=సాగులో పెరిగిన వ్యయం.. తగ్గిన సాయం
=అడుగడుగునా అవాంతరాలు
= పట్టని పాలకులు
=కష్టాల కడలిలో కర్షకులు
=పెరుగుతున్న ఆత్మహత్యలు
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో దాదాపు 13.50 లక్షల ఎకరాల్లో 3.80 లక్షల మంది రైతులు స్వేదం చిందిస్తున్నారు. వీరిలో కౌలురైతులే అధికం. సార్వాలో 6.42 లక్షల ఎకరాల్లో వరి, 1.37 లక్షల ఎకరాల్లో పత్తి, 1.40 లక్షల ఎకరాల్లో ఆక్వా, ఇంకా మొక్కజొన్న, మిర్చి, వేరుశనగ, పసుపు, సుబాబుల్, అరటి, తమలపాకులు, కూరగాయలు సాగు చేస్తున్నారు.
సాగునీటికి ఇక్కట్లే..
జిల్లా రైతాంగానికి ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సాగునీటి ఇక్కట్లు వెన్నాడుతూనే ఉన్నాయి. వాస్తవానికి వ్యవసాయ రంగానికి సకాలంలో నీరిందించిన ఘనత ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డిలకే దక్కింది. వారి హయాంలో జూన్ ఒకటో తేదీకే కృష్ణా డెల్టాకు నీరిచ్చి రైతులకు ఊతమిచ్చారు. ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరేజ్ నీరున్న సమయాల్లోను ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు సాగునీటి అవసరాలను తీర్చారు.
చంద్రబాబు పాలనలో సాగునీటి విడుదల అదుపుతప్పి వ్యవసాయరంగం సంక్షోభంలో పడింది. ఇక కిరణ్ సర్కార్ గత ఏడాది అక్టోబర్ 15 వరకు నీరివ్వకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. సాగు ఆలస్యమై దిగుబడి దెబ్బతింది. మూడేళ్లుగా రెండో పంట లేని దుస్థితి దాపురించింది. ఈ పరిస్థితుల్లో రైతులు వ్యవసాయంపై ఆశ వదిలేసి కూలీలుగా మారితే అన్నపూర్ణలాంటి జిల్లా బీడువారే ప్రమాదం ఉంది.
విత్తనాలు,ఎరువులకు ఆధార్ మెలిక..
రైతులపై విత్తనాలు, ఎరువుల ధరలు దరువేస్తున్నాయి. వీటికిచ్చే సబ్సిడీని ఆధార్ కార్డు ఆధారంగా బ్యాంకు ఖాతాలకు జమచేస్తామంటూ ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. ఆధార్ కార్డులు పూర్తిగా రాని తరుణంలో ఈ నిబంధన రైతులకు ఇబ్బందికరంగా మారింది. వైఎస్ మరణానంతరం కాంగ్రె్‌స్ సర్కార్ తీరుతో జిల్లా రైతులపై దాదాపు 150 నుంచి 200 శాతం వరకు ఎరువుల ధరల భారం పెరిగింది.
వణికిస్తున్న తుపానులు..
ఒకవైపు నీటి విడుదల జాప్యంతో సాగు ఆలస్యమవుతుంటే, మరోవైపు అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుస తుపానులతో రైతులు తల్లడిల్లుతున్నారు. ఫై-లీన్ తుపాను గండం దాటినా, తరువాత వచ్చిన హెలెన్ తుపాను వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేసింది. ఈ తుపాను ధాటికి జిల్లాలో 84 వేల ఎకరాల్లో వరి, 51,622 ఎకరాల్లో పత్తి, 1,670 ఎకరాల్లో మొక్కజొన్న, 2,125 ఎకరాల్లో వేరుశనగ, 3,747 ఎకరాల్లో కూరగాయలు, 1,500 ఎకరాల్లో పసుపు, 2,950 ఎకరాల్లో మిర్చి, 650 ఎకరాల్లో అరటి, 250 ఎకరాల్లో తమలపాకు, 90 ఎకరాల్లో బొప్పాయి, 200 ఎకరాల్లో మినుము పంట తీవ్రంగా దెబ్బతింది. సమైక్య ఉద్యమం సందర్భంగా ఎగుమతులు లేక ఎదిగిన చేపలు, రొయ్యలను చెరువుల్లోనే పెంచిన ఆక్వా రైతులు సైతం తుపాను కారణంగా ఆక్సిజన్ సమస్య వచ్చి నట్టేట మునిగిపోతామని ఆందోళన చెందుతున్నారు.
ధరలోనూ దగా..
అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కక దగా పడుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం క్వింటాలు ధాన్యం ఉత్పత్తికి రూ.1,760 ఖర్చవుతుంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,310 మాత్రమే. అంటే మద్దతు ధరకు ధాన్యం అమ్ముడైనా క్వింటాళ్లకు రూ.450 చొప్పున రైతులు నష్టపోతున్నారు. పత్తి విషయానికి వస్తే క్వింటాలుకు రూ.5,950 ఉత్పత్తి ఖర్చులైతే ప్రభుత్వం మద్దతు ధర రూ.4 వేలు ప్రకటించింది. వాస్తవానికి రూ. 3,500లకే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. అటు పత్తి రైతు కూడా దాదాపు రూ.2,450 వరకు నష్టపోతున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిని దళారులు అయినకాడికి కొనుగోలు చేయగా, మరికొన్ని చోట్ల రంగుమారిన పత్తిని కొనే నాథుడు లేక నందిగామ ప్రాంతంలోని రైతులు రోడ్డుపక్కన పడేయాల్సిన దుస్థితి నెలకొంది.
నేతల మాటలు నీటిమూటలు..
నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామంటూ కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. జిల్లాలో మూడేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతులకు దాదాపు రూ.37 కోట్ల పరిహారాన్ని ఇంతవరకు అందించలేదు. నీలం తుపాను పరిహారం కొంతమేర ఇచ్చి అయిందనిపించారు. ఇటీవల అవనిగడ్డకు వచ్చిన ముఖ్యమంత్రి ఇన్‌పుట్ సబ్సిడీ ఎకరానికి రూ.4 వేలకు పెంచినట్టు గొప్పలు చెప్పినా.. జిల్లా రైతులకు నష్టపరిహారం అందలేదు. తీరుబడిగా జిల్లాలో పర్యటించిన జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి రైతులను ఆదుకుంటామంటూ ప్రకటనలిచ్చారు తప్ప ఫలితం లేదు.
ఉసురుతీసుకుంటున్నారు..
ఆదుకోవాల్సిన పాలకులు అలక్ష్యం చేయడంతో కష్టాల కాడి మోయలేక కర్షకులు చతికిలపడిపోతున్నారు. పెట్టుబడి పెట్టిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 1998 నుంచి గత ఏడాది వరకు జిల్లాలో 68 మంది రైతులు చనిపోయారు. గత పదిహేను రోజుల్లో ఐదుగురు కౌలు రైతులు మృత్యువాత పడ్డారు. బుధవారం అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో తక్కెళ్ల నాగరాజు (33) అనే కౌలురైతు దెబ్బతిన్న పంటను చూసి మరణించాడు.
వైఎస్ హయాం.. స్వర్ణయుగం
వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగం స్వర్ణయుగంలా ఉండేది. ఆయన హయాంలో ఎరువులపై ఒక్క రూపాయి భారం మోపలేదు. చంద్రబాబు హయాంలో 1999 నుంచి 2004లో ధాన్యం మద్దతు ధర క్వింటాలుకు రూ.60 (12.50 శాతం) పెంచితే వైఎస్ 2004 నుంచి 2009 మధ్య మద్దతు ధర క్వింటాలుకు రూ.450 (82 శాతం) అందించారు. అదే కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.310 (31 శాతం) పెంచారు. బాబు పాలనలో వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకునేలా వైఎస్ జీవో కూడా తెచ్చారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ సర్కార్ ఆ జీవో అమలును నిర్లక్ష్యం చేసి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలు నమోదు చేయడంలో కొర్రీలు వేస్తోంది.
-ఎం.వి.ఎస్.నాగిరెడ్డి,
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్