సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్) ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంస్థ గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుత పోస్టుల్లో జూన్ 30 నాటికి మూడేళ్లు పూర్తయిన వారికి బదిలీ అవకాశమున్నట్టు వాటిలో పేర్కొంది.
‘‘ఇంజనీరింగ్, అకౌంట్స్, ఆపరేషన్స్ అండ్ మెయింటెన్స్, పీ అండ్ జీ సర్వీసు విభాగాల ఉద్యోగులు బదిలీలకు అర్హులు. బదిలీ చేయాల్సిన ఉద్యోగుల జాబితాను జూన్ 4కి సిద్దం చేస్తారు. వాటిపై అభ్యంతరాలను జూన్ 7 లోపు, విజ్ఞప్తులను జూన్ 11లోగా సమర్పించాలి. జూన్ 15 లోపు బది లీల తుది జాబితా విడుదల చేస్తాం. బదిలీ అయిన వారు 20 లోపు రిలీవ్ కావాలి’’అని సంస్థ పేర్కొంది.
మార్గదర్శకాలు
♦ సబ్ ఇంజనీర్/ఏఈ/ఏఈఈలను సర్కిల్ పరిధిలోని అదే డివిజన్ లేదా ఇతర డివిజన్‌కు సంబంధిత సూపరింటెండింగ్ ఇంజనీర్లు బదిలీ చేయాలి.
♦ ఏఈ/ఏఈఈ(సివిల్)లను సర్కిల్/జోన్ పరిధిలోని ఇతర స్థానానికి సీవో బదిలీ చేస్తుంది. సాధ్యం కాకుంటే ప్రస్తుత స్థానంలో కొనసాగిస్తారు.
♦ ఏఏఓ క్యాడర్ అధికారులను సర్కిల్‌లో, లేదా ఇతర సర్కిల్‌లోకి విజ్ఞప్తిని బట్టి బదిలీ చేస్తారు.
♦ అకౌంట్స్ ఆఫీసర్లను ఉమ్మడి సర్కిల్ బయటి ప్రాంతాలకు సీవో బదిలీ చేస్తుంది.
♦ ఏఈఈ/ సివిల్ విభాగం అధికారులను ఉమ్మడి సర్కిల్ బయటి ప్రాంతాలకు బదిలీ చేస్తారు.
♦ పర్సనల్ ఆఫీసర్ క్యాడర్ సిబ్బంది, అధికారులను మరో సర్కిల్‌లోకి బదిలీ చేస్తారు.
♦ ఓఅండ్‌ఎమ్ స్టాఫ్‌ను డివిజన్‌లోని ఇతర సెక్షన్లకు బదిలీ చేస్తారు.
♦ మొత్తం అకౌంట్స్, ఓఎం స్టాఫ్; జేఏఓ, సాధారణ సర్వీస్ సిబ్బందిని ఉమ్మడి సర్కిల్‌లోని పలు డివిజన్లకు సూపరింటెండెంట్ ఇంజనీర్ బదిలీ చేస్తారు.
♦ 2019 జూన్ 30లోపు రిటైరయ్యే ఉద్యోగులకు బదిలీలుండవు.
Comments
Please login to add a commentAdd a comment