navigation satellite
-
జీఎస్ఎల్వీ ప్రయోగం సక్సెస్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): రెండోతరం నావిగేషన్ ఉపగ్రహ సిరీస్‌లో మొదటిదైన ఎన్వీఎస్–01 ఉపగ్రహ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్)లోని రెండో లాంచింగ్ప్యాడ్ వేదికైంది. 27.5 గంటల కౌంట్‌డౌన్ ముగిశాక సోమవారం ఉదయం 10.42 గంటలకు ఎన్వీఎస్–01 ఉపగ్రహాన్ని 51 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువైన జీఎస్ఎల్వీ రాకెట్ భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు (పెరీజి), భూమికి దూరంగా 36,568 కిలోమీటర్లు (అపోజీ) దీర్ఘవృత్తాకార భూ బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. 2,232 కేజీల ఉపగ్రహం అక్కడ స్ధిరంగా ఉన్నట్లు బెంగళూరు దగ్గర్లోని హసన్‌లోని గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ అందాయి. జీఎస్ఎల్వీ వాహకనౌకను వాడటం ఇది 15వ సారి. 2021 ఆగస్టులో ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎఫ్10 అపజయం పాలవడంతో ఆనాటి క్రయోజనిక్ స్థాయి తప్పిదాలను సరిచేసి ఈసారి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో మూడు దశల్లో పెరీజీని పెంచుతూ అపోజీని తగ్గిస్తూ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాన్ని చేరుస్తారు. అమెరికా జీపీఎస్, రష్యా గ్లోనాస్ తరహాలో భారత సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన నావ్ఐసీ(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్– గతంలో భారత క్షేత్రియ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ)ను బలోపేతం చేసే దిశగా ఈ కొత్త తరం ఉపగ్రహాన్ని ఒక పాత ఉపగ్రహం స్థానంలో భర్తీ చేస్తున్నారు. అయితే ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లోని మిషన్ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తలు ఒకరితో ఒకరు ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ మాట్లాడారు. ఇది ఇస్రో సాధించిన సమష్టి విజయమని అన్నారు. భారతదేశ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నావిక్ సిరీస్ ఉపగ్రహాలను ఆరు నెలకొకసారి ప్రయోగిస్తామని తెలిపారు. GSLV-F12/ NVS-O1 Mission is accomplished. After a flight of about 19 minutes, the NVS-O1 satellite was injected precisely into a Geosynchronous Transfer Orbit. Subsequent orbit-raising manoeuvres will take NVS-01 into the intended Geosynchronous orbit. — ISRO (@isro) May 29, 2023 తొలిసారిగా దేశీ అణుగడియారం ఐఆర్ఎన్ఎస్ఎస్ ఇప్పటికే అందుబాటులో ఉంది. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు నావిక్ సిరీస్ కొత్త ఉపగ్రహాలు ఎంతగానో దోహదపడతాయి. గతంలో పంపిన ఉపగ్రహాల్లో ఎస్–బ్యాండ్, కె–బ్యాండ్, కేయూ–బ్యాండ్ లాంటి ఉపకరణాలను అమర్చారు. ఈసారి నావిక్–01 ఉపగ్రహంలో ఎల్–1, ఎల్–5, ఎస్–బ్యాండ్ సిగ్నల్స్ వ్యవస్థను అమర్చారు. ఎల్–1లో పౌరులకు ఉపయోగపడే సివిలియన్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను పరిచయం చేశారు. సమయం, స్థానం అత్యంత ఖచ్చితంగా తెలిపే తొలిసారిగా దేశీయంగా తయారుచేసిన రుబీడియం అణుగడియారాన్ని ఉపగ్రహంలో అమర్చారు. ఆటమిక్ క్లాక్‌ను తయారుచేస్తే సత్తా ప్రపంచంలో చాలా తక్కువదేశాలకే ఉంది. నావిగేషన్ ఉపగ్రహాల వ్యవస్థలో ఇప్పటికే ఏడు ఉపగ్రహాలు నావిగేషన్ వ్యవస్థను అందిస్తున్నారు. ఇందులో నాలుగు ఉపగ్రహాలకు కాలపరిమితి ముగుస్తుండడంతో వాటి స్థానంలో కొత్తవాటిని పంపుతున్నారు. కొత్త ఉపగ్రహాలతో భూ, జల, వాయు మార్గాల్లో పొజిషన్‌ను 20 మీటర్ల అత్యంత ఖచ్చితత్వంతో, 50 నానోసెకన్ల రియల్‌టైమ్‌తో చూపించడం, అత్యవసర సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశా నిర్ధేశం, ఇంటర్నెట్తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఈ ఉపగ్రహ వ్యవస్థ దోహదపడుతుంది. దేశానికి ఆవల సైతం 1,500 కిలోమీటర్లదాకా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. -
భారత్‌కు దిక్సూచి ‘నావిక్’.. జీపీఎస్ కంటే మెరుగైన సేవలు!
అది 1999.. కశ్మీర్‌లోని కార్గిల్ శిఖరాలను ఆక్రమించిన పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలను తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ విజయ్’ను చేపట్టింది. ఉగ్రవాదుల అనుపానులను తెలుసుకోవడానికి అమెరికా నావిగేషన్ వ్యవస్థ ‘గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సహకారాన్ని ప్రభుత్వం కోరింది. అయితే భారత వినతిని అమెరికా తిరస్కరించింది. ఈ ఘటన భారత్ సొంతంగా నావిగేషన్ వ్యవస్థ రూపొందించుకునేందుకు బీజం వేసింది. అదే ‘నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ (నావిక్). 2018 నుంచి దేశంలో రక్షణ, పోలీసు శాఖలు ఉపయోగిస్తున్న ఈ నావిక్ వ్యవస్థ త్వరలోనే దేశ ప్రజలకూ అందుబాటులోకి రానుంది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అవసరం.. ఆధునిక సమాచార, సాంకేతిక యుగంలో నావిగేషన్ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు అమెరికా నావిగేషన్ వ్యవస్థ జీపీఎస్‌పైనే భారత్‌తో సహా పలు దేశాలు ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అయితే యుద్ధాలు, ఉగ్ర దాడులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో అమెరికా తన జీపీఎస్‌ను ఇతర దేశాలకు అందుబాటులో లేకుండా చేస్తోంది. దీంతో సొంత నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఆయా దేశాలకు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూరోపియన్ యూనియన్, రష్యా, చైనా, జపాన్ వంటి దేశాలు సొంతంగా నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఇస్రోను ఆదేశించింది. దీంతో ‘ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు కింద ఇస్రో భారత నావిగేషన్ వ్యవస్థ.. ‘నావిక్’ను రూపొందించే ప్రక్రియను 2006లో ప్రారంభించింది. రూ.1,400 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2012 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనివార్య కారణాలతో 2018 నాటికి ఇది పూర్తయింది. అప్పటి నుంచి కేంద్ర రక్షణ శాఖతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు శాఖలు నావిక్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు, ప్రకృతి విపత్తులు, సహాయ–పునరావాస కార్యక్రమాలు, వాహనాల ట్రాకింగ్ తదితర అవసరాలకు నావిక్‌ను ఉపయోగిస్తున్నారు. ‘జీపీఎస్’ కంటే కచ్చితం.. అమెరికా జీపీఎస్ కంటే నావిక్ మనదేశానికి సంబంధించినంతవరకు మెరుగైన, కచ్చితమైన నావిగేషన్ పరిజ్ఞానాన్ని అందిస్తోందని నిపుణులు చెబుతున్నారు. భూస్థిర కక్ష్యలో 3,600 కి.మీ. ఎత్తులో ఉన్న 8 ఉపగ్రహాలను సమ్మిళితం చేసి ఈ నావిగేషన్ వ్యవస్థను రూపొందించారు. అమెరికా జీపీఎస్‌కు మార్గనిర్దేశం చేస్తున్న ఉపగ్రహాల కంటే నావిక్‌కు అనుసంధానించిన ఉపగ్రహాలు ఎక్కువ ఎత్తులో ఉండటం విశేషం. నావిక్.. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ బాండ్లను ఉపయోగించుకుంటూ పనిచేస్తోంది. దీంతో జీపీఎస్ కంటే మెరుగైన, కచ్చితమైన జియో పొజిషనింగ్‌తో కూడిన సమాచారాన్ని అందిస్తోంది. భారత భూభాగంతోపాటు మన దేశ సరిహద్దుల నుంచి 1,500 కి.మీ. పరిధిలో ప్రాంతానికి సంబంధించిన జియో పొజిషనింగ్ సమాచారాన్ని కూడా కచ్చితంగా అందించే సామర్థ్యం ‘నావిక్’ వ్యవస్థ సొంతం. కాగా అమెరికా, రష్యా, చైనాల నావిగేషన్ వ్యవస్థలు భూమి మీద ఏ ప్రాంతంలోనైనా జియో పొజిషనింగ్ సమాచారాన్ని అందించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అదే రీతిలో భూగోళమంతా నావిగేషన్ సమాచారాన్ని అందించే సామర్థ్యానికి నావిక్‌ను తీర్చిదిద్దే పనిలో ఇస్రో ఉంది. మరికొంత సమయం కావాలంటున్న కంపెనీలు.. ప్రస్తుతం ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న నావిక్‌ను దేశ ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. 