విద్యార్థుల రక్షణ కోసం స్మార్ట్ యాప్
ఇస్లామాబాద్: విద్యాసంస్థల్లో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకోవడం, అమాయక చిన్నారులు మృతిచెందడం లాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి కదా. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు సరికొత్త యాప్ ను రూపొందించారు. పాకిస్తాన్ లోని కరాచీలో శనివారం నూతన అప్లికేషన్ ను ఆవిష్కరించారు. సింధ్ రేంజర్స్ అనే సంస్థ ఈ యాప్ వివరాలను వెల్లడించింది. రేంజర్స్ స్కూల్ కాలేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ద్వారా దాదాపు 3 వేల విద్యాసంస్థలు తమ వివరాలను ఇందులో రిజిస్టర్ చేసుకునే వెసలుబాటు ఉంది.
దీంతో అత్యవసర సమయాల్లో ఈ యాప్ బటన్ నొక్కితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సంబంధిత ప్రాంతానికి చెందిన ఉన్నతాధికారికి ఫోన్ సందేశం రూపంలో సమాచారం అందుతుంది. వీరితో పాటు వింగ్ కమాండర్, సెక్టర్ కమాండర్, జోన్ ఉన్నతాధికారికి సమాచారం అందుతుందని సింధ్ రేంజర్స్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇదే యాప్ ను షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, మీడియా సంస్థలను ఈ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. వాట్సాప్ ద్వారా కరాచీ ప్రజలు వీడియోలు, ఫొటోలు పంపి నేరాలను అరికట్టేందుకు గత నెలలో పారామిలిటరీ బలగాలు ఓ యాప్ ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అదేబాటలో తాజాగా కరాచీలో ఈ యాప్ కు సింధ్ రేంజర్స్ శ్రీకారం చుట్టింది.