Telangana Electricity Distribution Company
-
విద్యుత్ క్రయవిక్రయాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. పవర్ ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)పై గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా విధించిన ఆంక్షలపై స్టే విధించింది. ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరిపేందుకు టీజీఎస్పీడీసీఎల్కు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ బిడ్డింగ్‌కు అనుమతించాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)ను ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అత్యవసరంగా హైకోర్టులో కేసు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్)కు రూ.261.31 కోట్ల చార్జీలను బకాయిపడినందుకు పవర్ ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా టీజీఎస్పీడీసీఎల్పై గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా గురువారం ఉదయం ఆంక్షలు విధించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అత్యవసరంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి.. ఈ నిర్ణయంపై స్టే విధించాలని కోరింది. నిషేధంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రాష్ట్రానికి మొత్తం విద్యుత్ కొనుగోళ్లు ఆగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. రోజుకు 60 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్లు నిలిచిపోతాయని.. వ్యవసాయం, పరిశ్రమలు, ఆస్పత్రులు, గృహాలు.. ఇలా యావత్ రాష్ట్రానికి ఇబ్బంది ఏర్పడుతుందని వివరించింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. కమిషన్ వద్ద పెండింగ్‌లో పిటిషన్ ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పీజీసీఐఎల్‌కు రూ.261.31 కోట్ల చార్జీల చెల్లింపు విషయంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) వద్ద కేసు పెండింగ్‌లో ఉండగా, ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. రూ.261.31 కోట్ల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనందునే లేట్ పేమెంట్ సర్‌చార్జీ నిబంధనల మేరకు ఆంక్షలు విధించినట్లు చెప్పారు. బకాయి పడిన మొత్తంలో 25 శాతం చెల్లించాలని గత ఫిబ్రవరిలో సూచించామని, అయినా చెల్లించలేదని పీజీసీఐఎల్ తరఫు న్యాయవాది తెలిపారు. గ్రిడ్ కంట్రోలర్‌కు అధికారం లేదు వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘రూ.261.31 కోట్ల చార్జీల చెల్లింపు వ్యవహారం సీఈఆర్సీలో పెండింగ్‌లో ఉన్నందున విద్యుత్ క్రయవిక్రయాలపై నిషేధం విధిస్తూ తెలంగాణ పేరును ప్రాప్తి పోర్టల్‌లో ప్రచురించే అధికారం గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు లేదు. అందువల్ల లేట్ పేమెంట్ సర్‌చార్జ్ నిబంధనల ప్రకారం ప్రాప్తి వెబ్సైట్లో ప్రచురణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఈ ఆదేశాలను వెంటనే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర విద్యుత్ శాఖకు తెలియజేయాలని డీఎస్జీకి సూచిస్తున్నాం’ అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
Telangana: ఇక ప్రతి నెలా సర్దుబాదుడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల నుంచి ప్రతి నెలా ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్ఎస్ఏ) వసూలు చేసేందుకు లేదా వారికి తిరిగి చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిచ్చింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మూడో సవరణ నిబంధనలు–2023ను బుధవారం ప్రకటించింది. ఇంధన/ విద్యుత్ కొనుగోలు వ్యయం సర్దుబాటు చార్జీల భారాన్ని ఆటోమేటిక్‌గా విద్యుత్ బిల్లులకు బదిలీ చేసేందుకు ..కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్ 22న ఎలక్ట్రిసిటీ (టైమ్లీ రికవరీ ఆఫ్ కాస్ట్ డ్యూ టు చేంజ్ ఇన్లా) రూల్స్ 2021ను అమల్లోకి తెచ్చింది. బొగ్గు, ఇతర ఇంధనాల ధరల పెరుగుదలతో పెరిగిపోతున్న విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసేందుకు కేంద్రం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో సైతం ఇంధన సర్దుబాటు చార్జీలు వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విజ్ఞప్తి చేయగా, తాజాగా ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన సర్దుబాటు చార్జీలను లెక్కించేందుకు ప్రత్యేక ఫార్ములాను సైతం ప్రకటించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల వసూళ్లు అమల్లోకి రానున్నాయి. రుణాత్మకంగా తేలితే రిఫండ్ ► తెలంగాణ ఈఆర్సీ నిబంధనల ప్రకారం.. ఎన్ (ఒక నెల) నెలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు చార్జీలను ఎన్+2 (మూడవ నెల)కు సంబంధించిన బిల్లుతో కలిపి ఎన్+3 (4వ నెల) నెలలో డిస్కంలు జారీ చేస్తాయి. ఉదాహరణకు జనవరి నెల ఇంధన సర్దుబాటు చార్జీలను డిస్కంలు మార్చి నెల బిల్లుతో కలిపి ఏప్రిల్ నెలలో వినియోగదారులపై విధించాల్సి ఉంటుంది. ఒక వేళ ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించిన తర్వాత రుణాత్మకంగా తేలితే ఆ మేరకు వినియోగదారులకు రిఫండ్ (తిరిగి చెల్లించాలి) చేయాల్సి ఉంటుంది. 30 పైసలకు మించితే ముందస్తు అనుమతి తప్పనిసరి ► యూనిట్ విద్యుత్‌పై గరిష్టంగా 30 పైసల వరకు ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ ముందస్తు అనుమతి లేకుండా డిస్కంలు విధించవచ్చు. ఒక వేళ ఎఫ్ఎస్ఏ చార్జీలు యూనిట్‌కు 30 పైసలకు మించితే ఆపై ఉండే అదనపు మొత్తాన్ని ఈఆర్సీ ముందస్తు అనుమతి లేకుండా విధించడానికి వీలులేదు. వ్యవసాయం మినహా అందరిపై వడ్డన.. ► ఎల్టీ–5 కేటగిరీలోని వ్యవసాయ వినియోగదారులు మినహా అన్ని కేటగిరీల వినియోగదారులపై ఇంధన సర్దుబాటు చార్జీలు విధించడానికి ఈఆర్సీ అనుమతినిచ్చింది. వ్యవసాయ వినియోగదారుల ఇంధన సర్దుబాటు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేయాలని కోరింది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని పక్షంలో ఆ మొత్తాలను తర్వాతి కాలంలో ఇతర వినియోగదారుల నుంచి ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేసేందుకు అనుమతించబోమని ఈఆర్సీ స్పష్టం చేసింది. ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించే సమయంలో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. గడువులోగా వసూలు చేసుకోవాల్సిందే.. ► నిర్ణీత కాల వ్యవధిలోపు ఎఫ్ఎస్ఏ చార్జీలను విధించడంలో డిస్కంలు విఫలమైతే తర్వాత వసూలు చేసేందుకు అనుమతి ఉండదు. నెలవారీ ఇంధన సర్దుబాటు చార్జీలను నిబంధనల ప్రకారం డిస్కంలు లెక్కించి సంబంధిత నెల ముగిసిన 45 రోజుల్లోగా పత్రికల్లో ప్రచురించాల్సి ఉంటుంది. 45 రోజులు దాటితే ఆ నెలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను అనుమతించరు. విద్యుత్ బిల్లుల్లో ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేకంగా చూపించడంతో పాటు వసూలైన ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేక ఖాతా కింద నమోదు చేయాలి. ప్రతి త్రైమాసికం ముగిసిన తర్వాత 60 రోజుల్లోగా ఆ త్రైమాసికంలోని నెలలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలను ఈఆర్సీకి అందజేయాలి. డిస్కంలు విధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించనుంది. ట్రూఅప్ ప్రతిపాదనలు కీలకం.. ► ప్రతి ఏటా నవంబర్ ముగిసేలోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)తో పాటు వినియోగదారుల నుంచి వసూలు చేసిన ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలు, ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. ముందే వసూలు చేసిన ఎఫ్ఎస్ఏ చార్జీలను పరిగణనలోకి తీసుకుని ట్రూఅప్ చార్జీల రూపంలో వినియోగదారులకు పంచాల్సిన లాభ, నష్టాలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుంది. ట్రూఅప్ ప్రతిపాదనలు సమర్పించడంలో విఫలమైన పక్షంలో వీటిని సమర్పించే వరకు ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు ఈఆర్సీ అనుమతించదు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈఆర్సీ అనుమతించిన చార్జీలకు, విద్యుత్ సరఫరాకు జరిగిన వాస్తవ వ్యయానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ట్రూఅప్ చార్జీల పేరిట వసూలు చేసుకునేందుకు ఈఆర్సీ అనుమతిస్తుంది. -
ఒక్క బిల్లు కట్టకున్నా కనెక్షన్లన్నీ కట్
సాక్షి, హైదరాబాద్: ఒకే ఇంట్లో ఒకటికి మించి విద్యుత్ కనెక్షన్లు ఉన్న సందర్భంలో ఏ ఒక్క కనెక్షన్ బిల్లు చెల్లించకపోయినా, మిగిలిన అన్ని కనెక్షన్లను కట్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుడమారెడ్డి ఆదేశించారు. సంస్థ పరిధిలోని వేర్వేరు చోట్ల ఎవరైనా విద్యుత్ కనెక్షన్లు కలిగి ఉండి, అందులో ఏ ఒక్క కనెక్షన్‌కు బిల్లు చెల్లించకున్నా అన్ని చోట్లా కనెక్షన్లను కట్ చేయాలన్నారు. ఆయా గృహాలను క్షేత్రస్థాయి సి బ్బంది ప్రతి నెలా తనిఖీ చేసి వేరే కనెక్షన్లుంటే తొల గించాలన్నారు. నష్టాల నుంచి గట్టెక్కడానికి తీసు కోవాల్సిన చర్యలతో ఆయన తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రూ.2,687 కోట్ల నష్టాలను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. పాత బిల్లు సవరించి మళ్లీ బిల్లు.. ♦కార్యాలయాలు/వాణిజ్య అవసరాలకు గృహ కేటగిరీ కనెక్షన్లు జారీ చేయొద్దు. ఎక్కడైనా జారీ చేసినట్టు గుర్తిస్తే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీకుంటారు. పాత బిల్లులను సవరించి వినియోగదారుల నుంచి వాణిజ్య కేటగిరీ కింద మళ్లీ వసూలు చేస్తారు. ♦ప్రత్యేక వంట గది లేకుంటే గృహాలకు అదనపు విద్యుత్ కనెక్షన్ జారీ చేయరాదు. అలా గుర్తిస్తే బాధ్యులైన సిబ్బందిపై చర్యలతో పాటు ఆ కనెక్షన్లను క్లబ్ చేసి కొత్త శ్లాబుల కింద పాత బిల్లులను సవరించి మళ్లీ వసూలు చేస్తారు. ♦డెవలప్మెంట్ చార్జీలు, ఫిక్స్డ్ చార్జీల వసూళ్ల ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఆర్నెల్లకో సారి ఎల్టీ వినియోగదారులకు అదనపు/అన ధికార లోడ్ క్రమబద్ధీకరణ కోసం నోటిసులివ్వా లి. కనెక్షన్ లోడ్‌కి మించి విద్యుత్ వాడుతున్నట్టు గుర్తిస్తేనే ఈ చార్జీలను విధించనున్నారు. -
అడిగినంత ఇస్తే సరి.. లేదంటే..!
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అవినీతికి నిలయంగా మారింది. పైసా విదల్చనిదే ఫైలు కదలని పరిస్థితి నెలకొంది. ట్రాన్స్ఫార్మర్, కొత్త వెంచర్లో లైన్ల ఏర్పాటు, లైన్ల మార్పిడి, ప్యానల్ బోర్డు, కరెంట్ మీటర్....ఇలా ప్రతి పనికీ ఓ రేట్ ఫిక్స్ చేశారు. అడిగినంత ఇస్తే సరి..లేదంటే వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇంజనీర్ల తీరుతో విసిగిపోయిన వినియోగదారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తుండటంతో అవినీతి తిమింగళాలను వలపన్ని పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఒక సారి ఏసీబీ కేసులో అరెస్టై కేసు విచారణలో ఉన్న అధికారులు ఏడాది తిరగక ముందే అంత కంటే మంచి పోస్టులో చేరిపోతుండటంపై విశేషం. నిజానికి ఏసీబీ కేసులున్న అధికారులను పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టుల్లో వేయాలి. కానీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఇందుకు విరుద్ధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పెద్దపీట వేస్తుండటం కొసమెరుపు. చదవండి: ప్రైవేటీకరణ మాటే లేదు వారి రూటే సపరేటు..ప్రతి పనికీ ఓ రేటు గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొత్తగా అనేక వెంచర్లు వెలుస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, వ్యక్తిగత గృహాలు అనేకం నిర్మాణం అవుతున్నాయి. కొత్తలైన్లు, మీటర్లు కరెంటోళ్లకు కామధేనువులా మారాయి. నిజానికి నాలుగు మీటర్లకు మించితే ప్యానల్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. చాలా మంది వినియోగదారులు జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతుంటారు. ఒక వేళ అనుమతి తీసుకున్నా..సెట్‌బ్యాక్, పార్కింగ్, ఫైర్‌సేఫ్టీ వంటి నిబంధనలు పాటించరు. దీంతో వీటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వరు. ప్రభుత్వ, నోటరీ స్థలాల్లో నిర్మాణాలకు ఎలాంటి ధృవపత్రాలు ఉండవు. నిర్మాణంలో ఉన్న ఈ లోపాలను ఇంజనీర్లు అవకాశంగా తీసుకుంటున్నారు. నిజానికి ఏదైనా వెంచర్‌కు కరెంట్‌లైన్ మంజూరు చేయాలంటే హెచ్ఎండీఏ అనుమతి ఉండాలి. కానీ ప్రస్తుతం శివారు ప్రాంతాల్లోని వెంచర్లలో చాలా వాటికి అనుమతి లేదు. అప్పట్లో గ్రామ పంచాయితీ అనుమతితో ఆయా వెంచర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటికి లైన్లు మంజూరు కోసం రూ.2 లక్షలకుపైగా వసూలు చేస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నా హెచ్ఎండీఏ వెంచర్ నిర్వాహకులు కూడా రూ.లక్షకు పైగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇక శివార్లలో కొత్తగా నిర్మించే అపార్ట్‌మెంట్‌కు ప్యానల్‌బోర్డు, ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలంటే సదరు యజమాని కనీసం రూ.లక్షన్నరపైగా కప్పం కట్టాల్సిందే. చదవండి: కరెంట్ బిల్లు తగ్గాలా.. ఇలా చేయండి! ఏసీబీని ఆశ్రయిస్తుండటంతో.. శివారు ప్రాంతాల్లోని కీసర, మేడ్చల్, హబ్సీగూడ, సైనిక్‌పురి, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, చంపాపేట్, హబ్సీగూడ, డివిజన్లు అవినీతికి నిలయంగా మారాయి. ఇక్కడ పని చేస్తున్న కొంత మంది ఉన్నతాధికారులు కిందిస్థాయిలో పని చేస్తున్న సిబ్బందిని ఏజెంట్లుగా పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారికంగా ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండానే కొత్తలైన్లు, ప్యానల్‌బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేన్నారు. నిజానికి భవనం, వెంచర్ యజమానులు కొత్త లైన్లు, కనెక్షన్ల కోసం ఆయా డివిజన్ల పరిధిలోని వినియోగదారుల సేవాకేంద్రంలో దరఖాస్తు చేసుకుంటారు. ఈ కేంద్రం నుంచి దరఖాస్తు సంబంధిత సెక్షన్ ఏఈ, ఏడీఈ, డీఈ,ఎస్ఈకి వెళ్లుంది. వర్క్ఎస్టిమేషన్ దగ్గరి నుంచి మెటీరియల్ సరఫరా, వర్క్ పూర్తైన తర్వాత తనిఖీ చేసే వరకు సెక్షన్‌కు ఇంత అంటూ ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత సమర్పించుకోవాల్సిందే. లేదంటే రోజుల తరబడి తిరిగినా ఫైలు ముందుకు కదలదు. -
ఉత్తర డిస్కంలో బదిలీలకు మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంస్థ గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుత పోస్టుల్లో జూన్ 30 నాటికి మూడేళ్లు పూర్తయిన వారికి బదిలీ అవకాశమున్నట్టు వాటిలో పేర్కొంది. ‘‘ఇంజనీరింగ్, అకౌంట్స్, ఆపరేషన్స్ అండ్ మెయింటెన్స్, పీ అండ్ జీ సర్వీసు విభాగాల ఉద్యోగులు బదిలీలకు అర్హులు. బదిలీ చేయాల్సిన ఉద్యోగుల జాబితాను జూన్ 4కి సిద్దం చేస్తారు. వాటిపై అభ్యంతరాలను జూన్ 7 లోపు, విజ్ఞప్తులను జూన్ 11లోగా సమర్పించాలి. జూన్ 15 లోపు బది లీల తుది జాబితా విడుదల చేస్తాం. బదిలీ అయిన వారు 20 లోపు రిలీవ్ కావాలి’’అని సంస్థ పేర్కొంది. మార్గదర్శకాలు ♦ సబ్ ఇంజనీర్/ఏఈ/ఏఈఈలను సర్కిల్ పరిధిలోని అదే డివిజన్ లేదా ఇతర డివిజన్‌కు సంబంధిత సూపరింటెండింగ్ ఇంజనీర్లు బదిలీ చేయాలి. ♦ ఏఈ/ఏఈఈ(సివిల్)లను సర్కిల్/జోన్ పరిధిలోని ఇతర స్థానానికి సీవో బదిలీ చేస్తుంది. సాధ్యం కాకుంటే ప్రస్తుత స్థానంలో కొనసాగిస్తారు. ♦ ఏఏఓ క్యాడర్ అధికారులను సర్కిల్లో, లేదా ఇతర సర్కిల్‌లోకి విజ్ఞప్తిని బట్టి బదిలీ చేస్తారు. ♦ అకౌంట్స్ ఆఫీసర్లను ఉమ్మడి సర్కిల్ బయటి ప్రాంతాలకు సీవో బదిలీ చేస్తుంది. ♦ ఏఈఈ/ సివిల్ విభాగం అధికారులను ఉమ్మడి సర్కిల్ బయటి ప్రాంతాలకు బదిలీ చేస్తారు. ♦ పర్సనల్ ఆఫీసర్ క్యాడర్ సిబ్బంది, అధికారులను మరో సర్కిల్‌లోకి బదిలీ చేస్తారు. ♦ ఓఅండ్ఎమ్ స్టాఫ్‌ను డివిజన్లోని ఇతర సెక్షన్లకు బదిలీ చేస్తారు. ♦ మొత్తం అకౌంట్స్, ఓఎం స్టాఫ్; జేఏఓ, సాధారణ సర్వీస్ సిబ్బందిని ఉమ్మడి సర్కిల్లోని పలు డివిజన్లకు సూపరింటెండెంట్ ఇంజనీర్ బదిలీ చేస్తారు. ♦ 2019 జూన్ 30లోపు రిటైరయ్యే ఉద్యోగులకు బదిలీలుండవు. -
‘కేటగిరీ’ మార్పులతో చార్జీలు పెరగవు
డిస్కంలకు అదనపు ఆదాయం రాదు: టీఎస్ఎస్పీడీసీఎల్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కనెక్షన్ల కేటగిరీ నిర్వచనంలో ప్రతిపాదించిన మార్పులతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఎలాంటి అదనపు ఆదాయం రాదని, చార్జీలు కూడా పెరగవని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్ చార్జీల పెంపు లేకుండానే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి టారీఫ్ ప్రతిపాదనలను ప్రతి పాదించామని పేర్కొంది. విద్యుత్ కనెక్షన్ల కేటగిరీల్లో డిస్కంలు ప్రతిపాదించిన మార్పులపై సోమవారం ‘సాక్షి’లో ‘లేదు లేదంటూనే బాదుడు’శీర్షికతో ప్రచురితమైన కథనంపై సంస్థ యాజమాన్యం స్పందించి ఈ మేరకు వివరణ ఇచ్చింది. కనెక్షన్ల కేటగిరీల్లో మరింత స్పష్టత ఇచ్చేందుకు, న్యాయపరమైన చిక్కులను అధిగమించేందు కే కేటగిరీ నిర్వచనంలో మార్పులు ప్రతిపాదించినట్లు తెలిపింది. ఎల్టీ–2 కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లు, హెచ్‌టీ–2(ఇతర) కేటగిరీల నిర్వచనం పరిధిలోకి కొత్తగా అన్ని రకాల సర్వీసింగ్ స్టేషన్లు, రిపేరింగ్ సెంటర్లు, బస్ డిపోలు, లాండ్రీలు, డ్రై క్లీనింగ్ యూని ట్లు, గ్యాస్/ఆయిల్ స్టోరేజీ/ట్రాన్స్ఫర్ స్టేష న్లు, గోదాములు/స్టోరేజీ యూనిట్లను చేర్చాలని ప్రతిపాదించామని, వాస్తవానికి ఈ రకా ల కనెక్షన్లకు ఇప్పటికే కమర్షియల్, హెచ్‌టీ–2 (ఇతర) కేటగిరీల కిందే చార్జీలు విధిస్తున్నామ ని వెల్లడించింది. ఐటీ పరిశ్రమల పరిధిలోని ఐటీయేతర వ్యాపారాలనూ ఇప్పటివరకు ఐటీ యూనిట్ల కిందే పరిగణించి అనుమతులిచ్చేవారని పేర్కొంది. ఇప్పుడు ఐటీయేతర కార్యకలాపాలను మినహాయించాకే ఐటీ పరిశ్రమలకు అనుమతులిస్తున్నారని తెలి పింది. ఇప్పటివరకు ఎల్టీ, హెచ్‌టీ పరిశ్రమల కేటగిరీల పరిధిలో ఉన్న ఐటీ సంస్థల సముదాయంలోని కేఫ్టేరియా, హోటళ్లు, ఏటీఎంలు, బ్యాంకులు, ఆడిటోరియంలు, ఇతర సదుపాయాలను ఎల్టీ–2 కమర్షియల్, హెచ్‌టీ–3(ఇతర) కేటగిరీల నిర్వచనం పరిధిలోకి చేర్చాలని ప్రతిపాదించామని తెలిపింది. -
దొడ్డిదారిలో ‘విద్యుత్’ దోపిడీ!
