సాక్షి, హైదరాబాద్: వయసు 13 ఏళ్లు.. చదువుతున్నది ఏడో తరగతి.. కానీ ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తల మధ్య ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాడు. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో కనిపించే ఈ బుడతడి పేరు హామిష్ ఫిన్‌లేసన్.
ఆస్ట్రేలియాకు చెందిన మూన్‌షాట్ ఇండస్ట్రీ గ్లోబల్ లిమిటెడ్ సంస్థ తరఫున ప్రపంచ ఔత్సా హిక పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో పాల్గొంటున్నాడు. పదో ఏటనే స్మార్ట్‌ఫోన్ యాప్ తయారుచేసి.. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాడు. ఇప్పటివరకు ఆరు యాప్‌లు తయారు చేశాడు. ప్రపంచస్థాయి సమస్యలను పరిష్కరించడమే తన ధ్యేయమని.. సొంతంగా ఓ వీడియోగేమ్ తయారు చేయాలనేది లక్ష్యమని చెబుతున్నాడు. జీఈఎస్‌కు హాజరైనవారిలో అతిచిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన హామిష్ ఫిన్‌లేసన్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ విశేషాలివి..
సాక్షి: హాయ్.. యంగ్‌బాయ్!
హామిష్: హాయ్..
సాక్షి: ఇంత పెద్ద సదస్సుకు హాజరైన చిన్న వయస్కుడిగా ఎలా ఫీలవుతున్నారు?
హామిష్: నాకు చాలా సంతోషంగా ఉంది. జీఈఎస్‌కు హాజరుకావడం ఇది రెండోసారి.
సాక్షి: ఇంత చిన్నవయసులో ఆహ్వానం ఎలా వచ్చింది? అసలు మీరేం చేస్తున్నారు?
హామిష్: నేను సముద్ర వాతావరణ పరిరక్షణ కోసం యాప్‌లు తయారుచేశాను. సముద్ర తాబేళ్ల పరిరక్షణ కోసం టెక్నాలజీ సాయంతో పోరాటం చేస్తున్నా. ఇప్పటికి అయిదు యాప్‌లు తయారు చేశాను. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు ఉపయోగపడే ఆరో యాప్ ఇంకా తయారీ దశలో ఉంది.
సాక్షి: మీ యాప్‌ల ద్వారా ఏం సాధించదలచుకున్నారు?
హామిష్: నేను తయారు చేసిన వాటిలో ఎదుగుదల లోపాలకు సంబంధించిన ఆటిజంపై అవగాహన కల్పించే యాప్ కూడా ఉంది. నేనూ, మా నాన్న కూడా ఆటిజం సమస్య ఎదుర్కొంటున్న వారమే కావడంతో ప్రత్యేకంగా దీన్ని రూపొందించాను. ఇక, సముద్ర జలాలు, అక్కడి వాతావరణం ప్రపంచ సామరస్యానికి ఎంత అవసరమో మీకు తెలుసు. ప్రపంచస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలనుకుంటున్నా. నా పదో యేటే సముద్ర తాబేళ్ల కోసం ట్రిపుల్–టీ అనే యాప్ రూపొందించా. నా ఐదు యాప్‌లను 54 దేశాల్లో వినియోగిస్తున్నారు.
సాక్షి: మీకు స్ఫూర్తి ఎవరు?
హామిష్: చిన్నప్పుడు ఓ కాంపిటీషన్‌లో పాల్గొన్నప్పుడు.. ఏదైనా పెద్దగా తయారుచేయాలని అనిపించింది. ఐఓఎక్స్, మూన్‌షాట్ టెక్నాలజీలంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న గ్రేమ్ ఫిన్‌లేసన్ ఇచ్చే ప్రోత్సాహం కూడా నన్ను ముందుకు నడిపిస్తోంది. నాకు సీ ఓషన్ ఎన్విరాన్‌మెంట్‌తో పాటు అంతరిక్ష శాస్త్రమంటే కూడా ఇష్టం. పెద్దయిన తర్వాత దానిపై దృష్టి పెడతా.
సాక్షి: చదువును, వృత్తిని ఎలా సమన్వయపరచుకుంటున్నారు?
హామిష్: నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్లగానే ముందు హోమ్‌వర్క్ చేసేస్తాను. తర్వాతే నా ఇతర పనులపై దృష్టి పెడతా..
సాక్షి: ఇప్పటికి ఎంత సంపాదించారు?
హామిష్: ఇప్పటివరకు 10 వేల డాలర్ల కన్నా ఎక్కువే సంపాదించి ఉంటాను. అయినా డబ్బు ముఖ్యం కాదు. నా యాప్‌లకు వచ్చే లైక్‌లే నాకు తృప్తినిస్తాయి.
సాక్షి: మీ లక్ష్యం ఏమిటి?
హామిష్: నాకు సొంతంగా వీడియోగేమ్ తయారు చేయాలని ఉంది. అది నా లక్ష్యం.
సాక్షి: భారత్‌కు రావడం ఎలా ఉంది?
హామిష్: ఇక్కడకు రావడం నాకు చాలా ఉత్తేజకరంగా అనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment