ఫోన్ను నమ్మి.. ప్రాణాలు కోల్పోయింది!
లండన్ : టెక్నాలజీని గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదమో ఎవరైనా చెబితే లైట్ తీసుకుంటాం. కానీ వాటి పరిణామాలు ఎంత విషాదకరంగా ఉంటాయో ఈ కథనాన్ని చదివిదే తెలుస్తుంది. సాంకేతికతను నమ్ముకున్న ఓ బ్రిటిష్ జంట.. ఫోన్ నావిగేషన్ సూచించిన దారిలో ప్రయాణించి 3000 అడుగుల ఎత్తు నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది.
లండన్ కు చెందిన జేన్ విల్సన్, ఆమె భర్త గ్యారీ కొద్దిరోజుల కిందట వేల్స్ లోని ట్రైఫ్యాన్ పర్వతారోహణకు వెళ్లారు. శిఖరాగ్రం నుంచి సురక్షితంగా కిందికి దిగే ప్రయత్నంలో సులువైన మార్గాన్నిఅన్వేషించాలనుకున్నారు. అందుకోసం మొబైల్ నేవిగేషన్ ను ఆశ్రయించారు. గ్రేట్ బ్రిటైన్ నేషనల్ మ్యాపింగ్ ఏజెన్సీ ఆఫర్ చేసే ఆర్డినెన్స్ సర్వే స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా దారి కనిపెట్టాలనుకున్నారు. నిజానికి ఈ జంటకు పర్వాతారోహణ కోత్తేమీ కాకపోయినప్పటికీ.. ఈసారి స్మార్ట్ఫోన్ టెక్నాలజీని వాడుకుందామన్న నిర్ణయమే జీవితాలను మార్చేసింది.
నావిగేషన్ ను చూస్తూ గ్యారీ కంటే ముందు నడిచిన జేన్.. ప్రమాదవశాత్తు పర్వతం పై నుంచి కిందికిపడిపోయింది. భార్య కింద పడిపోవడంతో స్థాణువయిన గ్యారీ.. కొద్ది సేపటికి తేరుకుని రెస్క్యూ టీమ్ సహాయం కోరాడు. పర్వత శిఖరం నుంచి 500 అడుగుల కింద రక్తపు మడుగులో పడిఉన్న జేన్ మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది. కాగా, ఈ ప్రమాదంపై నావిగేషన్ యాప్ ను రూపొందించిన ఆర్డినెన్స్ సర్వే ఒక ప్రకటన విడుదల చేసింది. జేన్ మృతికి సంతాపం తెలుపుతూనే.. పర్వతారోహకులకు విలువైన సూచనలు చేసింది. ఓఎస్ స్మార్ట్ఫోన్ యాప్ వాడుతున్నప్పటికీ పేపర్ మ్యాప్ను కూడా వెంట తీసుకెళ్లాలని చెప్పింది.