నకిలీలకు ఇక చెక్
నకిలీలకు ఇక చెక్
Published Fri, Jul 7 2017 4:36 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM
లండన్: నకిలీ వస్తువులను తయారు చేయటంతోపాటు వాటి డిజిటల్ ఐడెంటిటీని కాపీ కొట్టటం వంటి ఖరీదైన నేరాలకు ఇక పుల్‌స్టాప్ పడనుంది. నకిలీ వస్తువులను కనిపెట్టే యాప్ త్వరలో రాబోతోంది. స్మార్ట్ ఫోన్లలో వాడే ఈ యాప్ నకిలీ వస్తువులను వందశాతం కచ్చితంగా గుర్తించగలుగుతుందని యూకేలోని ఓ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్రకటించారు. కొత్త క్వాంటం టెక్నాలజీ సాయంతో నకిలీ వస్తువులను కనిపెట్టే దిశగా తాము ముందడుగు వేశామన్నారు.
ఇది గనుక విజయవంతమైతే నకిలీ వస్తువులను తయారు చేసి, విక్రయించే వారి ఆటలు ఇక సాగవని ప్రొఫెసర్ రాబర్ట్ యంగ్ తెలిపారు. వచ్చే ఏడాది ప్రథమార్థం కల్లా ఈ టెక్నాలజీతో తయారైన యాప్‌లను స్మార్ట్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుని నకిలీ వస్తువులను వినియోగదారులు సులువుగా కనిపెట్టే వీలుంటుందని వివరించారు. ఏదైనా వస్తువుకు సంబంధించి డిజిటల్ ఐడెంటిటీని ఫోర్జరీ చేయటం, నకిలీ వస్తువులను తయారుచేయటం వంటి వాటిని పూర్తిగా నిరోధించవచ్చని తెలిపారు.
ఏటా ప్రపంచవ్యాప్తంగా నకిలీ వస్తువుల కారణంగా సుమారు యాబైవేల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లుతోంది. కేవలం నకిలీ మందుల కారణంగానే ఏటా 200 బిలియన్ డాలర్ల మేర నష్టం కలుగుతుండగా ఇటువంటి మందులు వాడి అనారోగ్యం బారిన పడటమే కాదు సుమారు పది లక్షల మంది మృత్యువాత పడుతున్నట్లు అంచనా.
Advertisement
Advertisement