gundugolanu
-
మరణంలోనూ ఒకరికి ఒకరై..
భీమడోలు: జీవించినంత కాలం ఒకరికి ఒకరు తోడునీడగా బతికిన వారు చనిపోయినపుడూ ఒకటిగానే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలోని మేజర్ పంచాయతీ గుండుగొలనులోని ఓ దళితవాడలో శనివారం రాత్రి ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెయ్యల లాజర్(98), సుగుణమ్మ(87)లు దంపతులు. వారికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండు నెలలుగా లాజర్ అనారోగ్యంతో మంచం పట్టాడు. అతనికి అన్నీ తానే అయి సుగుణమ్మ సపర్యలు చేస్తోంది. భర్తను చంటి బిడ్డలా చూసుకుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి లాజర్ ఉలుకుపలుకూ లేకుండా జీవచ్ఛవంలా ఉండిపోయాడు. ఆందోళనతో వైద్యుడిని పిలిపించగా లాజర్ చనిపోయాడని నిర్ధారించారు. భర్త మరణవార్త విని ఆమె తట్టుకోలేకపోయింది. కొద్దిసేపటికే గుండెపోటుతో మృతిచెందింది. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ వృద్ధుల భౌతికకాయాలను సందర్శించేందుకు వాడ అంతా తరలివచ్చింది. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
గుండుగొలను భ్రమరాంబ అమ్మవారికి సారె
పిఠాపురం : పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలనులో కొలువుదీరిన భ్రమరాంబ అమ్మవారికి పిఠాపురం పాదగయ క్షేత్రంలో వేంచేసియున్న పురూహూతికా అమ్మవారి సారె సమర్పించినట్టు ఆలయ ఈఓ చందక దారబాబు తెలిపారు. గుండుగొలను భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో ఐదు రోజులుగా జరుగుతున్న కోటి కుంకుమార్చనకు అమ్మవారి శక్తి పీఠాల నుంచి సారెలు పంపుతుండగా, ఐదో రోజు ఇక్కడి నుంచి సారె సమర్పించినట్టు చెప్పారు. దేవస్థానం తరపున పసుపు, కుంకుమ చీరలను భ్రమరాంభ అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు చేయించినట్టు ఆయన తెలిపారు. -
గుండుగొలను వద్ద వాహనాల నిలిపివేత
భీమడోలు : జాతీయ, రాషీ్ట్రయ రహదారి జంక్షన్ గుండుగొలను వద్ద వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఆదివారం సెలవురోజు కావడంతో విజయవాడ వైపుగా వేల సంఖ్యలో వాహనాలు తరలివెళ్లాయి. దీంతో హనుమాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుండుగొలను నుంచి విజయవాడ వైపుగా వెళ్లే భారీ వాహనాలు, లారీలను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిలిపివేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను నారాయణపురం మీదుగా మళ్లించారు.