న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(పీజీసీఐఎల్) గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 6% పుంజుకుని రూ. 3,526 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో దాదాపు రూ. 3,313 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,508 కోట్ల నుంచి రూ. 10,816 కోట్లకు బలపడింది. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది. మధ్యంతర డివిడెండు కింద ఈ ఏడాది జనవరి 8న రూ. 5, తిరిగి మార్చి 30న రూ. 4 చొప్పున చెల్లించిన సంగతి తెలిసిందే.
పూర్తి ఏడాదికి: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి పవర్ గ్రిడ్ రూ. 12,036 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2019–20లో రూ. 11,059 కోట్ల లాభం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 38,671 కోట్ల నుంచి దాదాపు రూ. 40,824 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. కాగా.. తుది డివిడెండుతోపాటు 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను సైతం జారీ చేసేందుకు బోర్డు నిర్ణయించింది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ 3 షేర్లకుగాను 1 షేరుని ఉచితంగా కేటాయించనుంది. ఫలితాల నేపథ్యంలో పవర్ గ్రిడ్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం క్షీణించి రూ. 240 వద్ద ముగిసింది.
చదవండి: మార్కెట్‌కు ‘ఫెడ్’ పోటు
Comments
Please login to add a commentAdd a comment