జాబుకు.. జీపీఎస్..! | Mail box 'Satellite' integration | Sakshi
Sakshi News home page

జాబుకు.. జీపీఎస్..!

Published Tue, Jul 22 2014 1:14 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

జాబుకు.. జీపీఎస్..! - Sakshi

జాబుకు.. జీపీఎస్..!

ఉత్తరాల బాక్స్‌కు ‘ఉపగ్రహంతో’ అనుసంధానం
ప్రతి పోస్టల్ బాక్స్‌కు ఓ బార్‌కోడింగ్
దేశంలోనే తొలి ప్రయత్నం
ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో ఏర్పాటు
ప్రజల్లో ఉత్తరం పట్ల భరోసా, ఆసక్తి పెంచే యోచన

 
 స్మార్ట్‌ఫోన్.. చేతిలో ఉంటే మహానగరాల్లో సైతం రూటుకోసం వెతుక్కోనక్కర లేదు.జస్ట్ జీపీఎస్ ఆన్‌చేసి వెళ్లే ప్రాంతం నమోదు చేస్తే నావిగేషన్ కీ మిమ్మల్ని నమ్మకంగా తీసుకెళ్తుంది. ఇదే విధానాన్ని మీకు ఆత్మీయంగానో, అవసరమైన సమాచారంతోనో వచ్చే జాబులకూ జతచేయనున్నారు పోస్టల్ శాఖవారు. తన వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు తపాలా డబ్బాలోని సమాచారాన్ని పోస్ట్‌మన్ ఫీడ్ చేయగానే అది గమ్యం చేరే వరకూ పోస్టల్ అధికారులు వెంటాడతారన్న మాట. అంటే నిర్దేశిత కాలంలోనే మీ లేఖ మీకు వచ్చితీరుతుందన్న మాట. అది దారి తప్పడం కల్ల అన్నమాట. ఇంకెందుకూ ఆలస్యం మీరూ జాబు రాయండి..జీపీఎస్‌ను నమ్మండి.

 హైదరాబాద్: ఉత్తరం... దాదాపు ప్రజలు మరిచి పోతున్న రోజులివి. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ విప్లవంతో దానికి రోజులు దగ్గరపడ్డాయి. ఈ తీరు ఇలాగే కొనసాగితే మరికొద్దిరోజుల్లో అది కూడా టెలిగ్రామ్ తరహాలో కాలగర్భంలో కలిసిపోవటం ఖాయం.  మళ్లీ ‘లేఖల’పై ప్రజల్లో ఆసక్తి పెంచేందుకు తపాలా శాఖ కొంతకాలంగా వినూత్న చర్యలు చేపడుతోంది. మన ఫొటోతో ఉండే స్టాంపునే ఎంచక్కా మనం రాసిన జాబులపై అతికించి పంపించుకునేలా ‘మైస్టాంప్’ పథకాన్ని తెచ్చింది. ఈ క్రమంలోనే ఉత్తరాల డబ్బా (పోస్టుబాక్సు)లకు జీపీఎస్‌తో అనుసంధానించి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రజల ముందుంచాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరాల బట్వాడా జరుగుతున్న తీరును సమీక్షించటంతోపాటు... అవి ఎప్పటికప్పుడు గమ్యానికి చేరతాయని ప్రజలకు భరోసా ఇవ్వటం దీని ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి పోస్టు బాక్సుల క్లియరెన్సు సరిగా ఉండటం లేదనే అనుమానం ప్రజల్లో ఉంది. దీంతో చాలామంది వీధిలో ఉండే పోస్టుబాక్సుల్లో ఉత్తరాలు, దరఖాస్తు పత్రాలు.. తదితరాలు వేయటం లేదు. వాటిపై నమ్మకం లేక తపాలాకార్యాలయాలకు వెళ్లి నేరుగా సిబ్బందికి అందజేస్తున్నారు. ఈ అంశాన్ని గుర్తించిన తపాలాశాఖ ఏపీ సర్కిల్ చీఫ్‌పోస్టుమాస్టర్ జనరల్ సుధాకర్ దీన్ని తీవ్రంగా పరిగణించి అన్ని పోస్టు బాక్సులను జీపీఎస్‌తో అనుసంధానించాలని నిర్ణయించారు. ఇది దేశంలోనే తొలిప్రయత్నం. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని 775 తపాలా డబ్బాలకు జీపీఎస్‌తో అనుసంధానిస్తారు.

 ప్రతి పెట్టెకూ  బార్ కోడింగ్...

జీపీఎస్‌తో అనుసంధానించే అన్ని తపాలా డబ్బాలకు బార్‌కోడింగ్ కేటాయిస్తున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేక స్మార్ట్‌ఫోన్లలో నిక్షిప్తం చేసి వాటిని తపాలా డబ్బాల్లో ఉత్తరాలు సేకరించే సిబ్బందికి ఇస్తారు. డబ్బా తెరిచి అందులోని బార్‌కోడింగ్ వద్ద స్మార్ట్‌ఫోన్‌ను ఉంచగానే దాని సమాచారం నేరుగా జీపీఓలోని ప్రత్యేక కేంద్రానికి చేరుతుంది. అందులో ఉన్న ఉత్తరాలు, అవి ఏ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది, అవి దరఖాస్తులా, సాధారణ ఉత్తరాలా... అన్న వివరాలను ఆ ఫోన్ ద్వారా పంపిస్తారు. దీన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తారు. ఫలితంగా బట్వాడాలో జాప్యం నివారించే వీలుకలుగుతుంది.

స్పీడ్‌పోస్టు లేఖలు పోస్ట్‌మేన్‌కిస్తే చాలు...

సాధారణంగా పోస్ట్‌మేన్‌లు ఇళ్లకు ఉత్తరాలు తెచ్చిస్తుంటారు. ఇక నుంచి వారు ఉత్తరాలు సేకరించేపనీ మొదలుపెట్టబోతున్నారు. దీన్ని స్పీడ్‌పోస్టు లేఖలతో ప్రారంభిస్తున్నారు. మనం తపాలాకార్యాయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మన వీధిలో కనిపించే పోస్ట్‌మేన్‌కు ఆ లేఖలిస్తేచాలన్నమాట. దాని చార్జీని ఆయనే వసూలు చేసి రశీది స్తాడు. దీన్ని ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నారు. అంతర్గత సాంకేతిక సమాచారం నిక్షిప్తమైఉన్న స్మార్ట్‌ఫోన్‌లను ఆధారం చేసుకుని పోస్ట్‌మేన్‌లు ఈ విధులు నిర్వహించనున్నారు.
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement