సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రస్తుతం నీటికి భారీగా డిమాండ్ పెరుగుతోంది...అయితే నీటి లభ్యత పరిమితంగా ఉన్న దృష్ట్యా ఉచితంగా సరఫరా చేయొద్దు. గృహ, సాగు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే నీటికి ధరలు ఖరారు చేయాలి. కనీసం సాగునీటి ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడితోపాటు నిర్వహణ, పర్యవేక్షణ(ఓఅండ్‌ఎం) వ్యయాలు రాబట్టుకునే విధంగా నీటి ధరలు ఉండాలి’’...అని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసింది.
‘ప్రైసింగ్ ఆఫ్ వాటర్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ ఇన్ ఇండియా–2022’పేరుతో రూపొందించిన పంచవర్ష నివేదికలో నీటికి చార్జీలు వసూలు చేయాల్సిందేనని నొక్కి చెప్పింది. నీటి ధరలపై ప్రతి ఐదేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తుండగా, గతేడాది రావాల్సిన నివేదిక తాజాగా బయటకొచ్చింది. ఉచితంగా/తక్కువ ధరలకు నీరు సరఫరా చేస్తే దుర్వినియోగం అవుతుందని, ఆదాయం రాక ప్రభుత్వంపై పెనుభారం పడుతుందని ఆ నివేదికలో స్పష్టం చేసింది.
రాష్ట్రాలకు సరైన పాలసీ ఉండాలి
పన్నులు, ఇతర మార్గాల్లో ప్రజల నుంచి వసూలు చేస్తున్న డబ్బు ద్వారా ప్రభుత్వాలు మధ్యతరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ ప్రాజెక్టుల పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి రాష్ట్రాలు సరైన పాలసీలు కలిగి ఉండాలి. తిరిగి వచ్చిన రాబడులతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి సమాజంలోని ఇతర వర్గాలకు లబ్ధి చేకూర్చాలి.
సాగునీటి చార్జీలు... రెండు రకాల వ్యయాలు
పంట రకాలు, విస్తీర్ణం, తడుల సంఖ్య, మొత్తం నీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకొని సాగునీటి ధరలు ఖరారు చేయాలి. నీటి టారీఫ్ ఖరారు విధానాన్ని అన్ని రాష్ట్రాలు హేతుబద్దీకరించాలి. పంట దిగుబడి విలువ ఆధారంగా సాగునీటి చార్జీలు వసూలు చేయాలని ఇరిగేషన్ కమిషన్(1972) కోరింది. ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయంలో కొంత భాగంతోపాటు పూర్తిగా నిర్వహణ వ్యయం రాబట్టుకోవాలని వైద్యనాథన్ కమిటీ కోరింది.
► సాగునీటి చార్జీల వసూళ్లతో ప్రాజెక్టుల మొత్తం నిర్వహణ వ్యయాన్ని రాబట్టుకోవాల్సిందే. దీనికి అదనంగా.. ఆహార పంటలైతే హెక్టారులో వచ్చిన దిగుబడుల విలువలో కనీసం ఒక శాతం, వాణిజ్య పంటలైతే ఇంకా ఎక్కువ శాతాన్ని వసూలు చేయాలి. ఈ మేరకు సాగునీటి వినియోగానికి సంబంధించి రెండు రకాల చార్జీలు విధించాలి. నిర్వహణ చార్జీలతో ప్రాజెక్టుల నిర్వహణకు, దిగుబడుల విలువ ఆధారిత చార్జీలను ప్రాజెక్టుల ఆధునికీకరణకు వినియోగించాలి. నీటి లభ్యత లెక్కల ఆధారంగా 75శాతం, ఆపై లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయిలో సాగునీటి చార్జీలు వసూలు చేయాలి.75 శాతానికి తక్కువ లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద 50 శాతం మేరకు చార్జీలు తగ్గించాలి.
ఎత్తిపోతల పథకాల నీటిచార్జీలు ఎక్కువే..
ఎత్తిపోతల పథకాలతో సరఫరా చేసే నీటికి చార్జీలు ఆయా ప్రాజెక్టుల పెట్టుబడి, నిర్వహణ వ్యయాల ఆధారంగా ఖరారు చేయాలి. ఎత్తిపోతల పథకాల ద్వారా సరఫరా చేసే నీటికి కచ్చితమైన లెక్కలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎంత నీరు సరఫరా చేస్తే ఆ మేరకు చార్జీలు వాల్యూమెట్రిక్ (నీటి పరిమాణం) ఆధారంగా వసూలు చేయాలి. ఎత్తిపోతల పథకాల నిర్వహణ వ్యయం ఎక్కువే కాబట్టి గ్రావిటీ ప్రాజెక్టుల నీటిచార్జీల కంటే వీటి ద్వారా సరఫరా చేసే నీటి చార్జీలు అధికంగా ఉంటాయి.
నీటి ధరల ఖరారుకు రెగ్యులేటరీ కమిషన్
తాగు, పారిశుద్ధ్యం, సాగు, పారిశ్రామిక, ఇతర అవసరాలకు సరఫరా చేసే నీటికి సరైన ధరలు ఖరారు చేసేందుకు ప్రతి రాష్ట్రంలో చట్టబద్ధంగా స్వయంప్రతిపత్తి గల వాటర్ రెగ్యులేటరీ ఆథారిటీని ఏర్పాటు చేయాలి. నీటి పరిమాణం ఆధారంగా చార్జీలు వసూలు చేయడానికి 100 శాతం ఇళ్లలోని నల్లాలకు మీటర్లు, కాల్వలకు నీటిని కొలిచే యంత్రాలు బిగించాలి. పేదలకు రాయితీపై నీరు సరఫరా చేయవచ్చు.
పూర్తి నిర్వహణ వ్యయంతోపాటు పెట్టుబడిలో కొంత భాగం వసూలు చేసేలా నీటిచార్జీలు ఉండాలి. వీటితో పాటుగా పెట్టుబడి రుణాల తిరిగి చెల్లింపులు, ఇతర అవసరాలకు నిధులు నిల్వ ఉండేలా చార్జీలు ఖరారు చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల నీటిని వినియోగిస్తే హెక్టారుకు రూ.600, వినియోగించని పక్షంలో హెక్టారుకు రూ.300 చొప్పున నిర్వహణ చార్జీలు వసూలు చేయాలని జల వనరుల 11వ పణ్రాళిక సిఫారసు చేసింది. పేద, బలహీనవర్గాలకు రాయితీ కొనసాగాలి.
నిర్వహణ, పెట్టుబడి రాబట్టుకోవాలి
దేశంలో ప్రస్తుతం వసూలు చేస్తున్న నీటి ధరలు భారీ రాయితీతో ఉన్నాయి. దీంతో ఆదాయానికి గండిపడుతోంది. రైతుల శక్తిసామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని నీటి ధరలు రాష్ట్రాలు ఖరారు చేస్తున్నాయి. కనీసం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం కూడా రావడం లేదు. దీంతో నిర్వహణ సరిగా ఉండడం లేదు. పూర్తి నిర్వహణ వ్యయంతో పాటు పాక్షికంగా పెట్టుబడి ఖర్చు రాబట్టుకునేలా నీటి ధరలు ఉండాలి.
సెకండ్ ఇరిగేషన్ కమిషన్(1972), డాక్టర్ వైద్యనాథన్ కమిటీ(1991), వివిధ ఫైనాన్స్ కమిషన్లు, ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్–2016 నిబంధనలు సైతం సరైనరీతిలో నీటి ధరలు ఖరారు చేసి నీటిపారుదల చార్జీల రూపంలో కనీసం నిర్వహణ వ్యయం వసూలు చేసుకోవాలని సిఫారసులు చేశాయి.
నీళ్లు ఊరికే రావు!
Published Mon, Aug 28 2023 1:53 AM | Last Updated on Mon, Aug 28 2023 1:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment