పరిశ్రమలకు హాలిడే!
వారంలో ఒక రోజు విద్యుత్ సరఫరా నిలిపివేత
జిల్లా కేంద్రాల్లో 5 గంటలు, మునిసిపాలిటీలు, మండల కేంద్రాల్లో 8 గంటలు కోత
హైదరాబాద్: పరిశ్రమలకు మళ్లీ పవర్ గండం ముంచుకొచ్చింది. వారంలో ఒక రోజు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రకటించాయి. దీనితో పాటు ప్రతీ రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు (పీక్ అవర్స్)లో కేవలం లైటింగ్‌కు మాత్రమే అనుమతిస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 5 గంటలు, మునిసిపాలిటీలు, మండల కేంద్రాల్లో 8 గంటలపాటు విద్యుత్ కోతలను అమలు చేయాలని డిస్కంలు నిర్ణయించాయి. గ్రామాల్లో సుమారు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఈ కోతలు శనివారం నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో 4 గంటలు, మునిసిపాలిటీలు, మండల కేంద్రాల్లో 6 గంటల మేరకు కోతలు అమల్లో ఉన్నాయి. వర్షాలు లేకపోవడంతో విద్యుత్ డిమాండ్ పెరగడం, సరఫరా తగినంతగా లేకపోవడంతో కోతలను పెంచాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి.
నెలకు 8 రోజులు ఉత్పత్తి బంద్!
పరిశ్రమలకు వారంలో ఒక రోజు అధికారికంగా కోతలు శనివారం నుంచి అమలుకానున్నాయి. దీనితో పాటు ప్రతీ రోజూ పీక్ అవర్స్‌లో 4 గంటల పాటు కేవలం లైటింగ్‌కే విద్యుత్ సరఫరా కానుంది. రోజుకు 4 గంటల చొప్పున వారంలో పవర్ హాలిడే పోను మిగిలిన ఆరు రోజుల చొప్పున లెక్కిస్తే 24 గంటలు... అంటే ఒక రోజు. మొత్తం మీద వారంలో రెండు రోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందన్నమాట. అంటే నెలకు 8 రోజులకుపైగానే విద్యుత్ సరఫరా కాదన్నమాట. మిగిలిన 22 రోజులు మాత్రమే నడిస్తే తాము బ్యాంకర్ల నుంచి తీసుకున్న రుణాలను ఎలా తిరిగి చెల్లించగలమని పారిశ్రామికవర్గాలు వాపోతున్నాయి. అదేవిధంగా వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ఫలితంగా కొత్తగా ఆర్డర్లు రావడం కూడా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణకు మరో షాక్
తెలంగాణకు మరో విద్యుత్ షాక్ తగిలింది. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా గత ఐదు సంవత్సరాల సగటు వినియోగాన్ని ఆధారం చేసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విద్యుత్ కోటాలను కేంద్రం తాజాగా కేటాయించింది. దీంతో తెలంగాణకు 1.77 శాతం విద్యుత్ కోటా తగ్గగా, ఏపీకి ఆమేరకు పెరిగింది. ప్రస్తుతం సీజీఎస్ కోటాలొ తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం అమలవుతోంది. సవరించిన ప్రకారం శనివారం నుండి తెలంగాణకు 52.12 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 47.88 శాతం విద్యుత్‌ను కేటాయించారు. విభజన చట్టం మేరకు సీజీఎస్ విద్యుత్‌కోటాను సవరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయగా అందుకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రోజుకు 1.2 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను తెలంగాణ కోల్పోనుంది. అంటే 50 మెగావాట్ల విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ అదనంగా పొందనుంది. కాగా, సవరించిన విద్యుత్ కోటా తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.