Power Grid Corporation
-
విద్యుత్ క్రయవిక్రయాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. పవర్ ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)పై గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా విధించిన ఆంక్షలపై స్టే విధించింది. ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరిపేందుకు టీజీఎస్పీడీసీఎల్కు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ బిడ్డింగ్‌కు అనుమతించాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)ను ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అత్యవసరంగా హైకోర్టులో కేసు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్)కు రూ.261.31 కోట్ల చార్జీలను బకాయిపడినందుకు పవర్ ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా టీజీఎస్పీడీసీఎల్పై గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా గురువారం ఉదయం ఆంక్షలు విధించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అత్యవసరంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి.. ఈ నిర్ణయంపై స్టే విధించాలని కోరింది. నిషేధంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రాష్ట్రానికి మొత్తం విద్యుత్ కొనుగోళ్లు ఆగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. రోజుకు 60 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్లు నిలిచిపోతాయని.. వ్యవసాయం, పరిశ్రమలు, ఆస్పత్రులు, గృహాలు.. ఇలా యావత్ రాష్ట్రానికి ఇబ్బంది ఏర్పడుతుందని వివరించింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. కమిషన్ వద్ద పెండింగ్‌లో పిటిషన్ ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పీజీసీఐఎల్‌కు రూ.261.31 కోట్ల చార్జీల చెల్లింపు విషయంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) వద్ద కేసు పెండింగ్‌లో ఉండగా, ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. రూ.261.31 కోట్ల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనందునే లేట్ పేమెంట్ సర్‌చార్జీ నిబంధనల మేరకు ఆంక్షలు విధించినట్లు చెప్పారు. బకాయి పడిన మొత్తంలో 25 శాతం చెల్లించాలని గత ఫిబ్రవరిలో సూచించామని, అయినా చెల్లించలేదని పీజీసీఐఎల్ తరఫు న్యాయవాది తెలిపారు. గ్రిడ్ కంట్రోలర్‌కు అధికారం లేదు వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘రూ.261.31 కోట్ల చార్జీల చెల్లింపు వ్యవహారం సీఈఆర్సీలో పెండింగ్‌లో ఉన్నందున విద్యుత్ క్రయవిక్రయాలపై నిషేధం విధిస్తూ తెలంగాణ పేరును ప్రాప్తి పోర్టల్‌లో ప్రచురించే అధికారం గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు లేదు. అందువల్ల లేట్ పేమెంట్ సర్‌చార్జ్ నిబంధనల ప్రకారం ప్రాప్తి వెబ్సైట్లో ప్రచురణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఈ ఆదేశాలను వెంటనే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర విద్యుత్ శాఖకు తెలియజేయాలని డీఎస్జీకి సూచిస్తున్నాం’ అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు భారీ షాక్!
