పల్లెలు... రెడీ టు ఈట్‌!! | Providing food for ten minutes | Sakshi
Sakshi News home page

పల్లెలు... రెడీ టు ఈట్‌!!

Published Tue, May 14 2019 12:30 AM | Last Updated on Tue, May 14 2019 9:41 AM

Providing food for ten minutes - Sakshi

న్యూఢిల్లీ: కోరుకున్న వెంటనే, అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఆహారాన్ని సిద్ధం చేసుకునే అవకాశం కల్పించేవి రెడీ టు ఈట్‌ ఉత్పత్తులు. అంత సమయం కూడా లేదనుకుంటే ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ ఉండనే ఉన్నాయి. ఇప్పటిదాకా పట్టణాల్లోని మధ్యతరగతి వినియోగదారులే లక్ష్యంగా కంపెనీలు ఈ ఉత్పత్తులను గురిపెట్టేవి. అయితే, ఈ మధ్య కాలంలో పల్లెల్లోనూ వీటి అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రజలు సైతం వీటి వినియోగం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాలకు అనుకూలంగా ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. ఎమ్‌టీఆర్‌ ఫుడ్స్, బాగ్రిస్, ఐడీ ఫ్రెష్, మేయాస్, గిట్స్‌ ఫుడ్‌ అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. దీంతో ఈ కంపెనీలు గ్రామీణ ప్రాంతాలకు అనుకూలమైన ప్యాక్‌ సైజులు, ధరలతో ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. సాధారణంగా గ్రామీణ మార్కెట్లలో లూజ్‌ మసాలాలు, సుగంధ ద్రవ్యాల వంటి అమ్మకాలు ఎక్కువ. వీటి స్థానంలో బ్రాండెడ్‌ కంపెనీల ఇన్‌స్టంట్‌ మిక్స్‌ ఉత్పత్తులైన బాదం మిల్క్, ఉప్మా, రవ్వ ఇడ్లీ మిక్స్, ఓట్స్, ముస్లి వంటివీ ఇటీవల అమ్ముడుపోతున్నాయి. ఈ కామర్స్‌ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్‌ అన్ని ప్రాంతాల్లోకీ చొచ్చుకుపోవటం... స్మార్ట్‌ఫోన్ల వినియోగం విస్తరణ... పోషకాలపై అవగాహన పెరగడం గ్రామీణ ప్రాంతాల్లోనూ అమ్మకాలు పెరిగేందుకు దోహదపడుతున్నట్టు బ్యాగ్రిస్‌ డైరెక్టర్‌ ఆదిత్య బాగ్రి తెలిపారు. 

దేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం  
బ్రేక్‌ఫాస్ట్‌ (అల్పాహారం) ఉత్పత్తుల మార్కెట్‌ 2,500 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇందులోనూ వినియోగదారులు పాశ్చాత్య ఉత్పత్తుల కంటే దేశీయ సంప్రదాయ పదార్థాలు లేదా పోషకాలతో కూడిన ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో గ్రామీణ మార్కెట్‌ కూడా భిన్నంగా ఏమీ లేదు. అందుకే కంపెనీలు పల్లె మార్కెట్లకు తక్కువ ధరలతో ఉత్పత్తులను తీసుకెళుతున్నాయి. ఎంటీఆర్‌ ఫుడ్స్‌ బాదం మిక్స్‌ పౌడర్, ఇన్‌స్టంట్‌ రవ్వ ఇడ్లి మిక్స్‌ ఉత్పత్తులను రూ.5, రూ.10కే అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే విధంగా గిట్స్‌ ఫుడ్‌ కంపెనీ రూ.10కే గులాబ్‌ జామూన్‌ మిక్స్‌ ప్యాకెట్‌ను విడుదల చేసింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఎక్కువగా అమ్ముడయ్యే ఈ కంపెనీ ఉత్పత్తుల్లో ఇదీ ఒకటి. ‘‘మా గులాబ్‌ జామూన్, ఖమాన్‌ దోక్లా మిక్స్‌ మొత్తం అమ్మకాల్లో సగం మేర పెళ్లిళ్ల సీజన్‌లో గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటున్నాయి. టైర్‌–1, టైర్‌–2 మార్కెట్లలో సూపర్‌ మార్కెట్లు ఉన్నాయి. పంపిణీ పరంగా ఇవి కీలక చోదకాలు’’ అని గిట్స్‌ ఫుడ్‌ డైరెక్టర్‌ సాహిల్‌ గిలానీ తెలిపారు.  

విస్తరణకు బోలెడు అవకాశాలు 
మన దేశంలో ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ ఎన్నో ఉత్పత్తుల రూపంలో అందుబాటులోకి వచ్చినా కానీ, బిస్కట్లు, స్నాక్స్‌ మినహా వేరే ఉత్పత్తుల మార్కెట్‌ అంతగా విస్తరించలేదు. దీనికి కారణం స్వతహాగా సంప్రదాయ ఆరోగ్య, రుచికరమైన స్థానిక పదార్థాలకే వినియోగదారులు పెద్ద పీట వేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కంపెనీలు పట్టణ మార్కెట్లపైనే పెద్దగా దృష్టి సారించాయి. ఖర్చు చేసే శక్తి ఎక్కువగా ఉండడం, సమయం ఆదా చేయడం, సౌకర్యం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వంటివి పట్టణ వినియోగదారులు వీటి వైపు మొగ్గుచూపించే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో వీటి వినియోగం కూడా పరిమితంగానే ఉంది. ఎంటీఆర్‌కు చెందిన ఓక్లా గ్రూపు గ్రామీణ మార్కెట్లలో మసాలా ఉత్పత్తులను ఎక్కువగా విక్రయిస్తోంది. క్రమంగా రెడీ టు ఈట్‌ ఉత్పత్తులను కూడా ప్రవేశపెడుతోంది. ‘‘గ్రామీణ విభాగం అమ్మకాల్లో 16–18 శాతం వృద్ధి కనిపిస్తోంది. కానీ, పట్టణాల్లో వృద్ధి 8 శాతంగానే ఉంది. జూన్‌ నాటికి గ్రామీణ మార్కెట్లకే ఉద్దేశించిన వ్యూహాన్ని అమలు చేయనున్నాం’’ అని ఎంటీఆర్‌ ఫుడ్స్‌ సీఈవో సంజయ్‌ శర్మ తెలిపారు. బెంగళూరుకు చెందిన మేయాస్‌ కంపెనీ కూడా గ్రామీణ అమ్మకాల్లో ఏటా 15–17 శాతం వృద్ధి సాధిస్తోంది. ‘‘బ్లెండెడ్‌ మసాలా ఉత్పత్తుల అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో 6–8 ఏళ్ల క్రితం నుంచి పెరుగుతున్నాయి. కానీ, ఇన్‌స్టంట్‌ మిక్స్‌ ఉత్పత్తుల అమ్మకాల ప్రాచుర్యం మాత్రం గత రెండు, మూడేళ్లుగా పెరుగుతోంది’’అని మేయాస్‌ డైరెక్టర్‌ సుదర్శన్‌ మేయా తెలిపారు.  

దేశ బ్రేక్‌ఫాస్ట్‌ మార్కెట్‌ సైజు: రూ.2,580 కోట్లు. 
2015 నాటికి ఈ మార్కెట్‌: 1,760 కోట్లు. 
2016–18 మధ్య  ఏటా 14.3 శాతం చొప్పున వృద్ధి 
2023 వరకు ఏటా 10.7 శాతం వృద్ధి అంచనా   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement