గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఆంక్షలపై హైకోర్టు స్టే
విద్యుత్ బిడ్డింగ్‌లకు అనుమతించాలని ఆదేశం
కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశం
తెలంగాణ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. పవర్ ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)పై గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా విధించిన ఆంక్షలపై స్టే విధించింది. ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరిపేందుకు టీజీఎస్పీడీసీఎల్‌కు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ బిడ్డింగ్‌కు అనుమతించాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్‌ఎల్‌డీసీ)ను ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
అత్యవసరంగా హైకోర్టులో కేసు
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్)కు రూ.261.31 కోట్ల చార్జీలను బకాయిపడినందుకు పవర్ ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా టీజీఎస్పీడీసీఎల్‌పై గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా గురువారం ఉదయం ఆంక్షలు విధించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అత్యవసరంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి.. ఈ నిర్ణయంపై స్టే విధించాలని కోరింది.
నిషేధంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రాష్ట్రానికి మొత్తం విద్యుత్ కొనుగోళ్లు ఆగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. రోజుకు 60 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్లు నిలిచిపోతాయని.. వ్యవసాయం, పరిశ్రమలు, ఆస్పత్రులు, గృహాలు.. ఇలా యావత్ రాష్ట్రానికి ఇబ్బంది ఏర్పడుతుందని వివరించింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు.
కమిషన్ వద్ద పెండింగ్‌లో పిటిషన్
ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పీజీసీఐఎల్‌కు రూ.261.31 కోట్ల చార్జీల చెల్లింపు విషయంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) వద్ద కేసు పెండింగ్‌లో ఉండగా, ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. రూ.261.31 కోట్ల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనందునే లేట్ పేమెంట్ సర్‌చార్జీ నిబంధనల మేరకు ఆంక్షలు విధించినట్లు చెప్పారు. బకాయి పడిన మొత్తంలో 25 శాతం చెల్లించాలని గత ఫిబ్రవరిలో సూచించామని, అయినా చెల్లించలేదని పీజీసీఐఎల్ తరఫు న్యాయవాది తెలిపారు.
గ్రిడ్ కంట్రోలర్‌కు అధికారం లేదు
వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘రూ.261.31 కోట్ల చార్జీల చెల్లింపు వ్యవహారం సీఈఆర్సీలో పెండింగ్‌లో ఉన్నందున విద్యుత్ క్రయవిక్రయాలపై నిషేధం విధిస్తూ తెలంగాణ పేరును ప్రాప్తి పోర్టల్‌లో ప్రచురించే అధికారం గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు లేదు. అందువల్ల లేట్ పేమెంట్ సర్‌చార్జ్ నిబంధనల ప్రకారం ప్రాప్తి వెబ్‌సైట్‌లో ప్రచురణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఈ ఆదేశాలను వెంటనే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర విద్యుత్ శాఖకు తెలియజేయాలని డీఎస్‌జీకి సూచిస్తున్నాం’ అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment