Smartphone app
-
Top Apps In 2021: ఈ ఏడాది క్రేజీ యాప్స్ ఇవే..
చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందా. తోచింది తోచినట్టు అప్లికేషన్లు డౌన్లోడ్ చేస్తున్నారా. వాటిల్లో మీకు నచ్చినవి ఏవి. ఒకటో రెండోఉంటాయి. మరి దేశం మొత్తమ్మీద ఎక్కువమంది మెచ్చుకున్న అప్లికేషన్ ఏంటి. వాటిల్లో మన హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నవి ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలకు గూగుల్ బదులిచ్చేసింది. బెస్ట్ ఆఫ్ 2021 పేరుతో గూగుల్ ప్లేస్టోర్ ఇటీవలే దేశంలో అత్యధికులు ఇష్టపడ్డ అప్లికేషన్ల జాబితాను విడుదల చేసింది. జాబితాలోని వర్గాల గురించి కాకున్నా వాటిల్లో ఎన్నదగ్గ అప్లికేషన్లు కొన్ని ఇలా ఉన్నాయి. బిట్ క్లాస్.. నేర్చుకునేందుకు కరెక్ట్ ప్లేస్ కొంతమంది హాబీగా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఇంకొందరు అవసరం కొద్దీ నేర్చుకుంటుంటారు. ఇలాంటి వాళ్లందరికీ ఉపయోగపడేదే బిట్‌క్లాస్ అప్లికేషన్. ఈ ఏటి మేటిగా యాప్‌గా నిలిచిందీ ఇదే. కంప్యూటర్ లాంగ్వేజ్ పైథాన్ నేర్చుకోవాలన్నా, చిత్రకళకు మెరుగులు దిద్దుకోవాలన్నా, కంప్యూటర్ సాయంతో ఫొటోల కాలేజ్ సృష్టించడమెలాగో తెలుసుకోవాలన్నా బిట్క్లాస్ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు. బోలెడన్ని కొత్త అంశాలను ఉచితంగానే నేర్చుకోవచ్చు. భాగ్యనగరం నుంచి.. ఈ ఏడాది మేటి స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లుగా ఎంపికైన వాటిలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 3 కంపెనీలున్నాయి. వాటి గురించి క్లుప్తంగా.. సార్టీజీ.. ఇంటి తిండికి సాటి ఏది జీ ఈ తరం పిల్లలు ఇంట్లో కంటే బయట రెస్టారెంట్లలో తినడం మునుపటి కంటే ఎక్కువైందన్నది వాస్తవం. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు..జేబుకు చిల్లులు. ఈ సమస్యను అధిగమించేందుకు, ఇంటి వంటకు మళ్లీ ప్రాభవం తీసుకొచ్చేందుకు నితిన్ గుప్తా సిద్ధం చేసిన స్మార్ట్‌ఫోన్ అప్లికేషనే ఈ సార్టీజీ. ఇంటి వంటిల్లును మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా మలుచుకోవడం ఎలాగో ఈ అప్లికేషన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నామని నితిన్ గుప్తా అంటున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ ఏటి మేటిల్లో ఒకటిగా ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేశారు. సార్టీజీని మరింత ఉపయోగకరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మరి ఈ అప్లికేషన్లో ఏముంటాయని అనుకుంటున్నారా? లొట్టలేస్తూ తినేందుకు, తయారు చేసకునేందుకు రకరకాల రెసిపీలు ఉంటాయి. అంతేకాదు.. ఒక్కో రెసిపీతో మీ శరీరానికి అందే కేలరీలెన్ని? ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, పీచుపదార్థం ఎంతో స్పష్టంగా పేర్కొని ఉంటాయి. ఫ్రంట్ రో.. సెలబ్రిటీలే టీచర్లురో భారత క్రికెట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్‌తో ఫాస్ట్ బౌలింగ్, యజువేంద్ర చహల్‌తో స్పిన్ బౌలింగ్ శిక్షణ పొందాలనుకుంటున్నారా? ఒక్కసారి ఫ్రంట్ రో అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోండి. బౌలింగేం ఖర్మ.. మీకు నచ్చిన అంశాన్ని సెలబ్రిటీల పాఠాల సాయంతో ఎంచక్కా నేర్చేసుకోవచ్చు. ‘జంపింగ్ మైండ్స్’ తో ప్రశాంతంగా ఉందాం ‘మనసున మనసై.. బతుకున బతుకై.. తోడొకరుండిన అదే భాగ్య’మన్నాడో సినీ కవి. కానీ ఈ ఆధునిక యుగంలో అలాంటి తోడు దొరకడం కష్టం. మనసు లోతుల్లోని భావాలను ఇతరులతో చెప్పుకునేందుకు, తద్వారా ఆత్మన్యూనత, వ్యాకులత వంటి మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు ఉపయోగపడే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ఈ జంపింగ్ మైండ్స్! వృత్తి, సంబంధాలు, కుటుంబ సమస్యల వంటి ఏ అంశంపైన అయినా మీ భావాలను వ్యక్తీకరించేందుకు ఓ వేదిక కల్పిస్తుంది ఈ అప్లికేషన్. అది కూడా ఇతరులెవరికీ మీ గురించి తెలియకుండా రహస్యంగా జరిగిపోతుంది. కృత్రిమ మేధ సాయంతో మీరు కుదుటపడేలా మంచి మాటలు చెప్పే ప్రయత్నం జరుగుతుంది దీంట్లో. ఒత్తిడిని దూరం చేసి రిలాక్స్ అయ్యేందుకు కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి ఇందులో. 5 నెలల్లో 50 వేల కంటే ఎక్కువ మంది ఈ అప్లికేషన్‌ను వాడటం మొదలుపెట్టారని కంపెనీ సీఈవో అరిబా ఖాన్ తెలిపారు. పోటీ పరీక్షలకు ‘ఎంబైబ్’ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పనికొచ్చే అప్లికేషన్ ఇది. పాఠశాల స్థాయి పాఠాలు అర్థం చేసుకునేందుకు, పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకూ ఉపయోగపడుతుంది. కృత్రిమ మేధ ఆధారంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రశ్నావళిని సిద్ధం చేయడం, విద్యార్థుల ఫలితాలను విశ్లేషించడం దీని ప్రత్యేకతలు. ఇవే కాకుండా.. యోగా సాయంతో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉపయోగపడే ‘సర్వా’ వినియోగదారుల మన్ననలు పొందింది. గేమింగ్‌లో ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ గేమ్‌గా ‘‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’’ఎంపికైంది. మనోధైర్యానికి ‘ఎవాల్వ్’ ఈ కరోనా కష్టకాలంలో మానసిక స్థైర్యం సడలిన వారు చాలామందే ఉంటారు. అలాంటి వారికి టెక్నాలజీ సాయంతో కొంత ఉపశమనం కలిగిచేందుకు, ఒత్తిడిని జయించేందుకు, మంచి ఆరోగ్యానికి అవసరమైన ఆహారం, బద్ధకాన్ని పోగొట్టుకునేందుకు ఎవాల్వ్ ఉపయోగపడుతుందని అంటున్నారు ఎవాల్వ్ వ్యవస్థాపకుడు అన్షుల్ కామత్. ఒంటరితనం, ఉద్యోగం కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు వీలైన సమచారాన్ని సేకరించి అందిస్తున్నామని తెలిపారు. అప్లికేషన్‌ను మరింత అభివృద్ధి చేసి మానసిక సమస్యల తీవ్రతను సులువుగా గుర్తించేందుకు ఏర్పాట్లు చేయనున్నామన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు యాప్‌లో వేదిక కూడా కల్పిస్తామని చెప్పారు. – సాక్షి, హైదరాబాద్ -
Revolt RV400: కీ అక్కర్లేదు.. స్మార్ట్‌ఫోన్‌తోనే బండి స్టార్ట్
వాహనాన్ని స్టార్ట్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా కీ కంపల్సరీ. అది లేకుండా బండి ముందుకు నడవదు. అయితే గత కొంత కాలంగా కీ లేకుండా బండ్లు స్టార్ట్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. అవన్నీ రెంటల్ బైక్ సర్వీసెస్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పర్సనల్ బైకులకు సైతం ఈ ఫీచర్‌ని అందుబాటులోకి వచ్చింది. ఓలా రాకతో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో పరిస్థితులు మారిపోయాయి. ఈ సెగ్మెంట్లో రోజుకో మార్పు చోటు చేసుకుంటోంది. కస్టమర్లను ఆకట్టుకునేలా ఫీచర్లు అందించేందుకు కంపెనీలో పోటీ పడుతునఆనయి. తాజాగా తమ బైకులకు సంబంధించి కీలకమైన మార్పును రివోల్ట్ తీసుకొచ్చింది. కీతో సంబంధం లేకుండానే బండి ఆన్ ఆఫ్ చేసే విధంగా సరికొత్త టెక్నాలజీని రివోల్ట్ అందిస్తోంది. రివోల్ట్ 400 బైకులు స్మార్ట్‌ఫోన్‌తో ఆపరేట్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో రివోల్ట్ యాప్ ద్వారా కీతో సంబంధం లేకుండానే బైను ఆన్, ఆఫ్ చేయవచ్చు. పార్కింగ్ ఏరియాలో బండి ఎక్కడ ఉందో కూడా కనుక్కోవచ్చు. 2021 సెప్టెంబరు నుంచి మార్కెట్లో అందుబాటులో ఉండే బైకులకు ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. కొత్తవాటితో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న బైకులకు సైతం ఈ ఫీచర్‌ని ఉచితంగానే అందిస్తామని రివోల్ట్ ఫౌండర్ రాహుల్ శర్మ తెలిపారు. రివోల్ట్ షోరూమ్‌కి వెళ్లి కీ లేకుండా బైకులను ఆపరేట్ చేసే ఫీచర్‌ను పొందవచ్చన్నారు. అయితే కీ లెస్ ఫీచర్‌ని కేవలం రివోల్ట్ ఆర్వీ 400 మోడల్స్‌కే పరిమితం చేశారు. ఆర్వీ 300 మోడల్ బైకులకు ఈ ఫీచర్‌ని అందివ్వడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రివోల్ట్ ఆర్వీ 400 మోడల్ స్టాండర్డ్ ధర ఆన్ రోడ్ రూ.1,06,999గా ఉంది. కొత్త మోడల్ వివరాలపై స్పష్టత లేదు. -
రూపాయికే గూగుల్ నెస్ట్ మినీ!
ఫ్లిప్ కార్ట్ తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేవలం రూపాయికే గూగుల్ నెస్ట్ మినీని పొందేలా ఆఫర్ ఇచ్చింది. వాస్తవానికి గూగుల్ నెస్ట్ మినీ ధర రూ.2999 ఉండగా .. ఫ్లిప్ కార్ట్ రూపాయికే అందిస్తుంది. అయితే ఈ రూపాయి ఆఫర్ దక్కించుకునేవారికి కొన్ని షరతులు విధించింది. ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్ ఫోన్ అమ్మకాలపై దృష్టిసారించింది. ఈ ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ .31,999 ఉండగా.. ఎవరైతే ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తారో.. వాళ్లు అదనంగా రూపాయి చెల్లిస్తే గూగుల్ నెస్ట్ మినీ స్పీకర్ ను సొంతం చేసుకోవచ్చు. మినీతో పాటు, ఫ్లిప్‌కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ను ఉపయోగిస్తే పిక్సెల్ 4ఏ పై 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ పథకం కింద కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ .15,300 చెల్లించి గూగుల్ పిక్సెల్ 4ఏని పొందవచ్చు. చదవండి: అదిరిపోయే ఫీచర్స్, త్వరలో మెక్రోసాఫ్ట్ విండోస్ 11 విడుదల స్పెసిఫికేషన్లు గూగుల్ పిక్సెల్ 4ఎ 5.81-అంగుళాల ఫుల్ హెచ్డీ, పంచ్ హోల్ ఓఎల్ఇడి డిస్ప్లే 9.5: 9 యాస్పెట్ రేషియోను కలిగి ఉంది. మిడ్ రేంజ్ స్నాప్‌డ్రాగన్ 730 జి చిప్సెట్తో పాటు 6 జీబీ వేరియంట్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 4ఏ స్కైర్ షేప్ కెమెరా, 12.2 మెగాపిక్సెల్, డ్యూయల్ పిక్సెల్ ఫేజ్ డిటెక్షన్, కెమెరా వెనుక ఎఫ్ / 1.7 ఎపర్చరు, ఓఐఎస్ 77 డిగ్రీల వీక్షణతో ఉంటుంది. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎఫ్ / 2.0 ఎపర్చరు, 84-డిగ్రీల ఫైల్డ్ వ్యూను వీక్షణ క్షేత్రం ఉంది. కాగా, భారత్‌లో పిక్సెల్ 4ఏ ను 6 జీబీ వేరియంట్ ను రూ. 31,999 రూపాయలకు విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ధర కూడా రూ .25,999 అమ్మకాలు చేపట్టింది గూగుల్. అయితే ఇప్పుడు తిరిగి రూ.31,999కే అమ్ముతుంది. దీనిపై ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వకపోగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే రూ .2999 విలువైన స్పీకర్ ను రూపాయికే అందిస్తుంది. -
Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? గుర్తించండిలా?!
రోజు రోజుకి టెక్నాలజీ అభివృద్ది చెందుతుంది. అయితే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం వాడే గాడ్జెట్స్ అంటే మొబైల్స్, కంప్యూటర్, స్మార్ట్ వాచెస్ వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని అంటున్నారు. చదవండి: దేశంలో ఇళ్ల ధరలు పెరిగాయ్ ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. కానీ వినియోగదారులు ఒక్కోసారి పూర్తిగా అవగాహాన లేకుండా ఫోన్ వినియోగించడంతో హ్యాకర్స్ దీన్ని అస్త్రంగా మార్చుకుంటున్నారు. భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, లేదంటే వ్యక్తిగత సమాచారాన్ని బహిర్ఘతం చేసి రోడ్డు కీడ్చుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఫోన్‌ను హ్యాక్ అయ్యేందో? లేదో తెలుసుకొని అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని టెక్ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మన ఫోన్ హ్యాక్ అయ్యిందో? లేదో? తెలుసుకుందాం. హ్యాక్ అయిన ఫోన్ గుర్తించండి ఇలా!: ♦మీరు ఫోన్‌ను జాగ్రత్తగానే ఉంచుకుంటారు. కానీ ఒక్కోసారి బ్యాటరీ ఛార్జీంగ్ అయిపోతుంది. అలా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడానికి కారణం హ్యాకింగ్‌కు గురైందని అర్ధం చేసుకోవాలి. వెంటనే వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేసుకొని, బ్యాటరీ మార్చుకోవాలి. ♦ఒక్కోసారి ఫోన్ డెడ్ అవుతుంటుంది. ఇలాఫోన్ డెడ్ కావడానికి హ్యాకర్లు మాల్ వేర్ ను మన సెల్ ఫోన్ లోకి సెండ్ చేస్తారు. అలా వచ్చిన మాల్ వేర్ ఫోన్ లో ఉన్న సమాచారాన్ని సేకరిస్తారు. ♦ ఒక్కోసారి మీ ఫోన్ నుంచి టెక్ట్స్, కాల్స్ చేయలేరు. అలా వస్తున్నాయంటే సైబర్ నేరస్తులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లే లెక్క. మాల్ వేర్ సాయంతో మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బును కాజేస్తుంటారు. మిమ్మల్ని ఏమార్చేందుకు అన్ వాంటెండ్ కాల్స్, మెసేజ్‌లు సెండ్ చేస్తుంటారు. కావాలంటే మీకు వచ్చే కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒక్కసారి చెక్ చేయండి. కానీ మీరు గుర్తించలేరు. ♦ మీఫోన్ గూగుల్ క్రోమ్ లో మీకు కావాల్సిన సమచారం కోసం అన్వేషిస్తున్నారు. ఆ సమయంలో కొన్ని అనుమానాస్పద పాప్ అప్ యాడ్స్ వస్తుంటాయి. యాహు మీరు లక్షల్లో ఫ్రైజ్ మనీని గెలుచుకున్నారు. మీకు ఆఫ్రైజ్ మనీ కావాలంటే మేం అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వాలని రిక్వెస్ట్‌లు పంపిస్తుంటారు. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారంటే మీకు కాల్స్ వస్తుంటాయి. మీ ఫోన్ కాల్ ఆధారంగా మీజేబును ఖాళీ చేస్తుంటారు. హ్యాకర్స్‌లో కొంతమంది క్లిక్ చేస్తే డబ్బులు వచ్చేలా పాప్ అప్ యాడ్స్ పంపుతుంటారు. మీతో బలవంతం క్లిక్ చేసే మీ బ్రెయిన్ ను వాష్ చేస్తుంటారు. కాబట్టి ఇలా యాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది ♦ ఒక్కసారి హ్యాకర్ మీ ఫోన్లోకి ఎంటర్ అయ్యాడంటే.. మీ జీమెయిల్, బ్యాంక్ అకౌంట్లలోకి ఈజీగా వెళతాడు.పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడం,ఈమెయిల్స్‌ను పంపుతుంటారు. మీ డేటాను సేకరించి.. మీపేరు మీద క్రెడిట్ కార్డ్ లు తీసుకోవడం. మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తుంటారు. ఇదిగో ఇలాంటివి సమస్యలు మీకు ఎదురవుతుంటే మీ ఫోన్ ను హ్యాక్ కు గురవుతుందని గుర్తుంచుకోవాలి. -
పల్లెలు... రెడీ టు ఈట్!!
న్యూఢిల్లీ: కోరుకున్న వెంటనే, అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఆహారాన్ని సిద్ధం చేసుకునే అవకాశం కల్పించేవి రెడీ టు ఈట్ ఉత్పత్తులు. అంత సమయం కూడా లేదనుకుంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉండనే ఉన్నాయి. ఇప్పటిదాకా పట్టణాల్లోని మధ్యతరగతి వినియోగదారులే లక్ష్యంగా కంపెనీలు ఈ ఉత్పత్తులను గురిపెట్టేవి. అయితే, ఈ మధ్య కాలంలో పల్లెల్లోనూ వీటి అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రజలు సైతం వీటి వినియోగం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాలకు అనుకూలంగా ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. ఎమ్టీఆర్ ఫుడ్స్, బాగ్రిస్, ఐడీ ఫ్రెష్, మేయాస్, గిట్స్ ఫుడ్ అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. దీంతో ఈ కంపెనీలు గ్రామీణ ప్రాంతాలకు అనుకూలమైన ప్యాక్ సైజులు, ధరలతో ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. సాధారణంగా గ్రామీణ మార్కెట్లలో లూజ్ మసాలాలు, సుగంధ ద్రవ్యాల వంటి అమ్మకాలు ఎక్కువ. వీటి స్థానంలో బ్రాండెడ్ కంపెనీల ఇన్స్టంట్ మిక్స్ ఉత్పత్తులైన బాదం మిల్క్, ఉప్మా, రవ్వ ఇడ్లీ మిక్స్, ఓట్స్, ముస్లి వంటివీ ఇటీవల అమ్ముడుపోతున్నాయి. ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్ అన్ని ప్రాంతాల్లోకీ చొచ్చుకుపోవటం... స్మార్ట్ఫోన్ల వినియోగం విస్తరణ... పోషకాలపై అవగాహన పెరగడం గ్రామీణ ప్రాంతాల్లోనూ అమ్మకాలు పెరిగేందుకు దోహదపడుతున్నట్టు బ్యాగ్రిస్ డైరెక్టర్ ఆదిత్య బాగ్రి తెలిపారు. దేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) ఉత్పత్తుల మార్కెట్ 2,500 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇందులోనూ వినియోగదారులు పాశ్చాత్య ఉత్పత్తుల కంటే దేశీయ సంప్రదాయ పదార్థాలు లేదా పోషకాలతో కూడిన ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో గ్రామీణ మార్కెట్ కూడా భిన్నంగా ఏమీ లేదు. అందుకే కంపెనీలు పల్లె మార్కెట్లకు తక్కువ ధరలతో ఉత్పత్తులను తీసుకెళుతున్నాయి. ఎంటీఆర్ ఫుడ్స్ బాదం మిక్స్ పౌడర్, ఇన్స్టంట్ రవ్వ ఇడ్లి మిక్స్ ఉత్పత్తులను రూ.5, రూ.10కే అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే విధంగా గిట్స్ ఫుడ్ కంపెనీ రూ.10కే గులాబ్ జామూన్ మిక్స్ ప్యాకెట్‌ను విడుదల చేసింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఎక్కువగా అమ్ముడయ్యే ఈ కంపెనీ ఉత్పత్తుల్లో ఇదీ ఒకటి. ‘‘మా గులాబ్ జామూన్, ఖమాన్ దోక్లా మిక్స్ మొత్తం అమ్మకాల్లో సగం మేర పెళ్లిళ్ల సీజన్లో గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటున్నాయి. టైర్–1, టైర్–2 మార్కెట్లలో సూపర్ మార్కెట్లు ఉన్నాయి. పంపిణీ పరంగా ఇవి కీలక చోదకాలు’’ అని గిట్స్ ఫుడ్ డైరెక్టర్ సాహిల్ గిలానీ తెలిపారు. విస్తరణకు బోలెడు అవకాశాలు మన దేశంలో ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎన్నో ఉత్పత్తుల రూపంలో అందుబాటులోకి వచ్చినా కానీ, బిస్కట్లు, స్నాక్స్ మినహా వేరే ఉత్పత్తుల మార్కెట్ అంతగా విస్తరించలేదు. దీనికి కారణం స్వతహాగా సంప్రదాయ ఆరోగ్య, రుచికరమైన స్థానిక పదార్థాలకే వినియోగదారులు పెద్ద పీట వేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కంపెనీలు పట్టణ మార్కెట్లపైనే పెద్దగా దృష్టి సారించాయి. ఖర్చు చేసే శక్తి ఎక్కువగా ఉండడం, సమయం ఆదా చేయడం, సౌకర్యం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వంటివి పట్టణ వినియోగదారులు వీటి వైపు మొగ్గుచూపించే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో వీటి వినియోగం కూడా పరిమితంగానే ఉంది. ఎంటీఆర్కు చెందిన ఓక్లా గ్రూపు గ్రామీణ మార్కెట్లలో మసాలా ఉత్పత్తులను ఎక్కువగా విక్రయిస్తోంది. క్రమంగా రెడీ టు ఈట్ ఉత్పత్తులను కూడా ప్రవేశపెడుతోంది. ‘‘గ్రామీణ విభాగం అమ్మకాల్లో 16–18 శాతం వృద్ధి కనిపిస్తోంది. కానీ, పట్టణాల్లో వృద్ధి 8 శాతంగానే ఉంది. జూన్ నాటికి గ్రామీణ మార్కెట్లకే ఉద్దేశించిన వ్యూహాన్ని అమలు చేయనున్నాం’’ అని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్ శర్మ తెలిపారు. బెంగళూరుకు చెందిన మేయాస్ కంపెనీ కూడా గ్రామీణ అమ్మకాల్లో ఏటా 15–17 శాతం వృద్ధి సాధిస్తోంది. ‘‘బ్లెండెడ్ మసాలా ఉత్పత్తుల అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో 6–8 ఏళ్ల క్రితం నుంచి పెరుగుతున్నాయి. కానీ, ఇన్స్టంట్ మిక్స్ ఉత్పత్తుల అమ్మకాల ప్రాచుర్యం మాత్రం గత రెండు, మూడేళ్లుగా పెరుగుతోంది’’అని మేయాస్ డైరెక్టర్ సుదర్శన్ మేయా తెలిపారు. దేశ బ్రేక్‌ఫాస్ట్ మార్కెట్ సైజు: రూ.2,580 కోట్లు. 2015 నాటికి ఈ మార్కెట్: 1,760 కోట్లు. 2016–18 మధ్య ఏటా 14.3 శాతం చొప్పున వృద్ధి 2023 వరకు ఏటా 10.7 శాతం వృద్ధి అంచనా -
వైఫై సంకేతాలతోనే స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్
మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇంట్లో ఉండే వైఫై రౌటర్‌తోనే చార్జ్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? ఈ అద్భుతాన్ని సాకారం చేస్తామంటున్నారు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ! కానీ రెక్టెన్నా అనే ప్రత్యేకమైన పరికరం సాయంతో ఇది చాలా సులువైన పనే అని అంటున్నారు టోమ్స్ పలాసియోస్ అనే శాస్త్రవేత్త. ఏసీ విద్యుత్తు ద్వారా పుట్టే విద్యుదయస్కాంత తరంగాలను డీసీ తరంగాలుగా మార్చే పరికరమే రెక్టెన్నా. ఎంఐటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన కొత్తరకం రెక్టెన్నా మాత్రం రేడియో తరంగాలను స్వీకరించి ఏసీ విద్యుత్తరంగాలుగా మారుస్తుందన్నమాట. అయితే ఇప్పటివరకూ రెక్టెన్నాతో ఉత్పత్తి చేయగలిగిన విద్యుత్తు చాలా తక్కువగా ఉండటంతో ఈ రెక్టెన్నాను విçస్త్రత స్థాయిలో వాడటం సాధ్యం కాలేదని తమ గాడ్జెట్‌తో ఈ పరిస్థితి మారిపోతుందని టోమ్స్ తెలిపారు. నేచర్ మ్యాగజైన్లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఈ కొత్తతరం రెక్టెన్నాను చాలా చౌకగా, సులువుగా తయారు చేయవచ్చు. హైవేల వెంబడి కొత్త రెక్టెన్నాలను భారీ సైజులో ఏర్పాటు చేయవచ్చునని తద్వారా బ్యాటరీల అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అన్నింటినీ చార్జ్ చేయవచ్చునని తెలిపారు. ప్రయోగాత్మకంగా తాము తయారుచేసిన రెక్టెన్నాలతో 40 మైక్రోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగామని.. ఎల్ఈడీ స్క్రీన్లు మొదలుకొని అనేక వేరబుల్ గాడ్జెట్స్‌కు ఈ మాత్రం విద్యుత్తు సరిపోతుందని వివరించారు. -
ముఖమే కాన్వాస్
ఈ ఫొటోలో వ్యక్తిని చూడగానే ఏమనిపిస్తోంది.. ఆ ఏముంది.. స్మార్ట్‌ఫోన్‌లో ఏదో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫొటోను అలా మార్చేశారులే అనుకుంటున్నారా..? చూసిన వెంటనే అలాగే అనిపిస్తుంది కూడా.. అయితే మీరనుకున్నదంతా అబద్ధం. అందులో ఉన్న వ్యక్తి తన ముఖాన్నే కాన్వాస్‌గా మలుచుకున్నాడు. ఇదిగో ఇలా త్రీడీ చిత్రాలను తన ముఖంపైనే గీసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. అతడి పేరు లూస్. మామూలుగానైతే ఇటలీలోని ఓ టీవీ చానల్లో 18 ఏళ్లుగా మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. అయితే తను చేసే పనిలో ఎప్పుడూ ఆనందం వెతుక్కునే లూస్.. తనపైనే ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. దీంతో మొదటగా తన చేతులను కాన్వాస్‌గా మలుచుకుని భ్రమ కలిగించే బొమ్మలను గీయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ముఖంపైనే త్రీడీ బొమ్మలు చిత్రించడం స్టార్ట్ చేశాడు. 2015లో తొలిసారి తన చేతిపై గీసిన ఇలాంటి ఫొటోను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ కావడం.. లూస్ ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. -
13 ఏళ్లకే.. ప్రపంచస్థాయి సదస్సులో..
సాక్షి, హైదరాబాద్: వయసు 13 ఏళ్లు.. చదువుతున్నది ఏడో తరగతి.. కానీ ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తల మధ్య ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాడు. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో కనిపించే ఈ బుడతడి పేరు హామిష్ ఫిన్లేసన్. ఆస్ట్రేలియాకు చెందిన మూన్‌షాట్ ఇండస్ట్రీ గ్లోబల్ లిమిటెడ్ సంస్థ తరఫున ప్రపంచ ఔత్సా హిక పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో పాల్గొంటున్నాడు. పదో ఏటనే స్మార్ట్‌ఫోన్ యాప్ తయారుచేసి.. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాడు. ఇప్పటివరకు ఆరు యాప్‌లు తయారు చేశాడు. ప్రపంచస్థాయి సమస్యలను పరిష్కరించడమే తన ధ్యేయమని.. సొంతంగా ఓ వీడియోగేమ్ తయారు చేయాలనేది లక్ష్యమని చెబుతున్నాడు. జీఈఎస్‌కు హాజరైనవారిలో అతిచిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన హామిష్ ఫిన్లేసన్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ విశేషాలివి.. సాక్షి: హాయ్.. యంగ్‌బాయ్! హామిష్: హాయ్.. సాక్షి: ఇంత పెద్ద సదస్సుకు హాజరైన చిన్న వయస్కుడిగా ఎలా ఫీలవుతున్నారు? హామిష్: నాకు చాలా సంతోషంగా ఉంది. జీఈఎస్‌కు హాజరుకావడం ఇది రెండోసారి. సాక్షి: ఇంత చిన్నవయసులో ఆహ్వానం ఎలా వచ్చింది? అసలు మీరేం చేస్తున్నారు? హామిష్: నేను సముద్ర వాతావరణ పరిరక్షణ కోసం యాప్‌లు తయారుచేశాను. సముద్ర తాబేళ్ల పరిరక్షణ కోసం టెక్నాలజీ సాయంతో పోరాటం చేస్తున్నా. ఇప్పటికి అయిదు యాప్‌లు తయారు చేశాను. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు ఉపయోగపడే ఆరో యాప్ ఇంకా తయారీ దశలో ఉంది. సాక్షి: మీ యాప్‌ల ద్వారా ఏం సాధించదలచుకున్నారు? హామిష్: నేను తయారు చేసిన వాటిలో ఎదుగుదల లోపాలకు సంబంధించిన ఆటిజంపై అవగాహన కల్పించే యాప్ కూడా ఉంది. నేనూ, మా నాన్న కూడా ఆటిజం సమస్య ఎదుర్కొంటున్న వారమే కావడంతో ప్రత్యేకంగా దీన్ని రూపొందించాను. ఇక, సముద్ర జలాలు, అక్కడి వాతావరణం ప్రపంచ సామరస్యానికి ఎంత అవసరమో మీకు తెలుసు. ప్రపంచస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలనుకుంటున్నా. నా పదో యేటే సముద్ర తాబేళ్ల కోసం ట్రిపుల్–టీ అనే యాప్ రూపొందించా. నా ఐదు యాప్‌లను 54 దేశాల్లో వినియోగిస్తున్నారు. సాక్షి: మీకు స్ఫూర్తి ఎవరు? హామిష్: చిన్నప్పుడు ఓ కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు.. ఏదైనా పెద్దగా తయారుచేయాలని అనిపించింది. ఐఓఎక్స్, మూన్‌షాట్ టెక్నాలజీలంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న గ్రేమ్ ఫిన్లేసన్ ఇచ్చే ప్రోత్సాహం కూడా నన్ను ముందుకు నడిపిస్తోంది. నాకు సీ ఓషన్ ఎన్విరాన్‌మెంట్‌తో పాటు అంతరిక్ష శాస్త్రమంటే కూడా ఇష్టం. పెద్దయిన తర్వాత దానిపై దృష్టి పెడతా. సాక్షి: చదువును, వృత్తిని ఎలా సమన్వయపరచుకుంటున్నారు? హామిష్: నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్లగానే ముందు హోమ్‌వర్క్ చేసేస్తాను. తర్వాతే నా ఇతర పనులపై దృష్టి పెడతా.. సాక్షి: ఇప్పటికి ఎంత సంపాదించారు? హామిష్: ఇప్పటివరకు 10 వేల డాలర్ల కన్నా ఎక్కువే సంపాదించి ఉంటాను. అయినా డబ్బు ముఖ్యం కాదు. నా యాప్‌లకు వచ్చే లైక్‌లే నాకు తృప్తినిస్తాయి. సాక్షి: మీ లక్ష్యం ఏమిటి? హామిష్: నాకు సొంతంగా వీడియోగేమ్ తయారు చేయాలని ఉంది. అది నా లక్ష్యం. సాక్షి: భారత్‌కు రావడం ఎలా ఉంది? హామిష్: ఇక్కడకు రావడం నాకు చాలా ఉత్తేజకరంగా అనిపిస్తోంది. -
నకిలీలకు ఇక చెక్
లండన్: నకిలీ వస్తువులను తయారు చేయటంతోపాటు వాటి డిజిటల్ ఐడెంటిటీని కాపీ కొట్టటం వంటి ఖరీదైన నేరాలకు ఇక పుల్‌స్టాప్ పడనుంది. నకిలీ వస్తువులను కనిపెట్టే యాప్ త్వరలో రాబోతోంది. స్మార్ట్ ఫోన్లలో వాడే ఈ యాప్ నకిలీ వస్తువులను వందశాతం కచ్చితంగా గుర్తించగలుగుతుందని యూకేలోని ఓ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్రకటించారు. కొత్త క్వాంటం టెక్నాలజీ సాయంతో నకిలీ వస్తువులను కనిపెట్టే దిశగా తాము ముందడుగు వేశామన్నారు. ఇది గనుక విజయవంతమైతే నకిలీ వస్తువులను తయారు చేసి, విక్రయించే వారి ఆటలు ఇక సాగవని ప్రొఫెసర్ రాబర్ట్ యంగ్ తెలిపారు. వచ్చే ఏడాది ప్రథమార్థం కల్లా ఈ టెక్నాలజీతో తయారైన యాప్‌లను స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుని నకిలీ వస్తువులను వినియోగదారులు సులువుగా కనిపెట్టే వీలుంటుందని వివరించారు. ఏదైనా వస్తువుకు సంబంధించి డిజిటల్ ఐడెంటిటీని ఫోర్జరీ చేయటం, నకిలీ వస్తువులను తయారుచేయటం వంటి వాటిని పూర్తిగా నిరోధించవచ్చని తెలిపారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా నకిలీ వస్తువుల కారణంగా సుమారు యాబైవేల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లుతోంది. కేవలం నకిలీ మందుల కారణంగానే ఏటా 200 బిలియన్ డాలర్ల మేర నష్టం కలుగుతుండగా ఇటువంటి మందులు వాడి అనారోగ్యం బారిన పడటమే కాదు సుమారు పది లక్షల మంది మృత్యువాత పడుతున్నట్లు అంచనా. -
30 నిమిషాల్లో ‘జికా’ను గుర్తించే యాప్
వాషింగ్టన్: జికా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధులను కేవలం 30 నిమిషాల్లో గుర్తించే మొబైల్ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. స్మార్ట్ ఫోన్‌తో నియంత్రించగల, బ్యాటరీతో నడిచే డయాగ్నొస్టిక్ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరం విలువ కేవలం 100 డాలర్లు (సుమారు రూ.6,500) మాత్రమే. ఈ ఆవిష్కరణలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా పాలుపంచుకున్నారు. ‘పరికరాన్ని అపరేట్ చేయడంలో కొత్త యాప్ ఇంటర్ఫేస్గా పనిచేస్తుంది. సంప్రదాయ లేబొరేటరీ విశ్లేషణ పరికరాల స్థానంలో స్మార్ట్ ఫోన్ కెమెరా సెన్సార్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని అమెరికాలోని సాండియా నేషనల్ లేబొరేటరీస్‌కు చెందిన ఆశిశ్ ప్రియే తెలిపారు. ల్యాంప్ (లూప్– మీడియేటెడ్ ఐసోథర్మల్ ఆంప్లిఫికేషన్) డయాగ్నొస్టిక్ పద్ధతిపై ఆధారపడి ఈ పరికరం పనిచేస్తుంది. -
మీట నొక్కితే.. మీ ముందే!
