Krishna Water Dispute Hearing: Chief Justice Hima Kohli Impatient With TS Govt Petition - Sakshi
Sakshi News home page

Krishna Water: జడ్జీలకు ఉద్దేశాలను అంటగడతారా?: హైకోర్టు సీజే ఆగ్రహం

Published Wed, Jul 7 2021 2:19 AM | Last Updated on Wed, Jul 7 2021 10:49 AM

Chief Justice Hima Kohli is impatient with the TSAG - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి.. కృష్ణా డెల్టా రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ నుంచి ఆయన తప్పుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా కేసులను విచారించే న్యాయమూర్తులకు ఉద్దేశాలను ఆపాదిస్తారా? ప్రాంతీయ భావంతో చూస్తారా? అంటూ మండిపడ్డారు. న్యాయస్థానం ప్రథమ కోర్టు అధికారైన అడ్వొకేట్‌ జనరల్‌ న్యాయమూర్తుల నిజాయితీని అనుమానిస్తూ... ఉద్దేశాలను ఆపాదిస్తూ అవమానించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

కేసులను ఏ న్యాయమూర్తి విచారించినా మెరిట్స్‌ మీద వాదనలు వినిపించాలే తప్ప... న్యాయమూర్తులకు ఇలా నీచమైన, హీనమైన ఉద్దేశాలను ఆపాదించరాదని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 34 ఆధారంగా విద్యుత్‌ ఉత్పత్తితో పులిచింతల ప్రాజెక్టు నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారని, దీంతో తమ సాగునీటికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందంటూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు జి.శివరామకృష్ణ ప్రసాద్, ఎం.వెంకటప్పయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను ఏ ధర్మాసనం విచారించాలన్న దానిపై సందిగ్ధత ఏర్పడిన నేపథ్యంలో... ఎవరు విచారించాలన్నది నిర్ణయిస్తామని సీజే పేర్కొన్నారు. తదుపరి విచారణను రెండుమూడు రోజుల్లో తెలియజేస్తామని స్పష్టం చేశారు.  

మళ్లీ ఏజీ అభ్యంతరం.. సీజే ఆగ్రహం 
మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం కేసుల విచారణ ప్రారంభించగానే అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హాజరై.. నీటిపారుదల ప్రాజెక్టుల కేసులను ఇదే(సీజే) ధర్మాసనం విచారించాలని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అభ్యంతరం వ్యక్తం చేసినా.. జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం కృష్ణా డెల్టా రైతుల పిటిషన్‌ను విచారిస్తోందని చెప్పారు. అక్కడ విచారించకుండా ఇక్కడికి బదిలీ చేసేలా చూడాలని కోరారు. జస్టిస్‌ రామచందర్‌రావు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి విచారించరాదంటూ తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసిందని రైతుల తరఫున సీనియర్‌ న్యాయవా ది వేదుల వెంకటరమణ నివేదించారు. దీంతో జస్టిస్‌ హిమాకోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏవో ఊహించుకొని నిజాయితీ, నిబద్ధత కల్గిన న్యాయమూర్తిని విచారణ నుంచి తప్పుకోవాలని ఎలా కోరతారంటూ ఏజీపై మండిపడ్డారు. న్యాయమూర్తికి ప్రాంతీయ భావాన్ని అంటగడుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాల ని ఆదేశించారు. న్యాయమూర్తులెవరికీ వ్యక్తిగత ఉద్దేశాలు, అభిప్రాయాలు ఉండవని, మెరిట్స్‌ ఆధారంగా తీర్పులిస్తారని స్పష్టం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులపై పిటిషన్లను తమ ధర్మాసనం, రాష్ట్ర పునర్విభజన చట్టంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుందన్నారు.

డెల్టా రైతుల పిటిషన్‌లో ఈ రెండు అంశాలు ఉన్నందున ఏ ధర్మాసనం విచారించాలన్న దానిపై సందేహం తలెత్తిందని, వివరణ తీసుకునేందుకు రిజిస్ట్రీ అధికారులకు తగిన సమయం ఇవ్వాల్సిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫోరం హంటింగ్‌ (నచ్చిన ధర్మాసనానికి బదిలీ కోసం) చేస్తున్నట్లుగానే మీరు ఆఘమేఘాల మీద విచారణ చేయాలని ఎందుకు కోరారని, రిజిస్ట్రీకి కొంత సమయం ఇవ్వాల్సిందంటూ వెంకటరమణపై అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనా విచారణ ఆపాలని కోరుతూ తన ముందు ప్రస్తావించిన విషయాన్ని జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు ధర్మాసనానికి తెలియజేసి విచారణ ఆపాలని కోరాలని సూచించారు. ఈ పిటిషన్‌ను ఏ ధర్మాసనం విచారించాలన్నది తేలుస్తామన్నారు. ఈ కేసు ఫైల్‌ను తన ముందుంచాలని రిజిస్ట్రీ అధికారులను ఆదేశించారు.

సీజే సూచన మేరకే విచారించాం...
జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు ధర్మాసనం కృష్ణా డెల్టా రైతుల పిటిషన్‌పై విచారణను ప్రారంభించగానే.. సీజే ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను ఆపాలని సూచించారని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. ‘ఈ విషయంపై మాకు సమాచారం లేదు. సోమవారం తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఇదే అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజిస్ట్రీ అధికారులు విషయాన్ని సీజేకు తెలియజేశారు. ఈ పిటిషన్‌పై సీజే సమాచారం ఇచ్చిన తర్వాతే విచారించాలని నిర్ణయించాం. మీ అభ్యంతరాలను తోసిపుచ్చి విచారణ ప్రారంభించాం.

పిటిషన్‌ విచారణార్హతపై కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదావేశాం. ఒకసారి విచారణ ప్రారంభించిన తర్వాత మళ్లీ మరో ధర్మాసనానికి పంపాలని కోరడం ఏంటి?’అని జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే విచారణను భోజన విరామం తర్వాతకు వాయిదా వేయాలని, అప్పటిలోగా సమాచారం వస్తుందని ఏజీ తెలిపారు. భోజన విరామం తర్వాత ఈ పిటిషన్‌ను రిజిస్ట్రీకి పంపాలని సీజే సూచించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వెంకటరమణ నివేదించారు. ఎవరు విచారించాలన్నది నిర్ణయిస్తామని పేర్కొన్నారని తెలిపారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం.. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పేర్కొంటూ ఈ పిటిషన్‌ను రిజిస్ట్రీకి పంపాలని ఆదేశించింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement