భీమడోలు: జీవించినంత కాలం ఒకరికి ఒకరు తోడునీడగా బతికిన వారు చనిపోయినపుడూ ఒకటిగానే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలోని మేజర్ పంచాయతీ గుండుగొలనులోని ఓ దళితవాడలో శనివారం రాత్రి ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెయ్యల లాజర్(98), సుగుణమ్మ(87)లు దంపతులు. వారికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండు నెలలుగా లాజర్ అనారోగ్యంతో మంచం పట్టాడు. అతనికి అన్నీ తానే అయి సుగుణమ్మ సపర్యలు చేస్తోంది. భర్తను చంటి బిడ్డలా చూసుకుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి లాజర్ ఉలుకుపలుకూ లేకుండా జీవచ్ఛవంలా ఉండిపోయాడు. ఆందోళనతో వైద్యుడిని పిలిపించగా లాజర్ చనిపోయాడని నిర్ధారించారు. భర్త మరణవార్త విని ఆమె తట్టుకోలేకపోయింది. కొద్దిసేపటికే గుండెపోటుతో మృతిచెందింది. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ వృద్ధుల భౌతికకాయాలను సందర్శించేందుకు వాడ అంతా తరలివచ్చింది. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment