సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టా రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఖరీఫ్ సాగుకు సంబంధించి కాలువలకు బుధవారం నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం విజయవాడలో జరిగిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో డెల్టాకు జూలై నెలలో సాగు నీరు విడుదల చేసేవారు. దీంతో పంట కోత సమయంలో తుపానుల గండంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. దీంతో పాటు రెండో పంట ఆలస్యమై గణనీయంగా దిగుబడులు తగ్గేవి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గత ఏడాది జూన్10వ తేదీన సాగు నీటిని విడుదల చేసింది. ఈ ఏడాది ఇంకా ముందుగానే సాగునీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
ప్రకాశం బ్యారేజీ కింద కృష్ణా డెల్టాకు సంబంధించి ఐదు జిల్లాల పరిధిలో 13.06 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో కృష్ణా తూర్పు డెల్టాకు సంబంధించి కృష్ణా జిల్లా పరిధిలో 5.62 లక్షల ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 1,757 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 34.76 టీఎంసీల నీరు ఉంది. నీటి లాసెస్ పోను 29.76 టీఎంసీ నీరు అందుబాటులో ఉంటుందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాగు నీరు జూన్ నెలకు 6.90 టీఎంసీలు, జూలై నెలకు 27.60 టీఎంసీ అవసరం అని లెక్కించారు.
గత ఏడాది నీటి వినియోగం ఇలా..
గత ఏడాది సకాలంలో వర్షాలు కురవటం, ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరటంతో ఆయకట్టుకు నీటిని పుష్కలంగా విడుదల చేశారు. గత ఏడాది ఖరీఫ్, రబీ, తాగునీటి అవసరాలకు సంబంఽధించి 194.62 టీఎంసీల నీటిని వినియోగించారు. ఇందులో కృష్ణా తూర్పు డెల్టాకు 118.21 టీఎంసీలు, పశ్చిమ డెల్టాకు 76.41 టీఎంసీల నీటిని విడుదల చేశారు. గత ఏడాది ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువ సముద్రంలోకి 1,331.14 టీఎంసీలు వెళ్లాయి.
పనులు పూర్తి..
ఈ ఏడాది పులిచింతల ప్రాజెక్టు 16వ గేటుకు సంబంధించిన రూ. 8.64 కోట్లతో చేపట్టే పనులు తుది దశకు చేరాయి. ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి అంచనాలు రూపొందించి ప్రభుత్వ అనుమతి కోసం పంపారు. కృష్ణానది కరకట్ట రక్షణ గోడకు సంబంధించి రెండు దశల పనులు పూర్తి అయ్యాయి. మూడో దశ పనులు పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మవారధి వరకు రూ.138.80కోట్లతో శరవేగంగా సాగుతున్నాయి. కృష్ణా నదిలో పూడికతీత పనులు చేపట్టారు. ఇప్పటికే కాలువ మరమ్మతులు, పూడిక తీత, తుడికాడ తొలగింపు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
సాగు సంబరం..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు సంబరంగా మారింది. గతంలో సాగునీటి కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. రెండేళ్లుగా నైరుతి కంటే ముందుగానే కాలువలకు నీటిని విడుదల చేసి సాగు పనులు ముమ్మరం అయ్యేలా, సాగునీటికి ఇబ్బందులు లేకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. – కంచర్ల వెంకటరావు, రైతు, కోలవెన్ను
సకాలంలో సాగునీరు..
ప్రభుత్వం రైతు పక్షాన నిలుస్తోంది. గతేడాది కూడా సాగుకు ముందుగానే కాలువలకు సాగునీరు విడుదల చేసింది. ఈ ఏడాది కూడా సాగునీరు విడుదలకు చర్యలు తీసుకున్నారు. కాలువనీటిపై ఆధారపడి సాగు అధికంగా ఉంటుంది. వ్యవసాయ పనులు ఊపందుకోవటానికి మంచి అవకాశం. – మసిముక్కు సాంబశివరావు, రైతు, దావులూరు
రెండు జిల్లాల్లో ఆయకట్టు ఇలా..
ప్రధాన కాలువ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఆయకట్టు జిల్లా ఆయకట్టు
(ఎకరాల్లో) (ఎకరాల్లో)
బందరు కాలువ 1.51లక్షలు –
కేఈబీ కాలువ 1.38లక్షలు –
ఏలూరు కాలువ 0.56లక్షలు 1332
రైవస్ కాలువ 2.17లక్షలు 425
మొత్తం 5.62లక్షలు 1,757
నీటి పారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయం
కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో 5.62 లక్షల ఎకరాలకు పైగాఆయకట్టు
గత ఏడాది 194 టీఎంసీల నీటి వినియోగం
Comments
Please login to add a commentAdd a comment