మీట నొక్కితే.. మీ ముందే!
కారు అంటే.... నాలుగు డోర్లు, చక్రాలు, ఓ స్టీరింగ్... ఇంతేనా? కానే కాదంటోంది రిన్‌స్పీడ్. కావాలంటే పక్క ఫొటోలో చూడండి. స్విట్జర్లాండ్‌కు చెందిన రిన్‌స్పీడ్ తయారు చేసిన సూపర్ హైటెక్ కారు ఇదే. పేరు ఒయాసిస్. ఒక్కొక్కటిగా విశేషాలు తెలుసుకుందాం. ఒయాసిస్‌లో ఉన్న సీట్లు రెండే. డ్రైవర్ అవసరం లేని అటానమస్ వెహికల్ కూడా. దీని ప్రయోజనాలేమిటో తెలుసా? స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లో ఒక మీట నొక్కితే చాలు... కారు మీ దగ్గరకే వచ్చేస్తుంది. అలాగే ఏ పక్కన తగులుతుందో... ఎక్కడ గీత పడిపోతుందో అన్న డౌట్లు అస్సలు లేకుండా ఎంచక్కా ఇది తనంతట తానే పార్కింగ్ కూడా చేసేయగలదు. స్టీరింగ్ అనేది పేరుకు మాత్రమే. అవసరమైతే దీన్ని మడి చేయవచ్చు... పైన కీ బోర్డు, కాఫీ కప్పులు పెట్టేసుకోవచ్చు. డ్యాష్‌బోర్డు ఉండాల్సిన చోట విశాలమైన టీవీ స్క్రీన్ ఉంటుంది.
మరి స్పీడు... దారి.. మ్యాప్ వంటివి ఎలా తెలుసుకోవాలి? సింపుల్. ఎదురుగా ఉన్న విండ్‌స్క్రీన్‌పై మీరు వెళ్లాల్సిన ప్రాంతపు రూట్, మ్యాప్‌లు, ఇతర వివరాలు అన్నీ కనిపిస్తాయి. ఈ స్క్రీన్ వెనుక ఉండే ప్రాంతం మరీ ఆసక్తికరం... ఏ కారులోనూ ఊహించలేనిది. అదేంటో తెలుసా? హైటెక్ గార్డెన్. అవసరమైతే ఇక్కడ ఆకుకూరల నుంచి ముల్లంగి వరకూ అనేకం పండించుకోవచ్చునట. కేవలం విద్యుత్తుతో మాత్రమే పనిచేయడం... పర్సనల్ డిజిటల్ అసి స్టెంట్, మీ ఫేస్‌బుక్, ట్వీటర్ అకౌంట్లు చూస్తూ మీకు నచ్చే పోస్ట్‌లను మీ ముందు పెట్టడం వంటి విషయాలన్నీ అలవోకగా చేసేస్తుంది. ఇంతకీ ఈ ఒయాసిస్ ఎప్పుడొస్తుందంటారా? వచ్చే నెల అమెరికాలో ‘కన్సూ మర్ ఎలక్ట్రానిక్స్ షో’లో తొలిసారి ప్రదర్శించనున్నారు. మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుంది? ధర ఎంత ఉంటుంది? వంటి వివరాలన్నీ ఆ తరువాతే తెలుస్తాయి!