* విద్యుత్‌ను అధిక ధరకు తెలంగాణకు విక్రయించేందుకు ఏపీ యత్నం * మిగులు విద్యుత్‌ను పక్క రాష్ట్రానికి ఇవ్వాలంటున్న పునర్విభజన చట్టం * మిగులు విద్యుత్ విక్రయానికి పీటీసీతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం * అదే విద్యుత్‌ను తెలంగాణకు అధిక ధరకు అమ్మేందుకు పీటీసీ ప్రయత్నాలు * యూనిట్‌కు రూ.5.35 లెక్కన 500 ఎంవీ విక్రయానికి టెండర్లు దాఖలు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల కోసం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇటీవల ఆహ్వానించిన టెండర్లలో ‘సరికొత్త’ పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం చెప్పినా తెలంగాణకు విద్యుత్ వాటా ఇచ్చేందుకు ససేమిరా అన్న ఏపీ ప్రభుత్వం... అధిక ధర దండుకునేందుకు అదే విద్యుత్‌ను దొడ్డిదారిన అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. విభజన చట్టంలోని ‘రైట్ ఆఫ్ రెఫ్యూజల్’ నిబంధనలను కాదని ‘మరో మార్గం’లో తెలంగాణకు విద్యుత్‌ను విక్రయించేందుకు పోటీపడుతోంది. మొత్తంగా ఈ ఉదంతం తెలంగాణ పట్ల ఏపీ పాలకుల వైఖరికి అద్దం పడుతోంది. పీటీసీని అడ్డుపెట్టుకుని.. తెలంగాణ డిస్కంలు ప్రైవేటు కంపెనీల నుంచి 2,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ల కోసం గతంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందాలు మే నెలతో ముగియబోతున్నాయి. ఈ లోటును పూడ్చుకోవడానికి 2016 మే 27 నుంచి 2017 మే 25 వరకు ఏడాది కాలానికి 2,000 మెగావాట్ల తాత్కాలిక విద్యుత్ కొనుగోళ్ల కోసం గత నెలలో డిస్కంలు టెండర్లను ఆహ్వానించాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి మొత్తం 2,500 మెగావాట్లకు టెండర్లు దాఖలయ్యాయి. అందులో యూనిట్‌కు రూ.5.35 చొప్పున 500 మెగావాట్ల ‘ఏపీ జెన్కో’విద్యుత్‌ను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ (పీటీసీ) సైతం టెండర్ వేసింది. దీనిపై తెలంగాణ అధికారులు లోతుగా పరిశీలన జరపగా... విద్యుత్ పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు రాష్ట్ర పునర్విభజన చట్టానికి తూట్లు పొడిచినట్లు బయటపడింది. పునర్విభజన చట్టంలోని 12వ షెడ్యూల్ ప్రకారం... తెలంగాణ, ఏపీల్లో ఏ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నా రెండో రాష్ట్రానికి కేటాయించడానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ ఆ రాష్ట్రం తిరస్కరిస్తేనే మరెవరికైనా అమ్ముకోవచ్చు. అయితే ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఏపీ జెన్కో 500 మెగావాట్ల మిగులు విద్యుత్‌ను పీటీసీకి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అదే విద్యుత్‌ను తెలంగాణకు విక్రయించేందుకు పీటీసీ టెండర్లు దాఖలు చేసింది. ఏటా రూ. 200 కోట్ల భారం..! వాస్తవానికి ఏపీలో 1,000 మెగావాట్ల మిగులు విద్యుత్ ఉందని... యూనిట్‌కు రూ.4.90 చొప్పున దానిని విక్రయిస్తామని ఆ రాష్ట్ర డిస్కంలు ఇటీవల ఏపీఈఆర్సీలో దాఖలు చేసిన ఏఆర్‌ఆర్‌లో పేర్కొన్నాయి. అంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ‘రైట్ ఆఫ్ రెఫ్యూజల్’ నిబంధనల ప్రకారం... ఏపీలో ఉన్న ఈ మిగులు విద్యుత్ యూనిట్‌కు రూ.4.90 లెక్కన తెలంగాణకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు పీటీసీ ద్వారా యూనిట్‌కు రూ.5.35 ధరతో 500 మెగావాట్లను తెలంగాణ డిస్కంలు కొనుగోలు చేస్తే... రాష్ట్రంపై ఏటా రూ.200 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ నేపథ్యంలో ‘రైట్ ఆఫ్ రిఫ్యూజల్’ నిబంధనలు అమలు చేసే విధంగా ఏపీపై ఒత్తిడి పెంచాలని విద్యుత్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
మీ చేతిలో పవర్
ప్రభుత్వ భవనాలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెలైట్ ప్రాజెక్ట్‌గా గ్రేటర్ ఎంపిక నగరంలో 40 లక్షల చ.అ. స్థలం గుర్తింపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అద్దెకు అప్పగింత 46 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి యోచన ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సోలార్ విద్యుత్‌తో ప్రజల అవసరాలు తీర్చాలని నిర్ణయించింది. దీని కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భవనాలు, వర్సిటీ క్యాంపస్‌లను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు 40 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అటు నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంటనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలుపై డిస్కం చేస్తున్న ఖర్చులు భారీగా తగ్గడంతో పాటు ట్రాన్స్మిషన్ నష్టాల నుంచి సంస్థకు విముక్తి లభిస్తుంది. అంతే కాదు... భవిష్యత్తులో వీటి ద్వారా సుమారు 46 మెగా వాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 6.34 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి వర్షాభావం... నదుల్లో నీరు లేక జల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం... బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గడం వల్ల ప్రభుత్వం సంప్రదాయ సౌర విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారిం చింది. ఎవరి అవసరాలకు తగ్గట్టు వారు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని వాడుకునేందుకు ‘సోలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరిం గ్’(ఇంటిపైనే సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడం) పథకా న్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు దీనికి 30 శాతం సబ్సీడీ ఇవ్వగా... తాజాగా ఈ రాయితీని 50 శాతానికి పెంచింది. ఇంటిపైనే సోలార్ పలకలు ఏర్పాటు చేసుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే డిస్కం పరిధిలో 786 మంది దరఖాస్తు చేసుకోగా... 750 మందికి సాంకేతిక అనుమతి లభించింది. ఇందులో 409 కనెక్షన్లు జారీ చేశారు. ప్రస్తుతం వీరు 6.34 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిలో టీఎస్ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంతో పాటు, ఐమాక్స్ థియేటర్, ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ, ఫీవర్ ఆస్పత్రులపై సౌరశక్తితో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వీరు అవసరాలకు వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను డిస్కంకు అమ్ముతూ ఆర్థికంగా లబ్ధి పొందుతుండటం విశేషం. ఓయూలో 15 లక్షల చ.అ. స్థలం ఇదే స్పూర్తితో మరిన్ని ప్రభుత్వ భవనాలపై సౌర పలకలు ఏర్పాటు చేయాలని డిస్కం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ప్రధాన భవనంతో పాటు సర్కిల్ ఆఫీసులు, జిల్లా, మండల స్థాయి ఆఫీసులపై పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో సోలార్ పలకలు ఏర్పాటు చే యాలని భావిస్తోంది. దీనికి అవసరమైన స్థలాన్ని డిస్కం ఇప్పటికే గుర్తించింది. ఆ భవనాల పైకప్పులను వాడుకున ్నందుకు గుత్తేదారు ద్వారా అద్దె చెల్లిస్తుంది. ఇలా అన్ని భవనాలకు ఒకే విధమైన అద్దెను డిస్కం నిర్ణయిస్తుంది. దీంతో భవన యజమానికి అద్దె రూపంలో ఆదాయం సమకూరడంతో పాటు సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి సంస్థకు విక్రయించే అవకాశ ం ఉంది. ఇలా ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే సుమారు 15 లక్షల చ.అ. స్థలం ఉన్నట్లు పేర్కొంది. తద్వారా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని భావించే ఔత్సాహికులకు స్థల సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. -
ఇక నో టెన్షన్!
నగరంలో మరింత మెరుగైన విద్యుత్ సరఫరా..! వచ్చే రెండేళ్లలో మరో 80 సబ్స్టేషన్లు స్థలాల కోసం డిస్కం అన్వేషణ కలెక్టర్లకు బాధ్యతలు సిటీబ్యూరో: గ్రేటర్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచి, సబ్స్టేషన్లపై ఉన్న భారాన్ని మరింత తగ్గించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే రెండేళ్లలో మరో 80 కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నగరంలో భూమి చాలా ఖరీదై పోవడం, ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ భూమి కూడా ఇప్పటికే కబ్జా దారుల చేతుల్లోకి వెళ్లిపోవడం, కోర్టు కేసుల్లో ఉండటం, నివాసాల మధ్యలో సబ్స్టేషన్ల ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తుండటంతో వీటి ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. శివారు ప్రాంతాలతో పోలిస్తే కోర్‌సిటీలో ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో ఇదే అంశాన్ని డిస్కం సీఎండీ రఘుమారెడ్డి ఇటీవల సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆ బాధ్యతను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆర్‌ఏపీడీఆర్‌పీ పథకం కింద చేపట్టిన 64 సబ్స్టేషన్లలో ఇప్పటికీ చాలా వరకు ఇదే సమస్యతో నిలిచిపోవడం కొసమెరుపు. రూ.240 కోట్లతో లైన్ల తొలగింపు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా అనేక విజ్ఞప్తులు అందాయి. విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రధానంగా గృహాలపై వేలాడుతూ ప్రమాదభరితంగా మారిన హైటెన్షన్ వైర్లను తొలగించాల్సిందిగా కోరుతూ వినతులు అందాయి. దీంతో వాటిని తొలగించి అండర్‌గ్రౌండ్ కేబుళ్లను అమర్చాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజనీర్లు గ్రేటర్ అంతా సర్వే చేసి రూ.240 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. పునఃసమీక్షించి తుది నివేదిక అందజేయాల్సిందిగా సీఎం ఆదేశించడంతో అధికారులు రెండు రోజుల నుంచి అదే పనిలో నిమగ్నమయ్యారు. శాఖల మధ్య సమన్వయలోపం: విద్యుత్ సరఫరా, నిర్వహణపై ట్రాన్స్‌కో, డిస్కంల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఒకరు తవ్వి లైన్ వేసిన మరో ఆరు మాసాల వ్యవధిలోనే అదే చోట మరొకరు తవ్వి కేబుళ్లు అమర్చుతూ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. మింట్ కంపౌండ్‌లోని హుస్సేన్‌సాగర్ సబ్‌స్టేషన్ నుంచి ఐమాక్స్ వెళ్లే దారిలో 220 కేవీ, 33 కేవీ, 11 కేవీ కేబుళ్ల కోసం ఏడాది వ్యవధి లోనే మూడు సార్లు తవ్వడం చూస్తే ఆయా శాఖల మధ్య సమన్వయం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా శివం, మన్సూరాబాద్, మలక్‌పేట్, తదితర ప్రాంతాల్లో లైన్ల కోసం తవ్విన గుంతలను పూడ్చక పోవడంతో అటుగా వెళ్లిన వారు ప్రమాదానికి గురవుతున్నారు. -
పరిశ్రమలకు హాలిడే!
