స్వదేశీ దిక్సూచి 'నావిక్' | the seventh and final navigation satellite NAVIC launched | Sakshi
Sakshi News home page

స్వదేశీ దిక్సూచి 'నావిక్'

Published Fri, Apr 29 2016 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

స్వదేశీ దిక్సూచి 'నావిక్'

స్వదేశీ దిక్సూచి 'నావిక్'

రెండు నెలల్లో మన జీపీఎస్ అందుబాటులోకి..
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థలో ఏడో ప్రయోగం సక్సెస్
పీఎస్‌ఎల్‌వీ-సీ33 ప్రయోగం విజయవంతం
గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రయోగం
20 నిమిషాల 19 సెకన్లలో ప్రయోగం పూర్తి
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహాన్ని భూస్థిర బదిలీ కక్ష్యలోకి చేర్చిన పీఎస్‌ఎల్వీ

 
శ్రీహరికోట (సూళ్లూరుపేట): ప్రపంచ యవనికపై భారత్ మరో కీర్తి పతాకను ఎగురవేసింది.. అతికొద్ది సంపన్న దేశాలకే పరిమితమైన సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటును దాదాపు పూర్తిచేసుకుంది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్)లో చివరిదైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహాన్ని కదనాశ్వం పీఎస్‌ఎల్వీ-సీ33 ద్వారా గురువారం విజయవంతంగా ప్రయోగించింది. వరుస విజయాలతో వినువీధిలో భారత కీర్తిపతాకను
 
 
రెపరెపలాడిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం నిర్వహించింది. ఈ ప్రయోగంతో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌లోని చివరిదైన ఏడో ఉపగ్రహం అంతరిక్షంలోకి చేరింది. దీంతో మరో రెండు నెలల్లోనే పూర్తిస్థాయిలో మన ‘జీపీఎస్’ అందుబాటులోకి రానుంది. సెల్‌ఫోన్లు ఇతర పరికరాల ద్వారా నావిగేషన్ సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు వైమానిక, నౌకాయాన రంగాలకు, రక్షణ, పౌర సేవలకూ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎంతో ఊతమివ్వనుంది. ఇస్రో శాస్త్రవేత్తలు వినువీధిలో భారత కీర్తి ప్రతిష్టలను ఎగురవేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఐఎన్‌ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థను జాతికి అంకితం చేస్తున్నట్లు ఢిల్లీలో ప్రకటించారు.

ఉత్కంఠగా కౌంట్‌డౌన్..
పీఎస్‌ఎల్వీ-సీ33 ప్రయోగానికి మంగళవారం ఉదయం 9.20 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 51 గంటల 30 నిమిషాలపాటు నిర్విఘ్నంగా కొనసాగిన కౌంట్‌డౌన్ ముగిశాక... గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రయోగం మొదలైంది. 44.4 మీటర్ల పొడవైన పీఎస్‌ఎల్వీ-సీ33 దాదాపు 320 టన్నుల బరువుతో నిప్పులు కక్కుతూ నింగికి ప్రయాణాన్ని ప్రారంభించింది. రాకెట్ నాలుగు దశలూ విజయవంతంగా పూర్తయి... 20 నిమిషాల 19 సెకన్లకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ దిగ్విజయంగా భూస్థిర బదిలీ కక్ష్య (జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టింది. దీంతో మిషన్ కంట్రోల్ రూంలో శాస్త్రవేత్తల కరతాళ ధ్వనులు మిన్నంటాయి.

శాస్త్రవేత్తలంతా ఒకరినొకరు అభినందించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఇక ఉపగ్రహాన్ని కర్ణాటకలోని హాసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్  శాస్త్రవేత్తలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాని పనితీరును పరీక్షించి.. అంతా సవ్యంగా ఉందని ప్రకటించారు. ఉపగ్రహంలో ఉన్న 827 కిలోల ద్రవ ఇంధనాన్ని దశల వారీగా మండించి... భూస్థిర బదిలీ కక్ష్య నుంచి భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో సింక్రొనస్ ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి ప్రవేశపెడతారు. ఇందుకు దాదాపు వారం రోజులు సమయం పట్టే అవకాశముంది.
 
జూన్ నాటికి నావిగేషన్ వ్యవస్థ: ఇస్రో చైర్మన్

ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ మాట్లాడారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థలో చివరిదైన ఏడో ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. దీనితోపాటు ఈ వ్యవస్థకు చెందిన ఉపగ్రహాలన్నింటినీ పీఎస్‌ఎల్వీ రాకెట్ల ద్వారానే ప్రయోగించామన్నారు. ఏడు ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరిన వెంటనే జూన్ నాటికి సొంత నావిగేషన్ వ్యవస్థను మన దేశానికి అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా అభినందించారు.

ప్రయోగం జరిగిందిలా..
44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ-సీ33 రాకెట్‌ను ఆరు ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. ప్రయోగ సమయంలో ఉపగ్రహం సహా రాకెట్ మొత్తం బరువు సుమారు 320 టన్నులు. ఇంత బరువును మోసుకెళ్లేందుకు తొలి దశలోని స్ట్రాపాన్ బూస్టర్లలో 73.2 టన్నుల ఘన ఇంధనాన్ని, కోర్ అలోన్ దశలో మరో 138.2 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించారు. రెండో దశలో 42 టన్నుల ద్రవ ఇంధనం, మూడో దశలో 7.6 టన్నుల ఘన ఇంధనం, నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగించారు. తొలిదశ 110 సెకన్లలో, రెండో దశ 262 సెకన్లలో, మూడో దశ 663 సెకన్లలో, నాలుగో దశ 1,182 సెకన్లలో పూర్తయింది.

మొత్తంగా 20 నిమిషాల 19 సెకన్లకు 1,425 కిలోల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పెరిగీ (భూమికి దగ్గరగా) 286 కిలోమీటర్లు, అపోగీ (భూమికి దూరంగా) 20,657 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార భూస్థిర బదిలీ కక్ష్య (జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్)లో 17.82 డిగ్రీల వాలులో ఉపగ్రహం ప్రయాణం ప్రారంభించింది. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఈ ప్రయోగం 35వది. ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో 13వ ప్రయోగం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement