Power Grid Corporation of India Limited
-
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ రూ. 4.50 డివిడెండ్
న్యూఢిల్లీ: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి పనితీరు పరంగా రాణించింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని లాభం రూ.3,645 కోట్లతో పోల్చి చూసినప్పుడు 11 శాతం పెరిగి రూ.4,028 కోట్లకు చేరింది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.11,530 కోట్ల నుంచి రూ.11,820 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ.7,690 కోట్ల మూలధన వ్యయాలను వినియోగించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఆరు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్రాజెక్టులను బిడ్డింగ్‌లో గెలుచుకుంది. వీటి నిర్మాణ అంచనా వ్యయం రూ.20,479 కోట్లుగా ఉంది. డిసెంబర్ చివరికి పవర్‌గ్రిడ్ సంస్థ నిర్వహణలోని ట్రాన్స్మిషన్ ఆస్తుల నిడివి 1,76,530 సర్క్యూట్ కిలోమీటర్లుగా ఉంది. అలాగే, 276 సబ్ స్టేషన్లు, 5,17,860 మెగావోల్ట్ యాంపియర్స్ ట్రాన్స్ఫార్మేషన్ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రెండో మధ్యంతర డివిడెండ్ కింద రూ.4.50 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. -
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్
సాక్షి, హైదరాబాద్: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్ వరించింది. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) అధ్యక్షుడు బిశ్వభూషణ్ హరిచందన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఏపీలోని విజయనగరం జిల్లా కురుపం గ్రామంలో మెడికల్ క్యాంపులో కావాల్సిన వనరులను సమకూర్చినందుకు, అలాగే చిత్తూరులో బ్లడ్ బ్యాంకు నిర్మాణం చేపట్టినందుకు గాను పవర్‌గ్రిడ్‌కు ఈ అవార్డు లభించింది. కాగా, పవర్‌గ్రిడ్ ఈ రెడ్‌క్రాస్ గోల్డ్ మెడల్‌ను అందుకోవడం ఇది మూడోసారి. పవర్‌గ్రిడ్ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ అవార్డును అందుకున్నారు. -
ఆదాయం 40వేల కోట్లు, పవర్ గ్రిడ్ లాభం 6% ప్లస్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(పీజీసీఐఎల్) గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 6% పుంజుకుని రూ. 3,526 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో దాదాపు రూ. 3,313 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,508 కోట్ల నుంచి రూ. 10,816 కోట్లకు బలపడింది. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది. మధ్యంతర డివిడెండు కింద ఈ ఏడాది జనవరి 8న రూ. 5, తిరిగి మార్చి 30న రూ. 4 చొప్పున చెల్లించిన సంగతి తెలిసిందే. పూర్తి ఏడాదికి: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి పవర్ గ్రిడ్ రూ. 12,036 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2019–20లో రూ. 11,059 కోట్ల లాభం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 38,671 కోట్ల నుంచి దాదాపు రూ. 40,824 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. కాగా.. తుది డివిడెండుతోపాటు 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను సైతం జారీ చేసేందుకు బోర్డు నిర్ణయించింది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ 3 షేర్లకుగాను 1 షేరుని ఉచితంగా కేటాయించనుంది. ఫలితాల నేపథ్యంలో పవర్ గ్రిడ్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం క్షీణించి రూ. 240 వద్ద ముగిసింది. చదవండి: మార్కెట్‌కు ‘ఫెడ్’ పోటు -
‘పవర్ గ్రిడ్’కు సీఎస్ఆర్ ఎక్స్‌లెన్స్ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఎక్స్‌లెన్స్ అవార్డు దక్కింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరయ్యారు. సామాజిక బాధ్యత కింద రూ.100 కోట్లకుపైగా వెచ్చించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో సమీకృత నీటి నిర్వహణ వ్యవస్థల ఏర్పాటుకు చేసిన కృషికి గుర్తింపుగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు ఈ అవార్డు దక్కింది. కోవింద్ చేతుల మీదుగా సంస్థ చైర్మన్, ఎండీ కందికుప్ప శ్రీకాంత్ అవార్డు అందుకున్నారు. -
మార్చిలోగా న్యూ–సదరన్ గ్రిడ్ల అనుసంధానం
వార్దా–డిచ్పల్లి లైన్లు పూర్తయితే రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పవర్ గ్రిడ్ అధికారుల భేటీలో కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: న్యూ గ్రిడ్(నార్త్, ఈస్ట్, వెస్ట్ గ్రిడ్) నుంచి దక్షిణాది(సదరన్) రాష్ట్రాల కు విద్యుత్ ఇచ్చి పుచ్చుకోవడానికి అనువైన లైన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. న్యూ గ్రిడ్ నుంచి సదరన్ గ్రిడ్‌కు లైన్ల నిర్మాణం పూర్తయితే దేశ వ్యాప్తంగా విద్యుదుత్పత్తి, డిమాండ్ల మధ్య సమన్వయం సాధించవచ్చన్నారు. పీజీసీ ఐఎల్ చైర్మన్ ఐఎస్ ఘా, సదరన్ జియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు మంగళవారం ప్రగతి భవన్ లో సీఎంను కలిశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తెచ్చుకోవడానికి అవసరమైన వార్దా (మహారాష్ట్ర)– డిచ్పల్లి లైను నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సీఎం కోరారు. ఈ ఏడాది మార్చి నాటికి ఈ లైన్ నిర్మాణం పూర్తి చేస్తామని పీజీసీఐఎల్ అధికారులు తెలిపారు. 4,500 మెగావాట్ల సామర్థ్యం గల 765 కేవీ డబుల్ సర్క్యూట్ లైను నిర్మాణం పూర్తయితే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తెచ్చుకోవచ్చని సీఎం కోరారు. ఈ రెండు లైన్ల నిర్మాణంతో న్యూ గ్రిడ్–సదరన్ గ్రిడ్ మధ్య విద్యుత్ పరస్పర సరఫరాకు మార్గం ఏర్పడు తుందన్నారు. అప్పుడు దేశమంతా ఒక ప్రాంతంతో మరో ప్రాంతం అనుసంధానమై ఉంటుందని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో ట్రాన్స్ కోమిషన్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి పీజీసీఐఎల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై పీజీసీఐఎల్‌తో చర్చలు జరపాలని విద్యుత్ శాఖను కేసీఆర్ ఆదేశిం చారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీనియర్ అధికారులు ఎస్. నర్సింగ్ రావు, శాంత కుమారి, రామకృష్ణరావు, స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ ఒక్కరికి జన్‌ధన్ ఖాతా..
జైనథ్ : బ్యాంకు ఖాతాలు లేని ప్రతి ఒక్కరు జన్‌ధన్ ఖాతాలు తీసుకోవాలని ఎస్బీఐ ఆదిలాబాద్ టౌన్ బ్రాంచ్ బిజినెస్ కరస్పాండెంట్ పవార్ అంబాజీ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని నిరాల గ్రామంలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి చెందిన 60మంది కాంట్రాక్టు కూలీలకు జీరో బ్యాలెన్‌సతో జనధన్ ఖాతాలు తెరవడానికి ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చత్తీస్ఘడ్ నుంచి హైదరాబాద్ వరకు ఏర్పాటు చేస్తున్న కొత్త కరెంట్ లైన్ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు ఖాతాలు తెరవాలని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. అయితే వీరందరికి కూడ వారం రోజుల్లో బ్యాంకు ఖాతతో పాటు దేశంలో ఎక్కడైన చెల్లుబాటు అయ్యేలా రూపే డెబిట్ కార్డులను అందజేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుతో ప్రతీ ఒక్కరికి బ్యాంకు ఖాత, కార్డులు తప్పనిసరిగా మారడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.