ఎక్కువ సౌరశక్తిని ఒడిసిపట్టడానికి..  | Ten areas in AP have potential to generate the most solar power | Sakshi
Sakshi News home page

ఎక్కువ సౌరశక్తిని ఒడిసిపట్టడానికి.. 

Published Mon, Sep 28 2020 5:17 AM | Last Updated on Mon, Sep 28 2020 5:17 AM

Ten areas in AP have potential to generate the most solar power - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పది ప్రాంతాల్లో అత్యధిక సౌర విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశాలున్నాయని రాష్ట్ర గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీజీఈసీఎల్‌) శాస్త్రీయంగా గుర్తించింది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌)తో విద్యుత్‌ లభించే వీలుంది. వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకాన్ని శాశ్వతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 10 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. తొలిదశలో 6,050 మెగావాట్లకు టెండర్‌ డాక్యుమెంట్‌ను రూపొందించింది. ప్రస్తుతం దీనిని న్యాయ సమీక్షకు పంపారు. అనంతరం టెండర్లు పిలవనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18 లక్షల పంపుసెట్లకు ఏటా 12 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఉంటుంది. దీని వ్యయం రూ. 8,400 కోట్లు. మరో పదేళ్లలో ఇది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టింది.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి 
► పెరిగే డిమాండ్‌ను తట్టుకుని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానంపై ఏపీజీఈసీఎల్‌ కసరత్తు చేసింది. ఫలితంగా ఎక్కువ రేడియేషన్‌ ఉన్న ప్రాంతాల వైపు మొగ్గు చూపింది.   
► ఇప్పటి వరకూ సూర్యశక్తిని విద్యుత్‌గా మార్చడానికి సాధారణ మాడ్యూల్స్‌ వాడేవారు. కొత్తప్లాంట్లలో సూర్యాస్తమయం సమయంలో సూర్యశక్తి తగ్గిన తర్వాత కూడా కొంతసేపు విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే అత్యాధునిక మాడ్యూల్స్‌ వాడబోతున్నారు.  
► సూర్యుడు ప్రసరించే దిశను బట్టి శాస్త్రీయ కోణంలో అంచనాలు వేసి పది ప్రాంతాలను ఎంపిక చేశారు. ఎత్తయిన ప్రదేశాలతో పాటు, సూర్యశక్తి ఎక్కువ ప్రదేశంలో (ప్యానల్స్‌ అన్నింటి మీద) ప్రసరించేలా జాగ్రత్త వహించారు. దీనివల్ల తక్కువ సమయంలోనే రేడియేషన్‌ వచ్చే వీలుందని అధికారులు తెలిపారు.  
► మార్కెట్లో ప్రస్తుతం ఉన్న సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు 18 నుంచి 22 శాతం పీఎల్‌ఎఫ్‌తో పనిచేస్తున్నాయి. ప్రతిపాదించిన పది ప్రాంతాల్లో పీఎల్‌ఎఫ్‌ 25 శాతం తగ్గకుండా ఉత్పత్తి జరిగే వీలుందని అధికారులు తెలిపారు. అంటే సాధారణంగా 6,050 మెగావాట్లకు రోజుకు 31 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయితే, కొత్త విధానం ద్వారా రోజుకు 36 మిలియన్‌ యూనిట్ల వరకూ ఉత్పత్తి అవుతుంది.  
► దీంతో రోజుకు దాదాపు రూ. కోటి వరకూ ఆదా అయ్యే వీలుందని అధికారవర్గాలు తెలిపాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement