దోమలను తరిమి కొట్టేందుకూ ఓ యాప్!!
ఈరోజుల్లో ఏ పనిచేయాలన్నా దానికి సంబంధించి స్మార్ట్ఫోన్లలో ఓ యాప్ కనిపిస్తోంది. తాజాగా, దోమల బారి నుంచి బయటపడటానికి కూడా ఒక యాప్ను తయారు చేశారు. ఇప్పటివరకు దోమలను తరిమి కొట్టాలంటే కాయిల్స్ గానీ, లిక్విడ్ గానీ లేదంటే మస్కిటో బ్యాట్లు గానీ ఉపయోగించేవారు. ఇప్పుడు అవేమీ అవసరం లేదని, స్మార్ట్ఫోన్లో తమ యాప్ ఒక్కటి ఇన్స్టాల్ చేసుకుని, దాన్ని ఆన్ చేస్తే చాలని ఆ యాప్ రూపకర్తలు తెలిపారు. అదెలాగంటారా.. అయితే చదవండి.
'మస్కిటో రిపెల్లెంట్' అనే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దాన్ని ఆన్ చేయగానే ఒక రకమైన ఫ్రీక్వెన్సీతో అది శబ్దాలను విడుదల చేస్తుంది. ఆ శబ్దం భరించలేక దోమలు ఎక్కడివక్కడే పారిపోతాయి. ఈ యాప్ కేవలం ఇలా దోమలను తరిమి కొట్టడమే కాదు.. అందులో ఉన్న 'ఎం ట్రాకర్' అనే ఫీచర్తో మీ ఇంట్లో ఎన్ని దోమలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియజెబుతుంది. ఈ యాప్ విడుదల చేసే శబ్దాలు కుక్క ఈలల కంటే కొంచెం ఎక్కువగా మాత్రమే ఉంటాయని, అందువల్ల మనుషులకు ఇబ్బందికరంగా అనిపించదని చెబుతున్నారు. పైగా, మన ప్రాంతానికి అనువుగా ఉండేలా ఫ్రీక్వెన్సీని కూడా మార్చుకోవచ్చు. దీనికి బ్యాటరీ కూడా పెద్దగా ఏమీ ఖర్చుకాదట.