2023 జనవరి నుంచి భారత్‌లో విక్రయించే మొబైల్ ఫోన్లలో నావిక్ పరిజ్ఞానాన్ని పొందుపరచాలని మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు యాపిల్, శాంసంగ్, షావోమీ మొదలైనవాటికి గత నెలలో స్పష్టం చేసింది. అయితే నావిక్ పరిజ్ఞానాన్ని పొందుపరిచేందుకు తమ మొబైల్ ఫోన్ల హార్డ్‌వేర్‌లో మార్పులు చేయాల్సి ఉన్నందున మరికొంత సమయం కావాలని కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 2023లో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాల్సిన మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించినందున ఈ మేరకు గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశాయి. అమెరికా జీపీఎస్‌ను అందిస్తున్న ఎల్1 ఉపగ్రహం ఫ్రీక్వెన్సీలోనే ‘నావిక్’ను కూడా అందించాలని కొన్ని కంపెనీలు ప్రతిపాదించాయి. ఇలా అయితే జీపీఎస్, నావిక్ రెండింటిని అందించే రీతిలో మొబైల్ ఫోన్లను రూపొందించొచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ఇస్రో తిరస్కరించింది. తాము సొంతంగా ఎల్5 ఉపగ్రహం ఫ్రీక్వెన్సీలోనే నావిక్‌ను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. ఈ విషయంలో మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. కాగా దేశంలో విక్రయించే మొబైల్ ఫోన్లలో ఎప్పటి నుంచి నావిక్ అందుబాటులోకి రానుందనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది. -
విజయవంతంగా నింగిలోకి..
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ నేవిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి గురువారం తెల్లవారుజామున 4.04 గంటలకు పీఎస్ఎల్వీ–సీ41 వాహకనౌక ద్వారా 1425 కేజీలున్న ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అమెరికాకు చెందిన జీపీఎస్, రష్యాకు చెందిన గ్లోనాస్, యూరప్‌కు చెందిన గెలీలియో తరహాలో భారత్‌లో పౌర, సైనిక అవసరాలకు నావిక్(దీన్ని ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్గానూ వ్యవహరిస్తున్నారు) అనే దేశీయ దిక్సూచీ వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా ఏడు ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. నావిక్ దిక్సూచీ వ్యవస్థ పనిచేయాలంటే కనీసం ఏడు ఉపగ్రహాలు అవసరమవుతాయి. అయితే ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ ఉపగ్రహంలోని రుబీడియమ్ అణు గడియారాలు పనిచేయకపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా గతేడాది ఆగస్టులో ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్‌ను ఇస్రో ప్రయోగించింది. కానీ ఆ ఉపగ్రహానికున్న షీట్షీల్డ్ తెరుచుకోకపోవడంతో ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇస్రో తాజాగా ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని భూ బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ప్రయోగం అనంతరం హసన్‌లోని మాస్టర్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు ఉపగ్రహం నియంత్రణను తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం 284 కి.మీ పెరిజీ(భూమికి దగ్గరగా), 20,650 కి.మీ అపోజీ(భూమికి దూరంగా) ఎత్తులో భూబదిలీ కక్ష్యలో ఉన్న ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహంలోని ఇంధనాన్ని దశలవారీగా మండించి 36,000 కి.మీ ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు. పదేళ్ల పాటు సేవలు బెంగళూరుకు చెందిన ప్రైవేటు సంస్థ ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, ఇస్రోలు సంయుక్తంగా ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని నిర్మించాయి. ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. ఇస్రో అభివృద్ధి చేసిన నావిక్ దిక్సూచీ వ్యవస్థ సాయంతో దేశమంతటా వాహనాలు, నౌకలు, విమానాలకు దిశానిర్దేశం చేయవచ్చు. అంతేకాకుండా ఈ వ్యవస్థను సైనిక అవసరాలకూ వాడుకోవచ్చు. ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్, 1ఐ ఉపగ్రహాలను ఇస్రో ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు సంస్థతో కలసి నిర్మించింది. ఇస్రో ఇప్పటివరకూ 43 సార్లు పీఎస్ఎల్వీ వాహకనౌకలను ప్రయోగించగా.. అందులో 41 సార్లు విజయం సాధించింది. శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. నావిక్ దిక్సూచీ వ్యవస్థతో దేశంలోని సామాన్యులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. నావిక్ వ్యవస్థతో సరికొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయని ఇస్రో చైర్మన్ కె.శివన్ మీడియాకు తెలిపారు. దీనివల్ల దేశవ్యాప్తంగా తీరప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. త్వరలోనే నావిక్ ఆధారిత యాప్‌లను విడుదల చేస్తామనీ, దీన్ని పరిశ్రమలు, విద్యాసంస్థలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ ఏడాది ఇస్రో చరిత్రలోనే అత్యంత భారీ ఉపగ్రహమైన జీశాట్–11 (5,725 కేజీలు)ను ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రధానంగా భారీ ప్రయోగాలపైనే దృష్టి సారించినట్లు శివన్ చెప్పారు. రాకెట్ బరువు : 321 టన్నులు ఎత్తు : 44.4 మీటర్లు దశలు : 4 (ఘన, ద్రవ) ఉపగ్రహంబరువు : 1,425 కేజీలు పరిమాణం : 1.58 మీటర్లు గీ 1.5 మీటర్లు గీ 1.5 మీటర్లు సామర్థ్యం : 1,670 వాట్లు -
పిఎస్ఎల్వీ సీ-41 రాకెట్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్
-
ఇస్రోకు ‘వంద’నం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక విజయం నమోదైంది. ఇస్రో తన వందో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వేదికగా 28 గంటల కౌంట్‌డౌన్ తర్వాత శుక్రవారం ఈ ప్రయోగం జరిగింది. నాలుగు ప్రయోగ దశల్లో మండిన పీఎస్ఎల్వీ సీ–40 వాహకనౌక కార్టోశాట్–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు 30 మైక్రో, నానో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి చేర్చింది. దీంతో అంతరిక్ష రంగంలో, వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాల్లో ఇస్రో తన సమర్ధతను మరోసారి చాటుకున్నట్లయింది. పీఎస్ఎల్వీ రాకెట్‌తో చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రయోగం ఇదే. ప్రయోగం విజయవంతమైనందుకు రాష్ట్రపతి కోవింద్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మైలురాయిగా 100వ ఉపగ్రహం... నాలుగు నెలల క్రితం నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ ప్రయోగ సందర్భంగా ఎదురైన వైఫల్యాన్ని పక్కనపెట్టి ఇస్రో తాజా విజయాన్ని అందుకుంది. ఈసారి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల్లో దేశీయంగా రూపొందించిన వందో ఉపగ్రహం ఉండటం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ–40 31 ఉపగ్రహాలతో నింగికెగిసింది. 17 నిమిషాల్లోనే కార్టోశాట్ ఉపగ్రహాన్ని 505 కి.మీ ఎత్తులోని సూర్యానువర్తిత ధృవకక్ష్యలో చేర్చింది. తర్వాత ఏడు నిమిషాల వ్యవధిలో భారత్‌కు చెందిన ఒక నానో ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 28 పేలోడ్లను ఒకదాని తర్వాత మరోదాన్ని కక్ష్యల్లో విడిచిపెట్టింది. మిగిలిన ఏకైక(వందో ఉపగ్రహం) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చడానికి కొంత సమయం పట్టింది. ఇందుకోసం ప్రయోగం ప్రారంభమైన సుమారు 105 నిమిషాల తరువాత రాకెట్ నాలుగో దహన దశను రెండుసార్లు పునఃప్రారంభించారు. చివరి దశను పూర్తిచేయడానికి సుమారు 2 గంటల 21 నిమిషాలు పట్టింది. అత్యంత ఎక్కువ సమయం తీసుకున్న పీఎస్ఎల్వీ మిషన్ ఇదే. ఇస్రో చైర్మన్‌గా చివరి ప్రయోగాన్ని విజయవంతంగా ముగించిన కిరణ్ కుమార్ సహచరులతో కలసి సంతోషం పంచుకున్నారు. కార్టోశాట్–2 వెంట ప్రయాణించిన ఉపగ్రహాల్లో కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కొరియా, యూకే, అమెరికాలకు చెందిన మూడు మైక్రో, 25 నానో ఉపగ్రహాలున్నాయి. కొత్త ఏడాది కానుక ఇదే: ఇస్రో చైర్మన్ ప్రయోగం పూర్తయిన తరువాత ఇస్రో చైర్మన్ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ...ఇస్రో కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించిందని అన్నారు. కార్టోశాట్ ఉపగ్రహాన్ని దేశానికి కానుకగా ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాము ప్రయోగించిన 100 ఉపగ్రహాల్లో విద్యార్థులు తయారుచేసిన వాటన్నింటికీ చోటిచ్చామని తెలిపారు. చంద్రుడిపై అధ్యయనం కోసం చేపట్టబోయే రెండో ప్రయోగం చంద్రయాన్–2 మిషన్‌కు ఏర్పాట్లు సజావుగానే జరుగుతున్నాయని వెల్లడించారు. ఫ్లైట్ మోడల్స్‌ను వివిధ దశల్లో పరీక్షిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నుంచి నెలకో ప్రయోగం చొప్పున జరిపేందుకు సన్నద్ధమవుతున్నామని వెల్లడించారు. తాజా ప్రయోగానికి ఎంత వ్యయమైందని ఓ విలేకరి అడగ్గా... ఖర్చు కన్నా మన రాకెట్ల సాయంతో వాణిజ్యపరంగా ఉపగ్రహాలను పంపించేందుకు ఎన్ని దేశాలు ముందుకొస్తున్నాయన్నదే ముఖ్యమని చెప్పారు. జీఎస్ఎల్వీ ఎంకే2, ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ప్రయోగాలు త్వరలో జరుగుతాయని తెలిపారు. బంగారు భవితకు సూచిక: మోదీ ఇస్రో వందో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం సంస్థ విజయాలు, అంతరిక్ష రంగంలో దేశ బంగారు భవిష్యత్‌కు సూచిక అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ...తాజా విజయంతో ప్రజలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇస్రో కృషిని అభినందించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: పీఎస్ఎల్వీ–సీ 40 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభినందించారు. మన శాస్త్రవేత్తల కృషి మరవలేనిదని, ఇది మన దేశానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. ఇస్రోకు జగన్ శుభాకాంక్షలు... సాక్షి, హైదరాబాద్: ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో భవిష్యత్‌లో మరిన్ని అద్భుత ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
పీఎస్ఎల్వీ సీ33 కౌంట్ డౌన్ ప్రారంభం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ33 ఉపగ్రహం ప్రయోగానికి కౌంట్ డౌన్ మంగళవారం ఉదయం 9.20గంటలకు ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా ఇండిపెండెంట్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిరీస్‌లో ఆఖరి ఉపగ్రహమైన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1జీ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ప్రయోగం సఫలమైతే రెండు నెలల్లోనే భారత్‌కు పూర్తి స్వదేశీ నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. జూన్‌లో పీఎస్ఎల్వీ సీ34 ప్రయోగం.. పీఎస్ఎల్వీ సీ34 ప్రయోగాన్ని వాస్తవంగా మే నెలాఖరులో చేపట్టేందుకు ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగం జూన్ మొదటి వారానికి వాయిదావేయాలని ఎఆర్ఆర్ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రయోగంలో సరికొత్తగా 22 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కాసేపట్లో పీఎస్ఎల్వీ-సీ 27 ప్రయోగం