వారంలో ఒక రోజు విద్యుత్ సరఫరా నిలిపివేత జిల్లా కేంద్రాల్లో 5 గంటలు, మునిసిపాలిటీలు, మండల కేంద్రాల్లో 8 గంటలు కోత హైదరాబాద్: పరిశ్రమలకు మళ్లీ పవర్ గండం ముంచుకొచ్చింది. వారంలో ఒక రోజు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రకటించాయి. దీనితో పాటు ప్రతీ రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు (పీక్ అవర్స్)లో కేవలం లైటింగ్‌కు మాత్రమే అనుమతిస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 5 గంటలు, మునిసిపాలిటీలు, మండల కేంద్రాల్లో 8 గంటలపాటు విద్యుత్ కోతలను అమలు చేయాలని డిస్కంలు నిర్ణయించాయి. గ్రామాల్లో సుమారు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఈ కోతలు శనివారం నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో 4 గంటలు, మునిసిపాలిటీలు, మండల కేంద్రాల్లో 6 గంటల మేరకు కోతలు అమల్లో ఉన్నాయి. వర్షాలు లేకపోవడంతో విద్యుత్ డిమాండ్ పెరగడం, సరఫరా తగినంతగా లేకపోవడంతో కోతలను పెంచాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. నెలకు 8 రోజులు ఉత్పత్తి బంద్! పరిశ్రమలకు వారంలో ఒక రోజు అధికారికంగా కోతలు శనివారం నుంచి అమలుకానున్నాయి. దీనితో పాటు ప్రతీ రోజూ పీక్ అవర్స్‌లో 4 గంటల పాటు కేవలం లైటింగ్‌కే విద్యుత్ సరఫరా కానుంది. రోజుకు 4 గంటల చొప్పున వారంలో పవర్ హాలిడే పోను మిగిలిన ఆరు రోజుల చొప్పున లెక్కిస్తే 24 గంటలు... అంటే ఒక రోజు. మొత్తం మీద వారంలో రెండు రోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందన్నమాట. అంటే నెలకు 8 రోజులకుపైగానే విద్యుత్ సరఫరా కాదన్నమాట. మిగిలిన 22 రోజులు మాత్రమే నడిస్తే తాము బ్యాంకర్ల నుంచి తీసుకున్న రుణాలను ఎలా తిరిగి చెల్లించగలమని పారిశ్రామికవర్గాలు వాపోతున్నాయి. అదేవిధంగా వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ఫలితంగా కొత్తగా ఆర్డర్లు రావడం కూడా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు మరో షాక్ తెలంగాణకు మరో విద్యుత్ షాక్ తగిలింది. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా గత ఐదు సంవత్సరాల సగటు వినియోగాన్ని ఆధారం చేసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విద్యుత్ కోటాలను కేంద్రం తాజాగా కేటాయించింది. దీంతో తెలంగాణకు 1.77 శాతం విద్యుత్ కోటా తగ్గగా, ఏపీకి ఆమేరకు పెరిగింది. ప్రస్తుతం సీజీఎస్ కోటాలొ తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం అమలవుతోంది. సవరించిన ప్రకారం శనివారం నుండి తెలంగాణకు 52.12 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 47.88 శాతం విద్యుత్‌ను కేటాయించారు. విభజన చట్టం మేరకు సీజీఎస్ విద్యుత్కోటాను సవరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయగా అందుకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రోజుకు 1.2 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను తెలంగాణ కోల్పోనుంది. అంటే 50 మెగావాట్ల విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ అదనంగా పొందనుంది. కాగా, సవరించిన విద్యుత్ కోటా తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.