భార్య మృతికి కారకుడైన భర్తకు రెండేళ్ల జైలు
నల్లగొండ లీగల్ :
తాగుడుకు బానిసై నిరంతరం భార్యను వేధిస్తూ ఆమె మృతికి కారుకుడైన మునుగోడు మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన పొడపంగి రవికి రెండేళ్ల జైలు శిక్ష, ఐదు వేల జరిమానా విధిస్తూ నల్లగొండ అసిస్టెంట్ సెషన్స్ కె.కల్యాణ చక్రవర్తి మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు...మునుగోడు మండలం ఇప్పర్తికి చెందిన లలితకు రవితో 13 ఏళ్ల కింద వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు అయిన అనంతరం తాగుడుకు బానిసై లలితను వేధించడంతో ఆమె 2013 ఫిబ్రవరి 22న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకోగా..2013 మార్చి 5న చికిత్స పొందుతూ మృతిచెందింది.
ఈ విషయంపై లలిత అన్న సూరారపు భాష మునుగోడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రవిపై కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్‌ఐ కె.కొండల్‌రెడ్డి కేసును దర్యాప్తు చేసి అంతిమ నివేదిక సమర్పించారు. వాదప్రతివాదనలు విన్న పిదప న్యాయమూర్తి రవిని శిక్షిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులు ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పీపీ ఏ నరేందర్‌రావు వాదించగా, ప్రాçసిక్యూషన్‌కు లైజన్ అధికారులు కె.బీమ్‌రెడ్డి, ఎం.రత్నం, కోర్టు పీసీ దాసోజు శ్రవణ్‌కుమార్ సహకరించారు.
అక్కా చెల్లెల్లకు ఏడాది జైలు
నిడమనూరు : తల్లి ఉద్యోగాన్ని పొందాలనే ఆశతో సర్టిఫికెట్లలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఇద్దరు అక్కా చెల్లెళ్లకు నిడమనూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి రాదాకృష్ణమూర్తి మంగళవారం సంవత్సరం జైలు శిక్ష , 5వేలు జరిమానా విధించా రు. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీకి చెందిన చిరుగూరి మరియమ్మ పర్యాటక శాఖలో స్కావెంజర్‌గా పని చేస్తూ 2009ఏప్రిల్1న మృతిచెందింది. ఆమె ఉద్యోగాన్ని పొందడానికి ఇద్దరు కుమార్తెలు గురువమ్మ, ఎలిషమ్మలు తప్పుడు లీగల్ ఎయిడ్ పత్రాన్ని పర్యాటక శాఖకు ఇచ్చారు. అంతకు ముందే వారిద్దరికీ వివాహం కాగా కాలేదని తప్పుడు సమాచారాన్ని అందులో పొందుపర్చారు.
మారీడ్ అన్నదానికి ముందు అన్ అనే పదాన్ని తగిలించారు. దానిని గమనించిన పర్యాటక శాఖ అధికారులు పైలాన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్‌ఐ జగన్నాదం కేసు నమోదు చేశారు. మంగళవారం నిడమనూరులో కేసు తుది విచారణ జరగ్గా అక్కా చెళ్లెలు మరియమ్మ, ఎలిషమ్మలకు తలా సంవత్సరం జైలు శిక్ష, తలా 5వేల రూపాయల జరిమానా విధిస్తూ జడ్జి రాధాకృష్ణమూర్తి తీర్వు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ మహాలక్ష్మి కేసు వాదించారు.