కారు అంటే.... నాలుగు డోర్లు, చక్రాలు, ఓ స్టీరింగ్... ఇంతేనా? కానే కాదంటోంది రిన్‌స్పీడ్. కావాలంటే పక్క ఫొటోలో చూడండి. స్విట్జర్లాండ్‌కు చెందిన రిన్‌స్పీడ్ తయారు చేసిన సూపర్ హైటెక్ కారు ఇదే. పేరు ఒయాసిస్. ఒక్కొక్కటిగా విశేషాలు తెలుసుకుందాం. ఒయాసిస్‌లో ఉన్న సీట్లు రెండే. డ్రైవర్ అవసరం లేని అటానమస్ వెహికల్ కూడా. దీని ప్రయోజనాలేమిటో తెలుసా? స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లో ఒక మీట నొక్కితే చాలు... కారు మీ దగ్గరకే వచ్చేస్తుంది. అలాగే ఏ పక్కన తగులుతుందో... ఎక్కడ గీత పడిపోతుందో అన్న డౌట్లు అస్సలు లేకుండా ఎంచక్కా ఇది తనంతట తానే పార్కింగ్ కూడా చేసేయగలదు. స్టీరింగ్ అనేది పేరుకు మాత్రమే. అవసరమైతే దీన్ని మడి చేయవచ్చు... పైన కీ బోర్డు, కాఫీ కప్పులు పెట్టేసుకోవచ్చు. డ్యాష్‌బోర్డు ఉండాల్సిన చోట విశాలమైన టీవీ స్క్రీన్ ఉంటుంది. మరి స్పీడు... దారి.. మ్యాప్ వంటివి ఎలా తెలుసుకోవాలి? సింపుల్. ఎదురుగా ఉన్న విండ్‌స్క్రీన్‌పై మీరు వెళ్లాల్సిన ప్రాంతపు రూట్, మ్యాప్‌లు, ఇతర వివరాలు అన్నీ కనిపిస్తాయి. ఈ స్క్రీన్ వెనుక ఉండే ప్రాంతం మరీ ఆసక్తికరం... ఏ కారులోనూ ఊహించలేనిది. అదేంటో తెలుసా? హైటెక్ గార్డెన్. అవసరమైతే ఇక్కడ ఆకుకూరల నుంచి ముల్లంగి వరకూ అనేకం పండించుకోవచ్చునట. కేవలం విద్యుత్తుతో మాత్రమే పనిచేయడం... పర్సనల్ డిజిటల్ అసి స్టెంట్, మీ ఫేస్బుక్, ట్వీటర్ అకౌంట్లు చూస్తూ మీకు నచ్చే పోస్ట్‌లను మీ ముందు పెట్టడం వంటి విషయాలన్నీ అలవోకగా చేసేస్తుంది. ఇంతకీ ఈ ఒయాసిస్ ఎప్పుడొస్తుందంటారా? వచ్చే నెల అమెరికాలో ‘కన్సూ మర్ ఎలక్ట్రానిక్స్ షో’లో తొలిసారి ప్రదర్శించనున్నారు. మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది? ధర ఎంత ఉంటుంది? వంటి వివరాలన్నీ ఆ తరువాతే తెలుస్తాయి! -
వీజీగా వేపేస్తుంది...
వేపుడు వంటకాలను వీజీగా చేసుకోవడానికి వీలుంటే బాగుండునని చాలామంది అనుకునే ఉంటారు. అలాంటి వారి కోసమే అందుబాటులోకి వచ్చింది ఈ ఇంటెలిజెంట్ మూకుడు. అందుకే దీనికి ‘పాంటెలిజెంట్’ అనే పేరు పెట్టారు. చూడటానికి సాదా సీదాగానే కనిపిస్తుంది గాని, ఇది చాలా స్మార్ట్ గురూ! అనకుండా ఉండలేరు. ఇండక్షన్ స్టవ్ మీదైనా, గ్యాస్ స్టవ్ మీదైనా... దేని మీదైనా దీంతో కోరుకున్న వేపుళ్లను టేస్టీ టేస్టీగా వేయించేసుకోవచ్చు. ఇది స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ఈ మూకుడులోని టెంపరేచర్ సెన్సర్లు ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ఉష్ణోగ్రత వివరాలను అందిస్తూ ఉంటాయి. దాని బట్టి మూకుడులోని వంటకాన్ని ఎప్పుడు తిరగేయాలో, కలపాలో నిర్ణయించుకోవచ్చు. అలాగే, ఎప్పుడు వేడిని పెంచాలో, తగ్గించాలో కూడా నిర్ణయించుకోవచ్చు. ఇదంతా తలనొప్పి వ్యవహారంలా అనిపిస్తే, ఇందులోని ‘ఆటోపైలట్’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అప్పుడు ఈ మూకుడు తనకు కావలసిన వేడిని తనే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఏమాత్రం తేడా లేకుండా టేస్టీ టేస్టీగా వేడివేడి వేపుడును వడ్డనకు సిద్ధం చేసి పెడుతుంది. -
ఫోన్‌ను నమ్మి.. ప్రాణాలు కోల్పోయింది!
లండన్ : టెక్నాలజీని గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదమో ఎవరైనా చెబితే లైట్ తీసుకుంటాం. కానీ వాటి పరిణామాలు ఎంత విషాదకరంగా ఉంటాయో ఈ కథనాన్ని చదివిదే తెలుస్తుంది. సాంకేతికతను నమ్ముకున్న ఓ బ్రిటిష్ జంట.. ఫోన్ నావిగేషన్ సూచించిన దారిలో ప్రయాణించి 3000 అడుగుల ఎత్తు నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. లండన్ కు చెందిన జేన్ విల్సన్, ఆమె భర్త గ్యారీ కొద్దిరోజుల కిందట వేల్స్ లోని ట్రైఫ్యాన్ పర్వతారోహణకు వెళ్లారు. శిఖరాగ్రం నుంచి సురక్షితంగా కిందికి దిగే ప్రయత్నంలో సులువైన మార్గాన్నిఅన్వేషించాలనుకున్నారు. అందుకోసం మొబైల్ నేవిగేషన్ ను ఆశ్రయించారు. గ్రేట్ బ్రిటైన్ నేషనల్ మ్యాపింగ్ ఏజెన్సీ ఆఫర్ చేసే ఆర్డినెన్స్ సర్వే స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా దారి కనిపెట్టాలనుకున్నారు. నిజానికి ఈ జంటకు పర్వాతారోహణ కోత్తేమీ కాకపోయినప్పటికీ.. ఈసారి స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీని వాడుకుందామన్న నిర్ణయమే జీవితాలను మార్చేసింది. నావిగేషన్ ను చూస్తూ గ్యారీ కంటే ముందు నడిచిన జేన్.. ప్రమాదవశాత్తు పర్వతం పై నుంచి కిందికిపడిపోయింది. భార్య కింద పడిపోవడంతో స్థాణువయిన గ్యారీ.. కొద్ది సేపటికి తేరుకుని రెస్క్యూ టీమ్ సహాయం కోరాడు. పర్వత శిఖరం నుంచి 500 అడుగుల కింద రక్తపు మడుగులో పడిఉన్న జేన్ మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది. కాగా, ఈ ప్రమాదంపై నావిగేషన్ యాప్ ను రూపొందించిన ఆర్డినెన్స్ సర్వే ఒక ప్రకటన విడుదల చేసింది. జేన్ మృతికి సంతాపం తెలుపుతూనే.. పర్వతారోహకులకు విలువైన సూచనలు చేసింది. ఓఎస్ స్మార్ట్‌ఫోన్ యాప్ వాడుతున్నప్పటికీ పేపర్ మ్యాప్‌ను కూడా వెంట తీసుకెళ్లాలని చెప్పింది. -
టెర్రర్ అలర్ట్స్ కు సరికొత్త యాప్
పారిస్ : టెర్రర్ అటాక్ ల నుంచి యూజర్లను రక్షించడానికి, ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ యాప్ రూపొందింది. ఫ్రెంచ్ ప్రభుత్వం నేడు ఆ యాప్ ను ఆవిష్కరించనుంది. యూరో 2016 ఫుట్ బాల్ టోర్నమెంట్ పై పెరుగుతున్న భద్రత ఆందోళనల నేపథ్యంలో 'టెర్రర్ అలర్ట్' అనే యాప్ ను ఫ్రెంచ్ ప్రభుత్వం రూపొందించింది. యూజర్లకు టెర్రర్ అటాక్ ల అలర్ట్ లను పంపుతూ వారిని సంఘటన బారినుంచి కాపాడటానికి ఈ యాప్ ఎంతో సహకరించనుంది. ఫ్రెంచ్, ఇంగ్లీష్ రెండు భాషల్లో ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. అనుమానిత దాడి జరుగుతుందని భావించినప్పుడు యూజర్లకు వెంటనే వార్నింగ్ మెసేజ్ వెళ్లేలా ఈ యాప్ ను ఆవిష్కరించామని వెల్లడించింది. అనుమానిత సంఘటన గురించి అథారిటీలకు సమాచారం అందిన వెంటనే, 15 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో యూజర్లకు ఈ యాప్ ద్వారా అలర్ట్ పంపుతామని చెప్పింది. ఎనిమిది వివిధ భౌగోళిక జోనుల్లో అలర్ట్ లను యాప్ యూజుర్లు మానిటర్ చేసుకోవచ్చని తెలిపింది. కుటుంబసభ్యులు, స్నేహితుల వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. అనుమానిత దాడి జరిగినప్పుడు ఎలా తనకు తాను రక్షించుకోవాలో, ఎలా సేఫ్ గాఉండాలో కూడా ఈ యాప్ సమాచారం అందిస్తుందని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. 2015లో జరిగిన పారిస్ టెర్రర్ అటాక్స్ తో ఈ యాప్ ను రూపొందించడానికి సంకల్పించామని, యూరో 2016 టోర్నమెంట్ నేపథ్యంలో టెర్రర్ అలర్ట్ యాప్ ను తీసుకురావాలని ఆ దేశ ప్రధాని మాన్యుల్ వాల్స్ భావించినట్టు చెప్పింది. ఈ యాప్ టెర్రర్ అటాక్స్ నుంచి యూజర్లను రక్షిస్తుందని విశ్వసిస్తున్నట్టు అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. -
విద్యార్థుల రక్షణ కోసం స్మార్ట్ యాప్
ఇస్లామాబాద్: విద్యాసంస్థల్లో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకోవడం, అమాయక చిన్నారులు మృతిచెందడం లాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి కదా. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు సరికొత్త యాప్ ను రూపొందించారు. పాకిస్తాన్ లోని కరాచీలో శనివారం నూతన అప్లికేషన్ ను ఆవిష్కరించారు. సింధ్ రేంజర్స్ అనే సంస్థ ఈ యాప్ వివరాలను వెల్లడించింది. రేంజర్స్ స్కూల్ కాలేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ద్వారా దాదాపు 3 వేల విద్యాసంస్థలు తమ వివరాలను ఇందులో రిజిస్టర్ చేసుకునే వెసలుబాటు ఉంది. దీంతో అత్యవసర సమయాల్లో ఈ యాప్ బటన్ నొక్కితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సంబంధిత ప్రాంతానికి చెందిన ఉన్నతాధికారికి ఫోన్ సందేశం రూపంలో సమాచారం అందుతుంది. వీరితో పాటు వింగ్ కమాండర్, సెక్టర్ కమాండర్, జోన్ ఉన్నతాధికారికి సమాచారం అందుతుందని సింధ్ రేంజర్స్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇదే యాప్ ను షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, మీడియా సంస్థలను ఈ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. వాట్సాప్ ద్వారా కరాచీ ప్రజలు వీడియోలు, ఫొటోలు పంపి నేరాలను అరికట్టేందుకు గత నెలలో పారామిలిటరీ బలగాలు ఓ యాప్ ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అదేబాటలో తాజాగా కరాచీలో ఈ యాప్ కు సింధ్ రేంజర్స్ శ్రీకారం చుట్టింది. -
ఫోన్ ముందు దగ్గితే చాలు..
మీకు న్యుమోనియా లేదా ఆస్థమా లాంటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయా? వాటి తీవ్రత ఎంత ఉందో డాక్టర్ వద్దకు వెళ్లకుండానే తెలుసుకోవాలనుందా? అయితే సింపుల్‌గా మీ స్మార్ట్ ఫోన్ తీసుకుని దాని ఎదురుగా ఒకసారి దగ్గితే చాలు.. మీకు ఎలాంటి సమస్యలున్నాయో ఇట్టే తెలిసిపోతుంది. ఆస్ట్రేలియాకు చచెందిన డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రొవైడర్ ఈ యాప్‌ను తయారుచేశారు. 'రెస్ యాప్' అనే ఈ యాప్‌ను 524 మంది పిల్లలపై ప్రయోగించి చూశారు. ఈ ప్రయోగాలలో 89 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చినట్లు యాప్ డెవలపర్లు తెలిపారు. పేషెంట్లు దగ్గినప్పుడు వారి శ్వాసను గమనించి, వాళ్లకు న్యుమోనియా, ఆస్థమా, బ్రాంకియోలిటిస్, సీఓపీడీ లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే గుర్తిస్తుంది. దీనికి ఇంకా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. అది అయిన తర్వాత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. -
వైఫై ఏసీలు వచ్చేస్తున్నాయి..
*రూ.35,990-రూ.41,990 శ్రేణిలో ధరలు... హైదరాబాద్: వీడియోకాన్ సంస్థ వై-ఫై ఎనేబుల్ ఏసీలను మార్కెట్లోకి తెచ్చింది. ఈ స్మార్ట్ ఏసీలను వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ ద్వారా నియంత్రించవచ్చని వీడియోకాన్ ఒక ప్రకటనలో తెలిపింది. 4 మోడళ్లలో, రెండు రంగుల్లో 1, 1.5 టన్నుల రేంజ్లో వీటిని అందిస్తున్నామని వీడియోకాన్‌కు చెందిన అక్షయ్ ధూత్ పేర్కొన్నారు. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఈ ఏసీల ధరలు రూ.35,990-రూ.41,990రేంజ్లో ఉన్నాయని వివరించారు. అత్యంత సమర్థంగా విద్యుత్‌ను వినియోగించుకునేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వీటిని రూపొందించామని పేర్కొన్నారు. ఆఫీసులో ఉంటూనే స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ఇంట్లో ఉన్న ఈ ఏసీను ఆన్/ఆఫ్ చేయవచ్చని తెలిపారు. బయటి వాతావరణానికి అనుగుణంగా తనకు తానే ఈ ఏసీ అడ్జెస్ట్ చేసుకునేలా అవర్లీ వెదర్ ఫీడ్ ఫీచర్ ఉందని పేర్కొన్నారు. -
దోమలను తరిమి కొట్టేందుకూ ఓ యాప్!!
ఈరోజుల్లో ఏ పనిచేయాలన్నా దానికి సంబంధించి స్మార్ట్ఫోన్లలో ఓ యాప్ కనిపిస్తోంది. తాజాగా, దోమల బారి నుంచి బయటపడటానికి కూడా ఒక యాప్‌ను తయారు చేశారు. ఇప్పటివరకు దోమలను తరిమి కొట్టాలంటే కాయిల్స్ గానీ, లిక్విడ్ గానీ లేదంటే మస్కిటో బ్యాట్లు గానీ ఉపయోగించేవారు. ఇప్పుడు అవేమీ అవసరం లేదని, స్మార్ట్‌ఫోన్‌లో తమ యాప్ ఒక్కటి ఇన్స్టాల్ చేసుకుని, దాన్ని ఆన్ చేస్తే చాలని ఆ యాప్ రూపకర్తలు తెలిపారు. అదెలాగంటారా.. అయితే చదవండి. 'మస్కిటో రిపెల్లెంట్' అనే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దాన్ని ఆన్ చేయగానే ఒక రకమైన ఫ్రీక్వెన్సీతో అది శబ్దాలను విడుదల చేస్తుంది. ఆ శబ్దం భరించలేక దోమలు ఎక్కడివక్కడే పారిపోతాయి. ఈ యాప్ కేవలం ఇలా దోమలను తరిమి కొట్టడమే కాదు.. అందులో ఉన్న 'ఎం ట్రాకర్' అనే ఫీచర్‌తో మీ ఇంట్లో ఎన్ని దోమలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియజెబుతుంది. ఈ యాప్ విడుదల చేసే శబ్దాలు కుక్క ఈలల కంటే కొంచెం ఎక్కువగా మాత్రమే ఉంటాయని, అందువల్ల మనుషులకు ఇబ్బందికరంగా అనిపించదని చెబుతున్నారు. పైగా, మన ప్రాంతానికి అనువుగా ఉండేలా ఫ్రీక్వెన్సీని కూడా మార్చుకోవచ్చు. దీనికి బ్యాటరీ కూడా పెద్దగా ఏమీ ఖర్చుకాదట. -
వస్తు మార్పిడికి డిజిటల్ టచ్..
అప్పుడెప్పుడో గతంలో.. డబ్బు ప్రస్తావన లేని రోజుల్లో ..వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. ఒకరి దగ్గర ఉన్నవి మరొకరికి పరస్పరం ఇచ్చి పుచ్చుకునేవారు. కాలక్రమేణా అంతా డబ్బుమయమైపోయింది. ఇప్పుడు కరెన్సీ లేనిదే ఏ పనీ జరగడం లేదు. కానీ, క్యాష్ గొడవ లేకుండా మళ్లీ ఆ పాత కాలం నాటి వస్తుమార్పిడి సాంప్రదాయాన్ని చలామణీలోకి తేవడానికి అడపాదడపా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అచ్చంగా అలాంటి కాన్సెప్టుతోటే బార్టర్డ్ (ఛ్చట్ట్ఛటఛీ) అనే స్మార్ట్‌ఫోన్ యాప్ (అప్లికేషన్) పుట్టుకొచ్చింది. దీన్ని ఉపయోగించడం చాలా సులువే. యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, లాగిన్ అయి, ఏ వస్తువులను మార్చుకోవాలనుకుంటున్నామో వాటి పిక్చర్‌ని అప్లోడ్ చేసి, పోస్ట్ చేస్తే సరి. అలాగే, మరొకరెవరైనా పోస్ట్ చేసినది మనకు, మనం పోస్ట్ చేసినది అవతలి వారికి నచ్చిన పక్షంలో.. ఇద్దరికీ ఆమోదయోగ్యమైతే.. ఆయా వస్తువులను ఇచ్చి పుచ్చుకోవచ్చు. ఇందులో ఎక్కడా డబ్బు ప్రస్తావన ఉండదు. ఇప్పటికే ఓఎల్ఎక్స్, క్వికర్ లాంటి ఆన్లైన్ క్లాసిఫైడ్ కంపెనీలు సెకండ్‌హ్యాండ్ వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లకు వేదికగా ఉంటున్నా.. బార్టర్డ్లో మాత్రం ఆర్థికపరమైన అమ్మకాలు, కొనుగోళ్లు ఉండవు. కేవలం వస్తువుల మార్పిడే ఉంటుంది. అయితే, ఈ యాప్ కంపెనీని నడపాలంటే మాత్రం డబ్బులు కావాలి కాబట్టి.. ఆ దిశగా కొన్ని ట్రయల్స్ వేస్తున్నారు దీన్ని రూపొందించిన ఆర్జవ్ దవే, ఆలాప్ షా. ఇందుకోసం బార్టర్ పాయింట్స్‌ను కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఉదాహరణకు, వంద పాయింట్లు ఉన్న వ్యక్తి పోస్ట్ చేసిన యాడ్ కన్నా 101 పాయింట్లు ఉన్న వ్యక్తి పోస్ట్ చేసిన యాడ్‌కి కాస్త ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. మరి ఈ పాయింట్లు ఎలా వస్తాయి.. అంటే.. సైన్ ఇన్ చేసినా, ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసినా, ఏదైనా యాడ్‌ని పోస్ట్ చేసినా లేదా ఏదైనా లావాదేవీ జరిపినా పాయింట్లు లభిస్తాయి. పాయింట్లను అమ్ముతారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్.. మీ దగ్గరో వంద పాయింట్లు ఉన్నాయి. మీరు కావాలనుకున్నది తీసుకోవాలంటే మరో యాభై పాయింట్లు అవసరమవుతాయనుకుంటే.. వాటిని వెబ్సైట్ నుంచి కొనుక్కోవచ్చు.