న్యూఢిల్లీ: పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు స్టాక్ ఎక్సే్ఛంజీలు షాకిచ్చాయి. కంపెనీ బోర్డులో అవసరమైనమేర స్వతంత్ర డైరెక్టర్లు లేరని జరిమానాలు విధించాయి. నిబంధనలకు అనుగుణంగా ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఒక మహిళా స్వతంత్ర డైరెక్టర్‌కు సైతం చోటు కల్పించడంలో విఫలమైనట్లు పేర్కొన్నాయి. వెరసి రూ. 5.36 లక్షలు చొప్పున చెల్లించమంటూ పవర్‌గ్రిడ్‌ను బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా ఆదేశించాయి. అయితే సెబీ నిబంధనల అమలు నుంచి కంపెనీకి వెసులుబాటు కల్పించవలసిందిగా ఈ నోటీస్‌పై స్పందిస్తూ స్టాక్ ఎక్సే్ఛంజీలను పవర్‌గ్రిడ్ కోరింది. ప్రభుత్వ రంగ సంస్థగా బోర్డు పదవుల నియామకాన్ని రాష్ట్రపతి చేపట్టవలసి ఉన్నట్లు పేర్కొంది. స్వతంత్ర డైరెక్టర్ల నియామక అంశాన్ని సంబంధిత పాలనా శాఖ అయిన విద్యుత్ శాఖకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నట్లు వెల్లడించింది. దీంతో దీన్ని నిబంధనల అమలులో కంపెనీ వైఫల్యంగా పరిగణించవద్దంటూ అభ్యర్థించింది. -
Tata Projects Case: పవర్‌గ్రిడ్‌కు సీబీఐ భారీ షాక్
న్యూఢిల్లీ: టాటా పవర్ ప్రాజెక్టుల అవినీతి కేసులో పవర్ గ్రిడ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహా ఆరుగురు సీనియనర్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం అరెస్టు చేసింది. ఐదుగురు టాటా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్‌లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నార్త్ ఈస్టర్న్ రీజినల్ పవర్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలపై తాజా పరిణామం చోటు చేసుకుంది. పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీఎస్ ఝా, ఎగ్జిక్యూటివ్ వీపీ దేశరాజ్ పాఠక్, అసిస్టెంట్ వీపీ ఆర్ ఎన్ సింగ్ సహా ఐదుగురు సీనియర్ టాటా పవర్ ప్రాజెక్ట్స్ అధికారులను లంచం ఆరోపణలపై సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది. అరెస్టయిన ఐదుగురు టాటా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్‌లను పంచకుల కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ, గురుగ్రాం, నోయిడా, ఘజియాబాద్‌లోని సీబీఐ సోదాలు నిర్వహించింది. ఆరు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో గురుగ్రాంలోని ఝా నివాసంలో సీబీఐ 93 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుంది. అక్రమ చెల్లింపులకు ప్రతిఫలంగా ఝా వివిధ ప్రాజెక్టులలో టాటా ప్రాజెక్ట్‌లకు అనుకూలంగా వ్యవహరించారనేది ఆరోపణ. -
ఎక్కడికి పోవాలి? 20 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాం
పరవాడ: కూలి పనులు చేసుకుంటూ.. కుటుంబాలను నెట్టుకొస్తూ పూరి గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్న తమ కుటుంబాలను ఉన్నట్టుండీ ఖాళీ చేసి పొమ్మంటే తమ గతేమిటని దేశపాత్రునిపాలెం సమీపంలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ స్థలంలో తలదాచుకొంటున్న వలస కూలీలు వాపోతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు వంద కుటుంబాలు 20 ఏళ్ల క్రితం స్టీల్ ప్లాంటు, పరిసర ప్రాంతాల్లో దొరికే కూలి పనుల కోసం వచ్చాయి. సాయినగర్ కాలనీ సమీపంలో ఖాళీగా ఉన్న స్థలంలో చిన్న చిన్న పూరి పాకలు ఏర్పాటు చేసుకొని పిల్లా పాపలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న నిరుపేద కుటుంబాలన్నీ భార్యాభర్తలు కష్టించి పనిచేస్తే తప్ప పొట్ట గడవడం కష్టం. కొందరు స్టీల్ ప్లాంటులో కాంట్రాక్టర్ల వద్ద కూలి పనులు చేస్తుండగా మరికొందరు భవన నిర్మాణం పనులు, మట్టి పనులకు వెళుతున్నారు. ఇక్కడ ఖాళీ స్థలంలో నివాసం ఉంటున్న వలస కూలీలను ఖాళీ చేసి వెళ్లి పొమ్మని కొంత కాలం నుంచి పవర్ గ్రిడ్ అధికారులు ఆదేశిస్తుండడంతో కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. పవర్ గ్రిడ్ యాజమాన్యం తమకు పునరావాసం కల్పించి గుడిసెల తొలగింపు చేపట్టాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే చొరవ: వసల కూలీల సమస్య తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఇటీవల పవర్ గ్రిడ్ అధికారులతో మాట్లాడారు. అప్పటినుంచి అధికారులు వత్తిడిచేయడం లేదని తెలిసింది. న్యాయం చేయాలి నేను, నా భర్త 20 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా హిరమండలం గరివిడి గ్రామం నుంచి పొట్ట చేతపట్టుకొని స్టీల్‌ప్లాంటులో కూలి పనులకు వచ్చాం. తన భర్త కొబ్బరి బొండాలు అమ్ముతుంటాడు. దేశపాత్రునిపాలెం సమీపంలో ఖాళీ స్థలంలో చిన్న పూరిగుడిసె నిర్మించుకొని ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాం. ఇంతలో పవర్ గ్రిడ్ అధికారులు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలి. – బోర రమణమ్మ, వలస కూలి పునరావాసం కల్పించాలి విజయనగరం జిల్లా గంట్యాడ మండల లక్కిడాం నుంచి 21 ఏళ్ల క్రితం కూలి పనులకు వచ్చి చిన్న పూరి గుడెసె నిర్మించుకొని కుటుంబంతో తలదాచుకుంటున్నాం. పునరావాసం కల్పిస్తే తప్ప గుడిసెలు ఖాళీ చేసేదిలేదు. – బండారు రమణమ్మ, వలస కూలి ప్రభుత్వమే ఆదుకోవాలి పాతికేళ్ల క్రితం గాజువాక నుంచి చిరు వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఇక్కడ గుడిసె వేసుకొని పొట్టపొషించుకొంటున్నాం. ఇళ్ల పట్టాలిప్పిస్తామని కొందరు పవర్ గ్రిడ్ హోం గార్డులు తమ వద్ద ఆధార్ కార్డులు, నగదు తీసున్నారు. ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు. ప్రçభుత్వమే ఆదుకోవాలి. – నడిపిల్లి అరుణ, చిరు వ్యాపారి -
పీఎస్‌యూల నుంచి రూ. 2,593 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజాలు ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్(పీజీసీఐఎల్) సంయుక్తంగా ప్రభుత్వానికి రూ. 2,593 కోట్ల డివిడెండ్‌ను అందించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2021–22)గాను ఎన్టీపీసీ రూ. 1,560 కోట్లు, పీజీసీఐఎల్ రూ. 1,033 కోట్లు చొప్పున ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ పీఎస్‌యూల నుంచి డివిడెండ్ల రూపేణా ప్రభుత్వానికి రూ. 7,515 కోట్లు అందినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో మరోపక్క ప్రభుత్వ రంగ కంపెనీలలో మైనారిటీ వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 9,110 కోట్లు సమకూర్చుకున్నుట్లు తెలియజేశారు. -
ఆదాయం 40వేల కోట్లు, పవర్ గ్రిడ్ లాభం 6% ప్లస్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(పీజీసీఐఎల్) గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 6% పుంజుకుని రూ. 3,526 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో దాదాపు రూ. 3,313 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,508 కోట్ల నుంచి రూ. 10,816 కోట్లకు బలపడింది. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది. మధ్యంతర డివిడెండు కింద ఈ ఏడాది జనవరి 8న రూ. 5, తిరిగి మార్చి 30న రూ. 4 చొప్పున చెల్లించిన సంగతి తెలిసిందే. పూర్తి ఏడాదికి: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి పవర్ గ్రిడ్ రూ. 12,036 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2019–20లో రూ. 11,059 కోట్ల లాభం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 38,671 కోట్ల నుంచి దాదాపు రూ. 40,824 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. కాగా.. తుది డివిడెండుతోపాటు 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను సైతం జారీ చేసేందుకు బోర్డు నిర్ణయించింది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ 3 షేర్లకుగాను 1 షేరుని ఉచితంగా కేటాయించనుంది. ఫలితాల నేపథ్యంలో పవర్ గ్రిడ్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం క్షీణించి రూ. 240 వద్ద ముగిసింది. చదవండి: మార్కెట్‌కు ‘ఫెడ్’ పోటు -
మార్కెట్లో కొత్త రికార్డులు
అంతటా సానుకూల పరిణామాలతో దేశీ స్టాక్‌మార్కెట్లు రికార్డు పరుగులు కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 28,500 మార్కును, నిఫ్టీ 8,500 మార్కును అధిగమించాయి. ప్రస్తుత శీతాకాల సమావేశంలో మరిన్ని సంస్కరణలు ఉండొచ్చన్న ఆశలు ఒకవైపు.. చైనా, యూరప్‌లో అదనంగా ఆర్థిక సహాయక ప్యాకేజీలు రావొచ్చన్న అంచనాలు మరోవైపు ఇందుకు దోహదపడ్డాయి. చైనా అనూహ్యంగా వడ్డీ రేట్లను తగ్గించడం మరో కారణంగా నిల్చింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఆల్ టైం గరిష్టమైన 28,541.96 స్థాయిని, నిఫ్టీ 8,534.65 పాయింట్ల స్థాయిని తాకాయి. చివరికి 164.91 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 28,499.54 వద్ద, 52.80 పాయింట్ల లాభంతో నిఫ్టీ 8,530.15 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో 467 పాయింట్ల (1.66 శాతం) మేర పెరిగినట్లయింది. ‘డిజిన్వెస్ట్‌మెంట్’లో ఇన్వెస్ట్: ఎల్ఐసీ ఇదిలావుండగా... కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్ (వాటాల విక్రయం) మొదలెట్టిన పక్షంలో తాము మరిన్ని షేర్లను కొనుగోలు చేస్తామని ఫిక్కీ నిర్వహించిన ఒక సదస్సులో ఎల్ఐసీ చైర్మన్ ఎస్కే రాయ్ తెలిపారు. ఐపీవో బాటలో 13 సంస్థలు న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడుతున్న నేపథ్యంలో దాదాపు డజను పైగా కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా వైజాగ్ స్టీల్, వీడియోకాన్ డీ2హెచ్ సహా 13 కంపెనీలు ప్రాస్పెక్టస్ ముసాయిదాను సెబీకి సమర్పించాయి. అటు ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్..ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇవన్నీ మే లో ఎన్నిక ఫలితాల అనంతరం సెబీకి పత్రాలు సమర్పించాయి. వీటిలో లావాసా కార్పొరేషన్, యాడ్‌ల్యాబ్స్, ఓర్టెల్ కమ్యూనికేషన్స్, మాంటెకార్లో ఫ్యాషన్స్ సంస్థల ఐపీఓలకు సెబీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
‘ట్రాన్స్మిషన్’ మాయ!
యాచారం: విద్యుత్ ట్రాన్స్మిషన్ అధికారుల మాయతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. రైతుల అంగీకారం లేకుండానే పచ్చటి వ్యవసాయ భూముల్లో అధికారులు టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. తమ భూముల్లో టవర్లు ఏర్పాటు చేయొద్దని అన్నదాతలు ప్రశ్నిస్తే.. ప్రభుత్వమే వేయిస్తోంది.. అడ్డుకుంటే కేసుల పాలవుతారని వారు భయపెడుతున్నారు. దీంతో ఆందోళనకు గురైన రైతులు ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. విశాఖపట్నం నుంచి నల్గొండ జిల్లా సూర్యాపేట మీదుగా జిల్లాలోని శంకర్పల్లి వరకు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు చెందిన ఓ వ్యాపార సంస్థ 400 కేవీ విద్యుత్ తీగల టవర్లను ఏర్పాటు చేస్తోంది. జిల్లాలోని మంచాల మండలం నుంచి శంకర్పల్లి వరకు 124 కిలోమీటర్ల పరిధిలో 386 విద్యుత్ టవర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా మండలంలోని మొండిగౌరెల్లి, యాచారం, నందివనపర్తి, మల్కీజ్‌గూడ, కుర్మిద్ద తదితర గ్రామాల నుంచి భారీ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామ పరిధిలో పది నుంచి 15 వరకూ టవర్లను ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇలా వందలాది గ్రామాల మీదుగా టవర్లు ఏర్పాటుకు నిర్ణయించారు. ఒక టవర్ ఏర్పాటుకు పది గుంటల భూమి అవసరముంటుంది. రైతుల అంగీకారం లేకుండానే... టవర్లను ఏర్పాటు చేసే ట్రాన్స్మిషన్ సంస్థ ముందుగా గ్రామ సభలు ఏర్పాటు చేసి విషయాన్ని రైతులకు తెలియజేయాలి. చట్టంలోని నింబంధనల ప్రకారం.. రైతులు ఒప్పుకుంటేనే టవర్ల ఏర్పాటుకు కదలాలి. కానీ ఈ నిబంధనలేవీ పట్టించుకోకుండానే విద్యుత్ ట్రాన్స్మిషన్ అధికారులు అత్యవసర సేవలంటూ... అడ్డుకుంటే కేసుల పాలవుతారని రైతులను భయపెడుతున్నారు. దీంతో రైతులు ఆందోళనచెందుతున్నారు. కొద్ది రోజుల క్రితం మండలంలోని పలు గ్రామాల రైతులు తమ భూముల్లో విద్యుత్ టవర్ల ఏర్పాటు విషయమై మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధితాధికారులతో మాట్లాడారు. టవర్లు ఏర్పాటు చేసే సంస్థ ప్రైవేట్ కార్పొరేషన్ అని తెలిసింది. నిబంధనల ప్రకారం రైతుల అంగీకారం ఉంటేనే టవర్లు ఏర్పాటు చేయాలి. న్యాయబద్ధంగా పరిహారం అందజేసి ఆ తర్వాతే టవర్ల ఏర్పాటుకు పూనుకోవాలి. టవర్ల ఏర్పాటు ప్రారంభంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. భూములు కోల్పోయే రైతులతో ట్రాన్స్మిషన్ అధికారులు అంగీకార పత్రం రాయించుకున్నారు. రూ. 15 వేల నుంచి రూ. లక్ష వరకూ పరిహారం అందజేస్తామని ఒప్పందం కుదుర్చుకొన్నారు. కానీ రైతులు చెప్పులరిగేలా తిరిగాక రూ. 15 వేలు అందజేసి చేతులు దులుపుకొన్నారు. కేవలం ఒకరిద్దరి రైతులకు మాత్రమే నగదు అందజేసి మిగతా వారిని భయపెట్టే పనిలో ఉన్నారు. భూములు కోల్పోవడానికి ససేమిరా.. నిబంధనల ప్రకారం ట్రాన్స్మిషన్ అధికారులు వ్యవహరించడం లేదని తెలుసుకున్న ఆయా గ్రామాల రైతులు రెండు, మూడు రోజులుగా యాచారం, మల్కీజ్‌గూడ తదితర గ్రామాల్లో టవర్ల పనులు జరగ్గాకుండా అడ్డుకుంటున్నారు. కేసులైనా నమోదు చేయండి కానీ తమ భూముల్లో టవర్లను మాత్రం బిగించనీయమని ఆందోళనకు దిగుతున్నారు. టవర్లు పచ్చటి వ్యవసాయ భూముల్లో నుంచి పోతున్నాయి. నిబంధనల ప్రకారం అధికారులు వ్యవసాయానికి పనికిరాని భూముల్లోంచి టవర్లను ఏర్పాటు చేయాలి. అది కూడా రైతుల అంగీకారం మేరకే జరగాలి. టవర్ల ఏర్పాటుతో పది గుంటల భూమి నిరుపయోగంగా మారే అవకాశం ఉంది. జిల్లా పరిధిలోని పలు మండలాలు నగరానికి సమీపంలో ఉండడంతో భూములకు మంచి డిమాండ్ ఉంది.టవర్లు శాశ్వతంగా ఉండే ప్రమాదం ఉండడంతో సదరు భూములకు అమాంతం డిమాండ్ తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమకు అండగా నిలిచి టవర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని వారు కోరుతున్నారు. తమకు న్యాయం జరిగేలా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.