fake goods
-
స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌కు జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం భారీ షాక్ ఇచ్చింది. తన బ్రాండ్ పేరుతో నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తోందని ఆరోపిస్తూ స్నాప్‌డీల్‌పై కేసు నమోదు చేసింది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు కాసియో ఈ మేరకు ఢిల్లీలోని తీస్ హజారీ జిల్లా కోర్టులో కేసు వేసింది. దీంతో ఆ వస్తువుల ప్రకటనలు, ప్రదర్శన, అమ్మకాలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఎక్స్-పార్ట్ నిషేధ ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది. కాసియో బ్రాండ్ వాచెస్, కాలిక్యులేటర్ల నకిలీ అమ్మకాలకు సంబంధించి వినియోగదారుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్నాప్‌డీల్ చట్టపరమైన చర్యలను ప్రారంభించినట్లు కంపెనీ లీగల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ సతోషి యమజాకి వెల్లడించారు. అయితే కోర్టు ఆదేశాలను సమీక్షించి, మార్పులు చేయాల్సిందిగా కోరతామని స్నాప్‌డీల్ తెలిపింది. ప్లాట్‌ఫాంలు, విక్రేతల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ముఖ్యమని వ్యాఖ్యానించింది. కొద్దిమంది చర్యల వల్ల నిజమైన అమ్మకందారులపై ప్రతికూల ప్రభావితం చూపుతోందని స్నాప్‌డీల్ ప్రతినిధి చెప్పారు. ఈ క్రమంలో నిజమైన ఉత్పత్తులను మాత్రమే విక్రయించేలా సెల్లర్స్ జాగ్రత్త వహించాలన్నారు. లేనిపక్షంలో ఆయా సంస్థలు తమ మార్కెట్‌ను కోల్పోవడంతోపాటు, కాంట్రాక్టు నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ప్లాట్ఫామ్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తామని హెచ్చరించారు. అలాగే బ్రాండ్లు తమ మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనను నివేదించడానికి వీలుగా, ఆన్లైన్లో నకిలీ ఉత్పత్తుల నిరోధక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్టు కంపెనీ తెలిపింది. -
నకిలీ వస్తువులపై ఉక్కుపాదం: ఈటల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్మగ్లింగ్, నకిలీ, గుడుంబా, పేకాట క్లబ్బులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపినట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఫిక్కీ కాస్కేడ్ (కమిటీ ఎగైనెస్ట్ స్మగ్లింగ్ అండ్ కౌంటర్ ఫిటింగ్ యాక్టివిటీస్ డిస్ట్రాయింగ్ ద ఎకానమీ) సంస్థ ‘నకిలీ, స్మగ్లింగ్‌పై పోరాటం, ఆర్థికాభివృద్ధి వేగవంతం అత్యవసరం’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో డబ్బే ప్రధానంగా వ్యాపారాలు జరుగుతున్నాయని, నైతిక విలువలు, ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదన్నారు. చట్టాలను చేసే వాళ్లు నిబద్ధతతో పనిచేస్తే నకిలీలను నిర్మూలించవచ్చన్నారు. ఉత్పత్తి రంగ నిపుణులు నకిలీ వస్తువులపై ప్రభుత్వానికి సమాచారం అందించాలన్నారు. నకిలీ వస్తువులు ఉత్పత్తి చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ అనిల్‌కుమార్ జైన్ మాట్లాడుతూ.. వినియోగదారులు వస్తువులు కొనేటప్పుడు రశీదు తీసుకోవాలని, దీనివల్ల 80 శాతం నకిలీ వస్తువులను నిర్మూలించవచ్చన్నారు. కార్యక్రమంలో ఫిక్కీ చైర్మన్ దేవేంద్ర సురానా తదితరులు పాల్గొన్నారు. -
నకిలీలకు ఇక చెక్
లండన్: నకిలీ వస్తువులను తయారు చేయటంతోపాటు వాటి డిజిటల్ ఐడెంటిటీని కాపీ కొట్టటం వంటి ఖరీదైన నేరాలకు ఇక పుల్‌స్టాప్ పడనుంది. నకిలీ వస్తువులను కనిపెట్టే యాప్ త్వరలో రాబోతోంది. స్మార్ట్ ఫోన్లలో వాడే ఈ యాప్ నకిలీ వస్తువులను వందశాతం కచ్చితంగా గుర్తించగలుగుతుందని యూకేలోని ఓ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్రకటించారు. కొత్త క్వాంటం టెక్నాలజీ సాయంతో నకిలీ వస్తువులను కనిపెట్టే దిశగా తాము ముందడుగు వేశామన్నారు. ఇది గనుక విజయవంతమైతే నకిలీ వస్తువులను తయారు చేసి, విక్రయించే వారి ఆటలు ఇక సాగవని ప్రొఫెసర్ రాబర్ట్ యంగ్ తెలిపారు. వచ్చే ఏడాది ప్రథమార్థం కల్లా ఈ టెక్నాలజీతో తయారైన యాప్‌లను స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుని నకిలీ వస్తువులను వినియోగదారులు సులువుగా కనిపెట్టే వీలుంటుందని వివరించారు. ఏదైనా వస్తువుకు సంబంధించి డిజిటల్ ఐడెంటిటీని ఫోర్జరీ చేయటం, నకిలీ వస్తువులను తయారుచేయటం వంటి వాటిని పూర్తిగా నిరోధించవచ్చని తెలిపారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా నకిలీ వస్తువుల కారణంగా సుమారు యాబైవేల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లుతోంది. కేవలం నకిలీ మందుల కారణంగానే ఏటా 200 బిలియన్ డాలర్ల మేర నష్టం కలుగుతుండగా ఇటువంటి మందులు వాడి అనారోగ్యం బారిన పడటమే కాదు సుమారు పది లక్షల మంది మృత్యువాత పడుతున్నట్లు అంచనా.