సాక్షి ప్రతినిధి, ఏలూరు : కృష్ణా డెల్టాకు ఆగస్టు 15 నాటికి గోదావరి జలాలను తరలిస్తామని చంద్రబాబు పదేపదే ప్రకటిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పనులు పరిశీలిస్తే పది రోజుల్లో నిర్మాణాలు పూర్తిచేసి నీళ్లు తరలించడం అనుమానంగానే కనిపిస్తోంది. పంద్రాగస్టు నాటికి పట్టిసీమ ట్రయల్ రన్ నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పుకొస్తున్నా కుడి కాలువ నిర్మాణం అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. కుడికాలువ పనులను ఏడు ప్యాకేజీలుగా విభజించి చేపట్టగా, ఆరు ప్యాకేజీలకు సంబంధించిన పనులు ఇంకా పూర్తికాలేదు. భూసేకరణ సమస్య కారణంగా ఇప్పటివరకు ఈ పనులు నిలిచిపోయాయి.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి ఎకరానికి రూ.28 లక్షల నుంచి రూ.53 లక్షల వరకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య కొలిక్కి వచ్చింది. వెంటనే అధికారులు భూముల్లో ఎన్నో ఏళ్ల నుంచి మిగిలిపోయిన పనులను హడావుడిగా చేపట్టారు. రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీలతో తవ్వకాలు చేయిస్తున్నారు. 65 భారీ యం త్రాల ద్వారా మట్టిని తవ్వి దాదాపు 175 లారీలతో బయటకు తరలిస్తున్నారు. ఎంత యుద్ధప్రాతిపదిన పనులు చేస్తున్నా ఆగస్టు 15 నాటికి పూర్తయ్యే పరిస్థితి కానరావడం లేదు.
40 లక్షల క్యూబిక్ మీటర్ల పని పెండింగ్‌లోనే
ఆరు ప్యాకేజీలకు సంబంధించి మొత్తం 116.30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని కాలువ నుంచి తవ్వాల్సి (ఎర్త్‌వర్క్) ఉండగా, ఇప్పటివరకు 77.08 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే తవ్వారు. మిగిలిన 39.22 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు చేయాల్సి ఉంది. ప్యాకేజీల వారీగా చేయాల్సిన పనులను పరిశీలిస్తే.. మొదటి ప్యాకేజీలో 1.28 లక్షల క్యూబిక్ మీటర్లు, రెండో ప్యాకేజీలో 6.16 లక్షలు , నాలుగవ ప్యాకేజిలో 6.70 లక్షలు, ఐదో ప్యాకేజీలో 5.2 లక్షలు, ఆరో ప్యాకేజీలో 19 లక్షలు, ఏడవ ప్యాకేజీలో 0.88 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్‌వర్క్ పనులు చేయాల్సి ఉంది. మొత్తం ఏడు ప్యాకేజీల్లో ఒక్క మూడవ ప్యాకేజీ పనులు మాత్రమే పూర్తయ్యాయి. దేవరపల్లి మండలం దేవరపల్లి, రామన్నపాలెం, దుమంతునిగూడెం గ్రామాల పరిధిలో సుమారు 2 కిలోమీటర్లు, పెదవేగి మండలంలో సుమారు 3 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వకం చేయాల్సి ఉంది. కుడికాలువ తవ్వకం పనుల కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగించే కాజ్‌వేలు, చిన్నచిన్న వంతెనలు ఉన్నచోట్ల పైపులు ఏర్పాటు చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక పనులు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ పనులు కూడా ఆగస్టు 15వ తేదీలోగా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కాజ్‌వేల నిర్మాణానికి తూరలు వేసినప్పటికీ వాటికి ఇరుపక్కలా కాంక్రీట్ పనులు పూర్తి చేయాల్సిఉంది.
వెడల్పు 40 మీటర్లకు తగ్గింపు
ఎట్టి పరిస్థితుల్లోనూ 15వ తేదీ నాటికి నీటిని తరలించాలన్న లక్ష్యంతో కాలువ వెడల్పును కుదించి పనులు చేస్తున్నారు. 80 మీటర్ల వెడల్పు, 24 మీటర్ల లోతున కాలువ తవ్వాల్సి ఉండగా సమయం తక్కువగా ఉండటంతో కాలువ వెడల్పును 40 మీటర్లకు కుదించి పనులు చేస్తున్నారు. మొదటి దశలో 40 మీటర్ల వెడల్పున కాలువ తవ్వకం పూర్తిచేసి పట్టిసీమ నీటిని పంపించిన అనంతరం రెండో దశలో మిగిలిన 40 మీటర్ల వెడల్పు కాలువ పనులను చేపడతామని పోలవరం కుడి కాలువ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గంగరాజు చెబుతున్నారు.
ఎత్తిపోతలూ అనుమానమే
ఇక రూ.1,300 కోట్ల అంచనాలతో మార్చి 29న మొదలైన ఎత్తిపోతల నిర్మాణం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎత్తిపోతలను నిర్ణీత సమయానికి పూర్తి చేసేందుకు వీలుగా రూ.200 కోట్లను అదనంగా మంజూరు చేస్తున్నట్టు ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు జూలై 31న ప్రకటించారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న ఎత్తిపోతల పనులు అంచనా వేసిన లక్ష్యానికి దగ్గరగా కూడా లేవు. ఈ పధకం ప్రారంభ దశలో 12 పంపులతో 24 పైపులైన్ల ద్వారా గోదావరి జలాలను తరలించాలని భావించారు.
జూన్ నెలలో సీఎం పనుల పరిశీలనకు వచ్చినప్పుడు ఆగస్టు 15 నాటికి మొదటి విడతగా 8 పంపులతో 16 పైపులైన్ల ద్వారా నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తామని చెప్పారు. ఆ ప్రకారం కూడా పనులు జరగకపోవడంతో గత నెలలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎత్తిపోతల పనుల పథకాన్ని పరిశీలించి కనీసం 4 పంపులు 8 పైపులైన్ల ద్వారానైనా నీటిని తరలించాలన్నారు. కనీసం ఆ లక్ష్యం మేరకు కూడా ఇప్పుడు పనులు జరిగే పరిస్ధితి కానరావడం లేదు. ప్రస్తుతం ఎత్తిపోతల వద్ద సాగుతున్న నిర్నాణాన్ని బట్టి చూస్తే కేవలం 2 పంపులు 4 పైపులైన్ల ద్వారా మాత్రమే పట్టిసీమ నుంచి నీరు తరలించే అవకాశం కనిపిస్తోంది. అది కూడా పది రోజుల్లో కుడికాలువ నిర్మాణం పూర్తయితేనే.
కాలువ ఇలా.. మళ్లింపు ఎలా!
Published Tue, Aug 4 2015 3:07 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement