ఇక నో టెన్షన్!
నగరంలో మరింత మెరుగైన విద్యుత్ సరఫరా..!
వచ్చే రెండేళ్లలో మరో 80 సబ్‌స్టేషన్లు
స్థలాల కోసం డిస్కం అన్వేషణ కలెక్టర్లకు బాధ్యతలు
సిటీబ్యూరో: గ్రేటర్‌లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచి, సబ్‌స్టేషన్లపై ఉన్న భారాన్ని మరింత తగ్గించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే రెండేళ్లలో మరో 80 కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నగరంలో భూమి చాలా ఖరీదై పోవడం, ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ భూమి కూడా ఇప్పటికే కబ్జా దారుల చేతుల్లోకి వెళ్లిపోవడం, కోర్టు కేసుల్లో ఉండటం, నివాసాల మధ్యలో సబ్‌స్టేషన్ల ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తుండటంతో వీటి ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. శివారు ప్రాంతాలతో పోలిస్తే కోర్‌సిటీలో ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో ఇదే అంశాన్ని డిస్కం సీఎండీ రఘుమారెడ్డి ఇటీవల సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆ బాధ్యతను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆర్‌ఏపీడీఆర్‌పీ పథకం కింద చేపట్టిన 64 సబ్‌స్టేషన్లలో ఇప్పటికీ చాలా వరకు ఇదే సమస్యతో నిలిచిపోవడం కొసమెరుపు.
రూ.240 కోట్లతో లైన్ల తొలగింపు
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా అనేక విజ్ఞప్తులు అందాయి. విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రధానంగా గృహాలపై వేలాడుతూ ప్రమాదభరితంగా మారిన హైటెన్షన్ వైర్లను తొలగించాల్సిందిగా కోరుతూ వినతులు అందాయి. దీంతో వాటిని తొలగించి అండర్‌గ్రౌండ్ కేబుళ్లను అమర్చాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజనీర్లు గ్రేటర్ అంతా సర్వే చేసి రూ.240 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. పునఃసమీక్షించి తుది నివేదిక అందజేయాల్సిందిగా సీఎం ఆదేశించడంతో అధికారులు రెండు రోజుల నుంచి అదే పనిలో నిమగ్నమయ్యారు.
శాఖల మధ్య సమన్వయలోపం:
విద్యుత్ సరఫరా, నిర్వహణపై ట్రాన్స్‌కో, డిస్కంల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఒకరు తవ్వి లైన్ వేసిన మరో ఆరు మాసాల వ్యవధిలోనే అదే చోట మరొకరు తవ్వి కేబుళ్లు అమర్చుతూ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. మింట్ కంపౌండ్‌లోని హుస్సేన్‌సాగర్ సబ్‌స్టేషన్ నుంచి ఐమాక్స్ వెళ్లే దారిలో 220 కేవీ, 33 కేవీ, 11 కేవీ కేబుళ్ల కోసం ఏడాది వ్యవధి లోనే మూడు సార్లు తవ్వడం చూస్తే ఆయా శాఖల మధ్య సమన్వయం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా శివం, మన్సూరాబాద్, మలక్‌పేట్, తదితర ప్రాంతాల్లో లైన్ల కోసం తవ్విన గుంతలను పూడ్చక పోవడంతో అటుగా వెళ్లిన వారు ప్రమాదానికి గురవుతున్నారు.