సాక్షి ప్రతినిధి, అనంతపురం : తుంగభద్రమ్మ కరుణించినా తుంగభద్ర బోర్డు మాత్రం వరమివ్వడం లేదు. నీటి లభ్యతపై టీబీ బోర్డు అంచనాలను తుంగభద్రమ్మ తలకిందులు చేసింది. మూడు నెలలుగా టీబీ డ్యాం పొంగిపొర్లుతోంది. నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో హెచ్చెల్సీ(తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ) కోటాను పెంచడంలో బోర్డు దాటవేత వైఖరి అనుసరిస్తోంది. కనీసం కేటాయించిన మేరకైనా నీటిని విడుదల చేస్తున్నారా అంటే అదీ లేదు.. కర్ణాటక రైతులు అడగడుగునా జలచౌర్యం చేస్తోండటంతో మన జిల్లా సరిహద్దులకు ఆ మేరకు జలాలు చేరడం లేదు.
దాంతో.. ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీబీ డ్యామ్‌లో ఈ ఏడాది 150 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కలు కట్టిన టీబీ బోర్డు దామాషా పద్ధతిలో హెచ్చెల్సీకి 22.995 టీఎంసీలను కేటాయిస్తున్నట్లు జూన్ 24న ప్రకటించింది. తాగునీటికి 5.715 టీఎంసీలు, నీటి ప్రవాహ, ఆవిరి రూపంలో 7.535 టీఎంసీల జలాలు వృథా అవుతాయని లెక్కకట్టిన హెచ్చెల్సీ అధికారులు 9.745 టీఎంసీలతో 90 వేల ఎకరాలకు నీళ్లందించాలని ఈనెల 8న కలెక్టర్ లోకేష్‌కుమార్ నేతృత్వంలో జరిగిన ఐఏబీ సమావేశంలో ప్రతిపాదించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు తాగునీటికి కేటాయించిన జలాలను నిల్వ చేసుకున్న తర్వాతే ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని ఐఏబీలో నిర్ణయించారు.
గతేడాది తరహాలోనే ఈ ఏడాది కూడా ఎగువ ప్రధాన కాలువ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు ఆగస్టు 15న నీటిని విడుదల చేసి.. ఎంపీఆర్, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు రబీ పంటలకు నీటిని అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు నీటిని విడుదల చేస్తున్నారు. సాధారణంగా ఆగస్టు ప్రథమార్థానికి నిండాల్సిన టీబీ డ్యామ్.. ఈ ఏడాది జూన్ ఆఖరునాటికే పొంగిపొర్లింది. తుంగభద్రమ్మ గత మూడు నెలలుగా పోటెత్తుండటంతో గేట్లెత్తి వరద నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు.
నీటి లభ్యత పెరిగినా..
టీబీ డ్యామ్ పూర్థిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలు కాగా.. గురువారం డ్యామ్‌లో 100.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గురువారం డ్యామ్‌లోకి 20,188 క్యూసెక్కుల నీళ్లు వచ్చి చేరగా.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయచూరు కాలువలకు నీటిని విడుదల చేయడంతోపాటూ నదిలోకి 17,962 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అక్టోబరు ఆఖరు వరకూ డ్యామ్‌లోకి ఇదే స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుందని నీటి పారుదలశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. టీబీ డ్యామ్‌లో నీటి లభ్యత కనీసం 40 నుంచి 50 టీఎంసీలు పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు హెచ్చెల్సీకి కనీసం ఐదు టీఎంసీల జలాలను అదనంగా కేటాయించాల్సి ఉంటుంది. కానీ.. అదనపు కేటాయింపులపై టీబీ బోర్డు స్పందించడం లేదు. బోర్డులో మన రాష్ట్రం తరపున ప్రాతినిథ్యం వహిస్తోన్న ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి అదనపు కేటాయింపులపై నోరు మెదపడం లేదు. సర్కారు పట్టించుకోవడం లేదు. హెచ్చెల్సీ అధికారులు సమ్మెలో వెళ్లడంతో అదనపు నీటి కేటాయింపులపై సందిగ్ధం నెలకొంది.
కేటాయించిన మేరకైనా..
టీబీ బోర్డు ఈ ఏడాది హెచ్చెల్సీకి కేటాయించిన నీటిలో గురువారం వరకూ మన జిల్లా సరిహద్దుకు కేవలం తొమ్మిది టీఎంసీల జలాలు మాత్రమే చేరాయి. బుధవారం టీబీ డ్యామ్ వద్ద హెచ్చెల్సీకి 1,627 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా.. గురువారం మన జిల్లా సరిహద్దుకు కేవలం 1400 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే చేరాయి. అంటే.. 227 క్యూసెక్కుల నీటిని కర్ణాటక పరిధిలోని రైతులు చౌర్యం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
జల చౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు జాయింట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ వేస్తామన్న టీబీ బోర్డు హామీ కాగితాలకే పరిమితమైంది. కేటాయించిన మేరకు కూడా నీటిని విడుదల చేయకపోవడం వల్ల ఆయకట్టు రైతులకు నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. టీబీ డ్యామ్‌లో పూడిక పేరుకుపోయి.. నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం, వరద జలాలు టీబీ డ్యామ్ నుంచి శ్రీశైలం డ్యామ్‌కు చేరుతోన్న విషయం విదితమే. వీటిని పరిగణనలోకి తీసుకున్న దివంగత సీఎం వైఎస్ టీబీ డ్యామ్‌లో కేసీ కెనాల్ కోటా అయిన పది టీఎంసీలను రివర్స్ డైవర్షన్ పద్ధతిలో పీఏబీఆర్‌కు కేటాయించారు.
దివంగత సీఎం వైఎస్ జారీ చేసిన ఉత్తర్వులు 2010 వరకూ సజావుగా అమలయ్యాయి. కానీ.. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఆ ఉత్తర్వుల అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. టీబీ డ్యామ్, శ్రీశైలం డ్యామ్‌లో నీటి లభ్యత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాదైనా పీఏబీఆర్ కోటా నీటిని విడుదల చేస్తుందా లేదా అన్న అంశంపై సర్కారు స్పష్టత ఇవ్వడం లేదు. పీఏబీఆర్ కోటా నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌తో రైతు సంఘాలు భారీ ఎత్తున ఉద్యమానికి రూపకల్పన చేస్తున్నాయి.
కోటాకు టాటా!
Published Fri, Sep 27 2013 2:39 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement