
అక్కడో మాట..ఇక్కడో మాట
రాయలసీమ జిల్లాల్లో కురిసే వర్షపాతం కంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నమోదయ్యే వర్షపాతం చాలా తక్కువ. కానీ..
సాక్షి ప్రతినిధి, ఏలూరు :‘రాయలసీమ జిల్లాల్లో కురిసే వర్షపాతం కంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నమోదయ్యే వర్షపాతం చాలా తక్కువ. కానీ.. అక్కడ పంటలు పుష్కలంగా పండుతాయి. కారణం గోదావరి నదికి భారీగా వరద నీరు రావడం. ఇప్పుడు ఆ నీటిని ఒడిసి పట్టి పోలవరం కుడికాలువ ద్వారా రాయలసీమకు మళ్లిస్తా. మీ సాగునీటి కష్టాలు తీరుస్తా. 70 టీఎంసీల నీరు కచ్చితంగా వచ్చి చేరుతుంది. రుణమాఫీ కంటే కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తా’ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు గురువారం చిత్తూరు జిల్లాలో జరిగిన రైతు సాధికార సదస్సులో చేసిన ప్రకటన ఇది. ‘నాలుగేళ్లలో పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ఈలోగా సముద్రంలోకి వృథాగా పోతున్న మిగులు జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లిస్తాం. దీనిపై ఇక్కడి రైతుల్లో కొందరు అనుమానాలు రేకెత్తిస్తున్నారు. నాకు ముందుగా గోదావరి జిల్లాల రైతులే ముఖ్యం. ఇక్కడ రెండో పంటకు కూడా నీరిచ్చిన తర్వాతే సముద్రంలోకి వృథాగాపోతున్న 3 వేల టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తాం’ పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో శుక్రవారం జరిగిన సదస్సులో అదే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి.
రుణమాఫీ కంటే కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాయలసీమకు గోదావరి నీటిని మళ్లిస్తామని చిత్తూరులో బహిరంగంగా ప్రకటించిన చం ద్రబాబు మరుసటి రోజు గోదావరి జిల్లాకు వచ్చేసరికి ఎక్కడా రాయల సీమ ఊసెత్తలేదు. నేరుగా ఎత్తిపోతల ప్రాజెక్టు అని కూడా అనకుండా మిగులు జలాలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని అస్పష్టంగా మాట్లాడారు. ఒక్కరోజు వ్యవధిలోనే మాట మార్చిన చంద్రబాబు వైఖరిని ఎలా నమ్మేదంటూ డెల్టా రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘తొమ్మిదేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పశ్చిమగోదావరి జిల్లాలో వచ్చిన ఎన్నికల ఫలితాలే కారణం. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిది. ఎక్కడా జరగని అభివృద్ధి చేసి రుణం తీర్చుకునే యత్నం చేస్తాను’ అని జిల్లాకు వచ్చినప్పుడల్లా పదే పదే ప్రకటనలు చేసే చంద్రబాబు ఇప్పుడు జిల్లా రైతులకు ఆశనిపాతంలా మారే నిర్ణయం తీసుకుంటున్నారంటూ రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి మాటలు అక్కడ చెబుతూ ఇరు ప్రాంతాలనూ మోసం చేసే బాబు వైఖరిని ఎండగడుతూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు.
గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు దిగువన పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. పోలవరం పూర్తయ్యేలోగా ఎత్తిపోతల పథకం ద్వారా వరద నీటిని, సముద్రం పాలయ్యే మిగులు జలాలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని సర్కారు చెబుతోంది. రూ.1,800 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ భారీ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ర్ట భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు.
శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు సముద్రంలోకి వృథాగా పోతున్న వరద నీటిని డెల్టాకు మళ్లిస్తామని ప్రకటించారు. వాస్తవానికి గోదావరికి సగటున వరద కాలం 45 రోజులు కాగా, గత కొన్నేళ్లుగా కనీసం 30 రోజులకు కూడా వరద నీరు భారీగా వస్తున్న దాఖ లాలు లేవు. గత ఏడేళ్లుగా ఉభయ గోదావరి జిల్లాల్లో రబీకి తీవ్ర నీటి ఎద్దడి తలెత్తుతోంది. దీంతో గోదావరికి సీలేరు జలాల మళ్లించి పంటలను రక్షించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు నానాతంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పథకం నిర్మించి కృష్ణాడెల్టాకు మళ్లిస్తే పశ్చిమలో సాగు, తాగు, ఆక్వా అవసరాలకు నీరు అందకపోతే ఎవరు బాధ్యత వహిస్తారనే ది ప్రశ్నార్థకంగా మారింది.
డెల్టా ఆయకట్టుకూ ప్రమాదం
గోదావరి నదిపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తే రూ.1,800 కోట్లను గోదావరిలో వృథాగా పోసినట్టేనని ఇంజినీరింగ్ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ పథకం వల్ల డెల్టా ఆయకట్టూ ప్రమాదకరంగా మారుతుందనేది నిపుణుల వాదన. గోదావరిలో వరద ప్రవాహం ఒక్కో ఏడాది ఒక్కో రకంగా ఉంటోంది. తక్కువగా ఉన్న సమయంలో ఉన్న కొద్దిపాటి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తే పశ్చిమ డెల్టా ఆయకట్టులో రెండో పంటకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుంది. ఇక ఎత్తిపోతల పథకం పూర్తయి కృష్ణా డెల్టాకు నీరు మళ్లించడం మొదలైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం ఉంటుందనేది ఇంజినీరింగ్ నిపుణుల వాదన.
భూ సేకరణకు అడ్డంకులు
ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 4.5 కిలోమీటర్ల పొడవునా 2,500 ఎకరాల భూములు సేకరించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలోని భూములన్నీ సారవంతమైనవి కావడంతో రైతులు ఇందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించడంతోపాటు నిరసన గళం విప్పేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తాడిపూడి, చింతలపూడి, పైడిమెట్ట ఎత్తిపోతల పథకాలతో పాటు కొవ్వాడ కాలువ విస్తరణ, అవుట్‌పాల్ స్లూయిస్ నిర్మాణాల పేరుతో చేపట్టిన భూసేకరణ కారణంగా ఈ ప్రాంత రైతులు ఇప్పటికే చాలా భూములు కోల్పోయారు. మళ్లీ పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వడానికి సుముఖంగా లేమని తెగేసి చెబుతున్నారు.
సొమ్ము వృథా
176 కిలోమీటర్ల పొడవున్న పోలవరం కుడి ప్రధాన కాలువ నిర్మాణానికి సుమారు 40 కిలోమీటర్ల మేర భూ సేకరణ, కోర్టు వివాదాలు అడ్డంకిగా మారాయి. ఈ ప్రక్రియను ఎంత వేగంగా చేసినా 8 నెలల్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. పోలవరం కుడి కాలువ పనులు పూర్తి కాకుండా పట్టిసీమ ఎత్తిపోతలకు ఓ రూపు రాదు. కుడి కాలువ పనులు, పట్టిసీమ ఎత్తిపోతల పనులు ప్రభుత్వం ఎంత వేగంగా చేసినా రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. నాలుగేళ్లలో పోల వరం పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం కేవలం రెండేళ్ల కోసం రూ.1,800 కోట్లు ఖర్చు చేయడాన్ని నీటిపారుదల శాఖ నిపుణులు తప్పు పడుతున్నారు. సీఎం చంద్రబాబు చెబుతున్నట్టుగా పోలవరం ప్రాజెక్ట్ నాలుగేళ్ల కాలంలో పూర్తయితే పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ఖర్చు చేసే నిధులను వృథా చేయడమేనన్నది నిపుణుల వాదన.
చింతలపూడి పథకాన్ని పూర్తిచేస్తే ఎత్తిపోతలతో పనిలేదు
జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 15 మండలాల పరిధిలోని 160 గ్రామాలకు చెందిన 2 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు రూపొందించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు సర్కారు చొరవ చూపడం లేదు. 2008లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు 2013 నాటికే పూర్తి కావాల్సి ఉంది. చింతలపూడి మొదటి దశ ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తే 14.5వ కిలోమీటర్ వద్ద పోలవరం కుడి ప్రధాన కాలువకు కలపవచ్చు. తద్వారా ఎత్తిపోతల అవసరం లేకుండానే 1,977 క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించవచ్చని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.
రైతుల్ని ముంచుతున్నారు
నాకున్నది ఎకరం భూమి ఇది కూడా తీసుకుంటే మా పరిస్థితి ఏమిటి. పైగా ఈ పథకం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కృష్ణా డెల్టా కోసం పశ్చిమ గోదావరి జిల్లా రైతులను ముంచుతున్నారు.
- కన్నూరి రామారావు, రైతు,
బంగారమ్మ పేట, పశ్చిమగోదావరి జిల్లా
ఇప్పుడెంత నష్టపోవాలో
పోలవరం కుడి ప్రధాన కాలువ నిర్మాణం వల్ల రెండు ఎకరాలు పోయింది. ఇంకా మూడు ఎకరాలు ఉంది. ఇప్పుడు ఎత్తిపోతలతో ఎంత నష్టపోవాలో.
- సానా నారాయణ, రైతు, పట్టిసీమ, పశ్చిమగోదావరి జిల్లా
పోలవరం మరుగున పెట్టేందుకే..
పోలవరం ప్రాజెక్టును మరుగున పెట్టేందుకే ప్రభుత్వం పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని చూస్తోంది. ఇది పూర్తి కావడానికి మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని సీఎం ప్రక టిస్తున్నప్పుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనవసరం. పోలవరం పూర్తయితే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.వందలాది కోట్లు వృథా అవుతాయి.
- విప్పర్తి వే ణుగోపాలరావు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, గోదావరి హెడ్ వర్క్స్, ధవళేశ్వరం
అవసరం లేదు
ఎత్తిపోతల పథకం వల్ల చేకూరే ప్రయోజనమే పోలవరం ప్రాజెక్టు ద్వారా కలుగుతుంది. ఎత్తిపోతలకు మళ్లీ రైతుల నుంచి భూములను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాజె క్టు కోసం ఇప్పటికే భూములను తీసుకున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మించే నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. లేదంటే రైతులు, ప్రజల తరపున కమ్యూనిస్టు పార్టీ పోరాటానికి సిద్ధమవుతుంది.
- డేగల ప్రభాకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి