నాకు ఇదే చివరి ఐసీసీ టోర్నీ: స్టార్‌ క్రికెటర్‌ కామెంట్స్‌ వైరల్‌ | Champions Trophy Could Be My Last ICC Tournament: South Africa Star | Sakshi
Sakshi News home page

నాకు ఇదే చివరి ఐసీసీ టోర్నీ: స్టార్‌ క్రికెటర్‌ కామెంట్స్‌ వైరల్‌

Published Fri, Feb 28 2025 4:55 PM | Last Updated on Fri, Feb 28 2025 5:05 PM

Champions Trophy Could Be My Last ICC Tournament: South Africa Star

సౌతాఫ్రికా వెటరన్‌ బ్యాటర్‌ రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌(Rassie van der Dussen) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy) చివరి ఐసీసీ టోర్నీ కాబోతుందని పేర్కొన్నాడు. అయితే, తన రిటైర్మెంట్‌ అంశం గురించి ఇప్పుడే చెప్పలేనని.. ఇది మాత్రం వాస్తమని అన్నాడు.

అఫ్గన్‌తో మ్యాచ్‌లో అర్ధ శతకం
కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ మొదలుకాగా.. సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను ఎదుర్కొంది. కరాచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో డసెన్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకంతో అదరగొట్టాడు. కేవలం 46 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు సాధించాడు.

నాకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ
తదుపరి సౌతాఫ్రికా ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా రావల్పిండిలో బుధవారం జరగాల్సిన మ్యాచ్‌ రద్దై పోయింది. ఈ క్రమంలో మార్చి 1న తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన డసెన్‌.. ‘‘నాకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ అని కచ్చితంగా చెప్పగలను.

ఇందుకోసం ముందుగా నేనేమీ ప్రణాళికలు రచించుకోలేదు. మేనేజ్‌మెంట్‌ కూడా నాపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. కానీ ఇదే నిజం. నా కెరీర్‌ చరమాంకానికి చేరుకుంది. ప్రొటిస్‌ తరఫున క్రికెట్‌ ఆడటంమే నా ఏకైక లక్ష్యం. దేశానికి ప్రాతినిథ్యం వహించడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు.

ప్రొటిస్‌ తరఫున కొనసాగుతా
చాలా మంది రిటైర్మెంట్‌ తర్వాత లీగ్‌ క్రికెట్‌ ఆడతావా? అని అడుగుతున్నారు. ఏమో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను. కానీ లీగ్‌ క్రికెట్‌లో ఆడాలన్న తపన నాలో ఉంది. అయితే, ముందుగా చెప్పినట్లు సౌతాఫ్రికాకు ఆడటమే నా మొదటి ప్రాధాన్యం. ఒకవేళ ఇంకో సెంట్రల్‌ కాంట్రాక్టు దక్కితే కచ్చితంగా ప్రొటిస్‌ తరఫున కొనసాగుతా’’ అని తన మనసులోని భావాలను పంచుకున్నాడు.

కాగా 36 ఏళ్ల రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడగుపెట్టాడు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటి వరకు 18 టెస్టులు, 69 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 905, 2516, 1257 పరుగులు చేశాడు. వన్డేల్లో అతడి ఖాతాలో ఆరు శతకాలు ఉన్నాయి.

చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో సౌతాఫ్రికా జట్టు
ర్యాన్ రికెల్టన్ (వికెట్‌ కీపర్‌), టోనీ డి జోర్జి, తెంబా బావుమా (కెప్టెన్‌), రాసీ వాన్ డెర్ డసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, హెన్రిచ్‌ క్లాసెన్‌, తబ్రేజ్‌ షంసీ, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కార్బిన్‌ బాష్‌.

చదవండి: ‘ఏంటిది? నేను అవుటయ్యానా?’.. జాన్సన్‌ దెబ్బకు రహ్మనుల్లా బౌల్డ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement