వస్తు మార్పిడికి డిజిటల్ టచ్..
అప్పుడెప్పుడో గతంలో.. డబ్బు ప్రస్తావన లేని రోజుల్లో ..వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. ఒకరి దగ్గర ఉన్నవి మరొకరికి పరస్పరం ఇచ్చి పుచ్చుకునేవారు. కాలక్రమేణా అంతా డబ్బుమయమైపోయింది. ఇప్పుడు కరెన్సీ లేనిదే ఏ పనీ జరగడం లేదు. కానీ, క్యాష్ గొడవ లేకుండా మళ్లీ ఆ పాత కాలం నాటి వస్తుమార్పిడి సాంప్రదాయాన్ని చలామణీలోకి తేవడానికి అడపాదడపా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అచ్చంగా అలాంటి కాన్సెప్టుతోటే బార్టర్డ్ (ఛ్చట్ట్ఛటఛీ) అనే స్మార్ట్‌ఫోన్ యాప్ (అప్లికేషన్) పుట్టుకొచ్చింది. దీన్ని ఉపయోగించడం చాలా సులువే.
యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, లాగిన్ అయి, ఏ వస్తువులను మార్చుకోవాలనుకుంటున్నామో వాటి పిక్చర్‌ని అప్‌లోడ్ చేసి, పోస్ట్ చేస్తే సరి. అలాగే, మరొకరెవరైనా పోస్ట్ చేసినది మనకు, మనం పోస్ట్ చేసినది అవతలి వారికి నచ్చిన పక్షంలో.. ఇద్దరికీ ఆమోదయోగ్యమైతే.. ఆయా వస్తువులను ఇచ్చి పుచ్చుకోవచ్చు. ఇందులో ఎక్కడా డబ్బు ప్రస్తావన ఉండదు.
ఇప్పటికే ఓఎల్‌ఎక్స్, క్వికర్ లాంటి ఆన్‌లైన్ క్లాసిఫైడ్ కంపెనీలు సెకండ్‌హ్యాండ్ వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లకు వేదికగా ఉంటున్నా.. బార్టర్డ్‌లో మాత్రం ఆర్థికపరమైన అమ్మకాలు, కొనుగోళ్లు ఉండవు. కేవలం వస్తువుల మార్పిడే ఉంటుంది. అయితే, ఈ యాప్ కంపెనీని నడపాలంటే మాత్రం డబ్బులు కావాలి కాబట్టి.. ఆ దిశగా కొన్ని ట్రయల్స్ వేస్తున్నారు దీన్ని రూపొందించిన ఆర్జవ్ దవే, ఆలాప్ షా. ఇందుకోసం బార్టర్ పాయింట్స్‌ను కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.
ఉదాహరణకు, వంద పాయింట్లు ఉన్న వ్యక్తి పోస్ట్ చేసిన యాడ్ కన్నా 101 పాయింట్లు ఉన్న వ్యక్తి పోస్ట్ చేసిన యాడ్‌కి కాస్త ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. మరి ఈ పాయింట్లు ఎలా వస్తాయి.. అంటే.. సైన్ ఇన్ చేసినా, ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసినా, ఏదైనా యాడ్‌ని పోస్ట్ చేసినా లేదా ఏదైనా లావాదేవీ జరిపినా పాయింట్లు లభిస్తాయి. పాయింట్లను అమ్ముతారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్.. మీ దగ్గరో వంద పాయింట్లు ఉన్నాయి. మీరు కావాలనుకున్నది తీసుకోవాలంటే మరో యాభై పాయింట్లు అవసరమవుతాయనుకుంటే.. వాటిని వెబ్‌సైట్ నుంచి కొనుక్కోవచ్చు.