నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్‌ఎల్వీ సీ–40 రాకెట్, మీడియా సమావేశంలో రాకెట్, ఉపగ్రహ నమూనాలను చూపిస్తున్న కిరణ్. చిత్రంలో శివన్ తదితరులు
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక విజయం నమోదైంది. ఇస్రో తన వందో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వేదికగా 28 గంటల కౌంట్‌డౌన్ తర్వాత శుక్రవారం ఈ ప్రయోగం జరిగింది. నాలుగు ప్రయోగ దశల్లో మండిన పీఎస్‌ఎల్వీ సీ–40 వాహకనౌక కార్టోశాట్–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు 30 మైక్రో, నానో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి చేర్చింది. దీంతో అంతరిక్ష రంగంలో, వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాల్లో ఇస్రో తన సమర్ధతను మరోసారి చాటుకున్నట్లయింది. పీఎస్‌ఎల్వీ రాకెట్‌తో చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రయోగం ఇదే. ప్రయోగం విజయవంతమైనందుకు రాష్ట్రపతి కోవింద్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
మైలురాయిగా 100వ ఉపగ్రహం...
నాలుగు నెలల క్రితం నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1హెచ్ ప్రయోగ సందర్భంగా ఎదురైన వైఫల్యాన్ని పక్కనపెట్టి ఇస్రో తాజా విజయాన్ని అందుకుంది. ఈసారి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల్లో దేశీయంగా రూపొందించిన వందో ఉపగ్రహం ఉండటం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ–40 31 ఉపగ్రహాలతో నింగికెగిసింది. 17 నిమిషాల్లోనే కార్టోశాట్ ఉపగ్రహాన్ని 505 కి.మీ ఎత్తులోని సూర్యానువర్తిత ధృవకక్ష్యలో చేర్చింది. తర్వాత ఏడు నిమిషాల వ్యవధిలో భారత్‌కు చెందిన ఒక నానో ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 28 పేలోడ్‌లను ఒకదాని తర్వాత మరోదాన్ని కక్ష్యల్లో విడిచిపెట్టింది.
మిగిలిన ఏకైక(వందో ఉపగ్రహం) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చడానికి కొంత సమయం పట్టింది. ఇందుకోసం ప్రయోగం ప్రారంభమైన సుమారు 105 నిమిషాల తరువాత రాకెట్ నాలుగో దహన దశను రెండుసార్లు పునఃప్రారంభించారు. చివరి దశను పూర్తిచేయడానికి సుమారు 2 గంటల 21 నిమిషాలు పట్టింది. అత్యంత ఎక్కువ సమయం తీసుకున్న పీఎస్‌ఎల్వీ మిషన్ ఇదే. ఇస్రో చైర్మన్‌గా చివరి ప్రయోగాన్ని విజయవంతంగా ముగించిన కిరణ్ కుమార్ సహచరులతో కలసి సంతోషం పంచుకున్నారు. కార్టోశాట్–2 వెంట ప్రయాణించిన ఉపగ్రహాల్లో కెనడా, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, కొరియా, యూకే, అమెరికాలకు చెందిన మూడు మైక్రో, 25 నానో ఉపగ్రహాలున్నాయి.
కొత్త ఏడాది కానుక ఇదే: ఇస్రో చైర్మన్
ప్రయోగం పూర్తయిన తరువాత ఇస్రో చైర్మన్ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ...ఇస్రో కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించిందని అన్నారు. కార్టోశాట్ ఉపగ్రహాన్ని దేశానికి కానుకగా ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాము ప్రయోగించిన 100 ఉపగ్రహాల్లో విద్యార్థులు తయారుచేసిన వాటన్నింటికీ చోటిచ్చామని తెలిపారు. చంద్రుడిపై అధ్యయనం కోసం చేపట్టబోయే రెండో ప్రయోగం చంద్రయాన్–2 మిషన్‌కు ఏర్పాట్లు సజావుగానే జరుగుతున్నాయని వెల్లడించారు.
ఫ్లైట్ మోడల్స్‌ను వివిధ దశల్లో పరీక్షిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నుంచి నెలకో ప్రయోగం చొప్పున జరిపేందుకు సన్నద్ధమవుతున్నామని వెల్లడించారు. తాజా ప్రయోగానికి ఎంత వ్యయమైందని ఓ విలేకరి అడగ్గా... ఖర్చు కన్నా మన రాకెట్ల సాయంతో వాణిజ్యపరంగా ఉపగ్రహాలను పంపించేందుకు ఎన్ని దేశాలు ముందుకొస్తున్నాయన్నదే ముఖ్యమని చెప్పారు. జీఎస్‌ఎల్వీ ఎంకే2, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1ఐ ప్రయోగాలు త్వరలో జరుగుతాయని తెలిపారు.
బంగారు భవితకు సూచిక: మోదీ
ఇస్రో వందో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం సంస్థ విజయాలు, అంతరిక్ష రంగంలో దేశ బంగారు భవిష్యత్‌కు సూచిక అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ...తాజా విజయంతో ప్రజలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
ఇస్రో కృషిని అభినందించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పీఎస్‌ఎల్‌వీ–సీ 40 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభినందించారు. మన శాస్త్రవేత్తల కృషి మరవలేనిదని, ఇది మన దేశానికి గర్వకారణమని ఆయన కొనియాడారు.
ఇస్రోకు జగన్ శుభాకాంక్షలు...
సాక్షి, హైదరాబాద్: ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో భవిష్యత్‌లో మరిన్ని అద్భుత ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment