మీ చేతిలో పవర్
ప్రభుత్వ భవనాలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెలైట్ ప్రాజెక్ట్‌గా గ్రేటర్ ఎంపిక
నగరంలో 40 లక్షల చ.అ. స్థలం గుర్తింపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అద్దెకు అప్పగింత
46 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి యోచన ప్రభుత్వానికి ప్రతిపాదనలు
సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సోలార్ విద్యుత్‌తో ప్రజల అవసరాలు తీర్చాలని నిర్ణయించింది. దీని కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భవనాలు, వర్సిటీ క్యాంపస్‌లను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు 40 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అటు నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంటనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలుపై డిస్కం చేస్తున్న ఖర్చులు భారీగా తగ్గడంతో పాటు ట్రాన్స్‌మిషన్ నష్టాల నుంచి సంస్థకు విముక్తి లభిస్తుంది. అంతే కాదు... భవిష్యత్తులో వీటి ద్వారా సుమారు 46 మెగా వాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే 6.34 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
వర్షాభావం... నదుల్లో నీరు లేక జల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం... బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గడం వల్ల ప్రభుత్వం సంప్రదాయ సౌర విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారిం చింది. ఎవరి అవసరాలకు తగ్గట్టు వారు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని వాడుకునేందుకు ‘సోలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరిం గ్’(ఇంటిపైనే సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడం) పథకా న్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు దీనికి 30 శాతం సబ్సీడీ ఇవ్వగా... తాజాగా ఈ రాయితీని 50 శాతానికి పెంచింది. ఇంటిపైనే సోలార్ పలకలు ఏర్పాటు చేసుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే డిస్కం పరిధిలో 786 మంది దరఖాస్తు చేసుకోగా... 750 మందికి సాంకేతిక అనుమతి లభించింది. ఇందులో 409 కనెక్షన్లు జారీ చేశారు. ప్రస్తుతం వీరు 6.34 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిలో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంతో పాటు, ఐమాక్స్ థియేటర్, ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ, ఫీవర్ ఆస్పత్రులపై సౌరశక్తితో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వీరు అవసరాలకు వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను డిస్కంకు అమ్ముతూ ఆర్థికంగా లబ్ధి పొందుతుండటం విశేషం.
ఓయూలో 15 లక్షల చ.అ. స్థలం
ఇదే స్పూర్తితో మరిన్ని ప్రభుత్వ భవనాలపై సౌర పలకలు ఏర్పాటు చేయాలని డిస్కం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన భవనంతో పాటు సర్కిల్ ఆఫీసులు, జిల్లా, మండల స్థాయి ఆఫీసులపై పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో సోలార్ పలకలు ఏర్పాటు చే యాలని భావిస్తోంది. దీనికి అవసరమైన స్థలాన్ని డిస్కం ఇప్పటికే గుర్తించింది. ఆ భవనాల పైకప్పులను వాడుకున ్నందుకు గుత్తేదారు ద్వారా అద్దె చెల్లిస్తుంది. ఇలా అన్ని భవనాలకు ఒకే విధమైన అద్దెను డిస్కం నిర్ణయిస్తుంది. దీంతో భవన యజమానికి అద్దె రూపంలో ఆదాయం సమకూరడంతో పాటు సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి సంస్థకు విక్రయించే అవకాశ ం ఉంది. ఇలా ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే సుమారు 15 లక్షల చ.అ. స్థలం ఉన్నట్లు పేర్కొంది. తద్వారా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని భావించే ఔత్సాహికులకు స్థల సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.