ ప్రయత్నాలకు తెరపడినట్టేనని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఆయన పోటీకి సుముఖంగా లేకపోవడంతో శ్రీనాథ్ పేరు తెరమీదకు తెచ్చారు. దీంతో బాడిగ రాజకీయంగా పట్టు కోసం స్వతంత్ర బాట పడతారని ఆయన అనుయాయులు చెబుతుండటం కొసమెరుపు.