ఇదేం లెక్క.. కృష్ణా? | CWC recently estimated the average water availability in Krishna watershed above 3,144 TMC | Sakshi
Sakshi News home page

ఇదేం లెక్క.. కృష్ణా?

Published Thu, Apr 15 2021 4:18 AM | Last Updated on Thu, Apr 15 2021 4:20 AM

CWC recently estimated the average water availability in Krishna watershed at above 3,144 TMC - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా పరీవాహక ప్రాంతం (బేసిన్‌)లో సరాసరి నీటి లభ్యత 3,144.42 టీఎంసీలని తాజాగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 2,522.52 టీఎంసీలని లెక్కగట్టింది. అయితే కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని బచావత్‌ ట్రిబ్యునల్‌ అంచనా వేయగా బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ 2,173 టీఎంసీల లభ్యత ఉంటుందని వెల్లడించింది. సీడబ్ల్యూసీ 1993లో తొలిసారి నిర్వహించిన అధ్యయనంలో కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,069.08 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కగట్టింది. బచావత్, బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునళ్లు, సీడబ్ల్యూసీ తొలిసారి జరిపిన అధ్యయనాల్లో తేల్చిన దానికంటే కృష్ణాలో సుమారు 20 శాతం నీటి లభ్యత అధికంగా ఉన్నట్లు తాజాగా సీడబ్ల్యూసీ తేల్చడం గమనార్హం.

కృష్ణాలో నీటి లభ్యత నానాటికీ తగ్గిపోవడంతో ట్రిబ్యునళ్ల అంచనాల మేరకు కూడా నీళ్లు రావడం లేదని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ సంస్థలు, ట్రిబ్యునళ్లు తేల్చిన దానికంటే అధికంగా నీటి లభ్యత ఉన్నట్లు తాజాగా సీడబ్ల్యూసీ వెల్లడించడంపై అపార అనుభవం కలిగిన ఇంజనీర్లు, అంతరాష్ట్ర జలవనరుల విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారు

లు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతను లెక్కించడం అశాస్త్రీయమని, వీటిని కచ్చితమైన లెక్కలుగా పరిగణించలేమని స్పష్టం చేస్తున్నారు. బేసిన్‌లో కనీసం 50 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకుని నీటి లభ్యత లెక్కించడం శాస్త్రీయమని, బచావత్‌ ట్రిబ్యునల్, 1993లో సీడబ్ల్యూసీ ఇదే రీతిలో అధ్యయనం చేశాయని గుర్తు చేస్తున్నారు.

వర్షపాతం పెరగడం వల్లే..!!
దేశవ్యాప్తంగా 1985 నుంచి 2015 మధ్య వరద ప్రవాహాల ఆధారంగా నదుల్లో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఇటీవల హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజన్సీతో కలిసి అధ్యయనం చేసింది. కృష్ణా బేసిన్‌లో వర్షపాతం, వరద ప్రవాహం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ఆవిరి, ఆయకట్టు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నీటి లభ్యత లెక్కగట్టింది. ఈ అధ్యయనంలో వెల్లడైన ప్రధానాంశాలు ఇవీ..
► 1955–84 మధ్య కృష్ణా బేసిన్‌లో సగటు వర్షపాతం 842 మిల్లీమీటర్లు. 1965–84 మధ్య కాలంలో సగటు వర్షపాతం 797 మిల్లీమీటర్లకు తగ్గింది. 1985–2015 మధ్య బేసిన్‌లో సగటు వర్షపాతం 841 మిల్లీమీటర్లకు పెరిగింది.
► 2010–11లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో 9,607.85 టీఎంసీలు వచ్చాయి. ఇందులో నదిలో 4,164.81 టీఎంసీల లభ్యత వచ్చింది. 2002–03లో అత్యల్ప వర్షపాతం నమోదు కావడంతో 5,457.16 టీఎంసీలే వచ్చాయి. ఇందులో నదిలో 1,934.63 టీఎంసీల లభ్యత వచ్చింది. 
► 1985–2015 మధ్య కాలంలో సగటు వర్షపాతం 841 మిల్లీమీటర్ల వల్ల ఏడాదికి 226 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (7,980.96 టీఎంసీలు) వచ్చాయి. ఇందులో కృష్ణా నదిలో సరాసరి సగటున 3,144.42 టీఎంసీల లభ్యత ఉంటుంది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 2,522.52 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది.
► గతంతో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం పెరగడం వల్లే కృష్ణాలో నీటి లభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది.

8,070 చ.కి.మీ. పెరిగిన బేసిన్‌ విస్తీర్ణం..
► మహారాష్ట్రలోని సతారా జిల్లా మహాబలేశ్వర్‌కు సమీపంలో పశ్చిమ కనుమల్లో సముద్ర మట్టానికి 1,337 మీటర్ల ఎత్తున జోర్‌ గ్రామం వద్ద పురుడు పోసుకునే కృష్ణమ్మ 1,400 కి.మీ. ప్రయాణించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణాకు మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర, బీమా, వేదవతి, మూసీ తదితర 12 ఉపనదులున్నాయి.
► కృష్ణా పరీవాహక ప్రాంతం 2,59,439 చదరపు కిలోమీటర్లలో విస్తరించిందని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 7.9 శాతానికి సమానం. 1993లో సీడబ్ల్యూసీ అధ్య యనం జరిపినప్పుడు కృష్ణా బేసిన్‌ 2,51,369 చదరపు కిలోమీటర్లలో ఉంది. తాజాగా జియో స్పేషియల్‌ డేటా ఆధారంగా సర్వే చేయడం వల్ల బేసిన్‌ విస్తీర్ణం 8,070 చదరపు కిలోమీటర్లు పెరిగినట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. 
► 1985–86లో కృష్ణా బేసిన్‌లో 70,72,365 హెక్టార్ల ఆయకట్టు ఉండగా 2014–15 నాటికి 81,69,157 హెక్టార్లకు పెరిగింది.
► బేసిన్‌లో ఏటా 72.39 టీఎంసీలు ఆవిరవు తాయి. ఇందులో గరిష్టంగా శ్రీశైలం, నాగార్జున సాగర్‌లోనే ఎక్కువగా ఆవిరవుతాయి.

పదేళ్లలో ఏడేళ్లు తీవ్ర నీటి కొరత..
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రపదేశ్‌కు బచావత్‌ ట్రిబ్యునల్‌ 811 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. అయితే గత పదేళ్లలో ఏడేళ్లు ట్రిబ్యునల్‌ కేటాయించిన మేరకు జలాలు రాలేదు. శ్రీశైలం జలాశయానికి 2011–12లో 733.935, 2012–13లో 197.528, 2014–15లో 614.07 టీఎంసీలు వస్తే 2015–16లో కేవలం 58.692 టీఎంసీలే వచ్చాయి. 2016–17లో శ్రీశైలం జలాశయానికి 337.95 టీఎంసీలు రాగా  2017–18లో 423.93, 2018–19లో 541.31 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. అంటే 2011–12 నుంచి 2020–21 వరకూ గత పదేళ్లలో ఏడేళ్లు తెలుగు రాష్ట్రాలు తీవ్ర నీటి కొరత ఎదుర్కొన్నట్లు స్పష్ట మవుతోంది. బచావత్, బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యున ల్‌లు కేటాయించిన మేరకు కూడా కృష్ణా జలాలు రాష్ట్రాన్ని చేరలేదు. వీటిని పరిగణలోకి తీసుకుంటే సీడబ్ల్యూసీ తాజాగా చేసిన అధ్యయనం శాస్త్రీయం కాదని నీటిపారుదల నిపుణులు చేస్తున్న వాదన వంద శాతం వాస్తవమని స్పష్టమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement