PSLV-C40
-
ఇస్రోకు ‘వంద’నం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక విజయం నమోదైంది. ఇస్రో తన వందో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వేదికగా 28 గంటల కౌంట్‌డౌన్ తర్వాత శుక్రవారం ఈ ప్రయోగం జరిగింది. నాలుగు ప్రయోగ దశల్లో మండిన పీఎస్ఎల్వీ సీ–40 వాహకనౌక కార్టోశాట్–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు 30 మైక్రో, నానో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి చేర్చింది. దీంతో అంతరిక్ష రంగంలో, వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాల్లో ఇస్రో తన సమర్ధతను మరోసారి చాటుకున్నట్లయింది. పీఎస్ఎల్వీ రాకెట్‌తో చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రయోగం ఇదే. ప్రయోగం విజయవంతమైనందుకు రాష్ట్రపతి కోవింద్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మైలురాయిగా 100వ ఉపగ్రహం... నాలుగు నెలల క్రితం నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ ప్రయోగ సందర్భంగా ఎదురైన వైఫల్యాన్ని పక్కనపెట్టి ఇస్రో తాజా విజయాన్ని అందుకుంది. ఈసారి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల్లో దేశీయంగా రూపొందించిన వందో ఉపగ్రహం ఉండటం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ–40 31 ఉపగ్రహాలతో నింగికెగిసింది. 17 నిమిషాల్లోనే కార్టోశాట్ ఉపగ్రహాన్ని 505 కి.మీ ఎత్తులోని సూర్యానువర్తిత ధృవకక్ష్యలో చేర్చింది. తర్వాత ఏడు నిమిషాల వ్యవధిలో భారత్‌కు చెందిన ఒక నానో ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 28 పేలోడ్లను ఒకదాని తర్వాత మరోదాన్ని కక్ష్యల్లో విడిచిపెట్టింది. మిగిలిన ఏకైక(వందో ఉపగ్రహం) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చడానికి కొంత సమయం పట్టింది. ఇందుకోసం ప్రయోగం ప్రారంభమైన సుమారు 105 నిమిషాల తరువాత రాకెట్ నాలుగో దహన దశను రెండుసార్లు పునఃప్రారంభించారు. చివరి దశను పూర్తిచేయడానికి సుమారు 2 గంటల 21 నిమిషాలు పట్టింది. అత్యంత ఎక్కువ సమయం తీసుకున్న పీఎస్ఎల్వీ మిషన్ ఇదే. ఇస్రో చైర్మన్‌గా చివరి ప్రయోగాన్ని విజయవంతంగా ముగించిన కిరణ్ కుమార్ సహచరులతో కలసి సంతోషం పంచుకున్నారు. కార్టోశాట్–2 వెంట ప్రయాణించిన ఉపగ్రహాల్లో కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కొరియా, యూకే, అమెరికాలకు చెందిన మూడు మైక్రో, 25 నానో ఉపగ్రహాలున్నాయి. కొత్త ఏడాది కానుక ఇదే: ఇస్రో చైర్మన్ ప్రయోగం పూర్తయిన తరువాత ఇస్రో చైర్మన్ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ...ఇస్రో కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించిందని అన్నారు. కార్టోశాట్ ఉపగ్రహాన్ని దేశానికి కానుకగా ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాము ప్రయోగించిన 100 ఉపగ్రహాల్లో విద్యార్థులు తయారుచేసిన వాటన్నింటికీ చోటిచ్చామని తెలిపారు. చంద్రుడిపై అధ్యయనం కోసం చేపట్టబోయే రెండో ప్రయోగం చంద్రయాన్–2 మిషన్‌కు ఏర్పాట్లు సజావుగానే జరుగుతున్నాయని వెల్లడించారు. ఫ్లైట్ మోడల్స్‌ను వివిధ దశల్లో పరీక్షిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నుంచి నెలకో ప్రయోగం చొప్పున జరిపేందుకు సన్నద్ధమవుతున్నామని వెల్లడించారు. తాజా ప్రయోగానికి ఎంత వ్యయమైందని ఓ విలేకరి అడగ్గా... ఖర్చు కన్నా మన రాకెట్ల సాయంతో వాణిజ్యపరంగా ఉపగ్రహాలను పంపించేందుకు ఎన్ని దేశాలు ముందుకొస్తున్నాయన్నదే ముఖ్యమని చెప్పారు. జీఎస్ఎల్వీ ఎంకే2, ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ప్రయోగాలు త్వరలో జరుగుతాయని తెలిపారు. బంగారు భవితకు సూచిక: మోదీ ఇస్రో వందో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం సంస్థ విజయాలు, అంతరిక్ష రంగంలో దేశ బంగారు భవిష్యత్‌కు సూచిక అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ...తాజా విజయంతో ప్రజలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇస్రో కృషిని అభినందించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: పీఎస్ఎల్వీ–సీ 40 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభినందించారు. మన శాస్త్రవేత్తల కృషి మరవలేనిదని, ఇది మన దేశానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. ఇస్రోకు జగన్ శుభాకాంక్షలు... సాక్షి, హైదరాబాద్: ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో భవిష్యత్‌లో మరిన్ని అద్భుత ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
బుద్ధి చూపించిన పాక్.. 'ఇస్రో'పై అక్కసు
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్ మరోసారి తన బుద్ధి చూపించుకుంది. భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో నిర్వహించిన వందో ప్రయోగంపై అక్కసును వెళ్లగక్కింది. ఇలాంటి ప్రయోగాలతో దేశాల మధ్య ప్రాంతీయ వ్యూహాత్మక స్థిరత్వం దెబ్బతింటుందంటూ వ్యాక్యానించింది. ఈ ప్రయోగం వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. పాక్ విదేశాంగ వ్యవహారాలశాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మహ్మద్ ఫైజల్ మీడియాతో మాట్లాడుతూ.. 'మాకు అందిన సమాచారం ప్రకారం భూభాగాన్ని పర్యవేక్షించే కార్టోశాట్ ఉప్రగ్రహంతోపాటు మొత్తం 31 ఉపగ్రహాలు జనవరి 12న(శుక్రవారం) ప్రయోగిస్తుందని తెలిసింది. అన్ని ఉపగ్రహాలు కూడా రెండు రకాల సేవలు అందిచేవని అర్థమవుతోంది. పౌరసమాజానికి సేవలందించడంతోపాటు సైనికులకు కూడా అవి సహాయపడేలా వాటిని భారత్ రూపొందించింది. ఇలా చేస్తే వ్యూహాత్మక భాగస్వామ్యం తన నిలకడను కోల్పోతుంది. ద్వైపాక్షిక సంబంధాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. అంతరిక్ష శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని శాంతియుత వాతవరణం దెబ్బతినకుండా ప్రయోగాలు చేసుకునేందుకు అన్ని దేశాలకు అవకాశం ఉంది. కానీ ఒక దేశ మిలిటరి నిలకడను దెబ్బతీసేట్లుగా చర్యలు ఉండరాదు' అని అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒకేసారి 30 చిన్న ఉపగ్రహాలతోపాటు తన 100వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించిన విషయం తెలిసిందే. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్ఎల్వీ సీ–40 వాహక నౌక ద్వారా కార్టోశాట్–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి మోసుకెళ్లింది. అన్ని దశలను విజయవంతంగా దాటుకుని పీఎస్ఎల్వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి కొన్ని గంటల ముందే పాక్ తన అక్కసును వెళ్లగక్కింది. -
దేశానికి న్యూ ఇయర్ గిఫ్ట్: ఇస్రో ఛైర్మన్
సాక్షి, శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయికి చేరువైంది. ఒకేసారి 30 ఉపగ్రహాలతో పాటు తన 100వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో శుక్రవారం ఉదయం ఈ ఘనత సాధించింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో అధికారులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కార్టోశాట్-2ను విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. ఇది కొత్త సంవత్సరం సందర్భంగా దేశానికి ఇస్రో ఇచ్చిన కానుక అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని ఆయన ప్రకటించారు. కొత్త ఛైర్మెన్ శివన్‌కు అద్భుత విజయంతో ఘన స్వాగతం పలికామన్నారు. ఫిబ్రవరిలో జీఎస్ఎల్వీ మార్క్2 ద్వారా సమాచార ఉపగ్రహాన్ని పంపేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ ఏడాది 3 జీఎస్ఎల్వీ, 9 పీఎస్ఎల్వీ రాకెట్లను కక్షలోకి పంపే దిశగా సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం 2 లాంచ్ ప్యాడ్ల ద్వారా ప్రయోగాలు జరుగుతున్నాయి, 3వ లాంచ్ ప్యాడ్ త్వరలోనే సిద్ధమవుతుందన్నారు. పీఎస్ఎల్వీ ద్వారా విస్తృతంగా ఉపగ్రహాలను పంపగలుగుతున్నాం కాబట్టే దేశ, విదేశాల ప్రతినిధులు ఇస్రోను సంప్రదిస్తున్నారు. చిన్న సమస్య వల్లే గతంలో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-39 విఫలమైందని కిరణ్ కుమార్ తెలిపారు. షార్ డైరెక్టర్ కె కృష్ణన్ మాట్లాడుతూ పీఎస్ఎల్వీ సీ40 ప్రయోగం విజయవంతం కావడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఇదే ఉత్సాహంతో చంద్రయాన్-2.. జీఎస్ఎల్వీ మార్క్-2 ప్రయోగాలకు సన్నద్ధం అవుతామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందిస్తామన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి కృషితోనే ప్రయోగం విజయవంతమైందన్నారు. ఈసందర్భంగా ప్రయోగంలో కీలకంగా పనిచేసిన శాష్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ–సీ40
-
మరో మైలురాయికి చేరువైన ఇస్రో
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయికి చేరువైంది. ఒకేసారి 30 చిన్న ఉపగ్రహాలతో పాటు తన 100వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్ఎల్వీ సీ–40 వాహక నౌక ద్వారా కార్టోశాట్–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి మోసుకెళ్లింది. అన్ని దశలను విజయవంతంగా దాటుకుని పీఎస్ఎల్వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇందులో మూడు భారత్‌వి, కాగా మిగిలినవి విదేశాలకు చెందిన మైక్రో, నానో ఉపగ్రహాలు. దేశీయ అవసరాల కోసం భౌగోళిక పరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కార్టోశాట్ ఉపగ్రహ వ్యవస్థను 2005లో ప్రారంభించారు. భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ నాణ్యమైన ఛాయాచిత్రాలను ఈ వ్యవస్థ పంపుతోంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి, సముద్ర తీర ప్రాంతాల పర్యవేక్షణ, నీటి పంపిణీపై కీలక సమాచారాన్ని సమకూరుస్తోంది. భారత్‌కు చెందిన చివరి ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే ఇప్పటి వరకు ఇస్రో పంపిన స్వదేశీ ఉపగ్రహాల సంఖ్య వందకు చేరింది. ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు పీఎస్ఎల్వీ సీ–40 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇస్రోకు బ్రహ్మాస్త్రం పీఎస్ఎల్వీ ఇస్రోకు పోలార్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ) తిరుగులేని బ్రహ్మాస్త్రంగా మారింది. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో అగ్రస్థానంలో వెలుగొందుతూ బహుళ ప్రయోజనకారిగా ఇది పేరొందింది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి జరిగిన 61 ప్రయోగాల్లో 41 ప్రయోగాలు పీఎస్ఎల్వీ రాకెట్‌దే కావడం విశేషం. రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఇస్రో ఫ్రాన్స్, రష్యా నుంచి పంపిస్తుంటే అతిచిన్న విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయం తెచ్చిపెడుతోంది. చంద్రయాన్, మంగళ్యాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలు, మళ్లీ 20 ఉపగ్రహాలు మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్ఎల్వీకే సొంతం. ఇప్పటివరకు 41 పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 210 విదేశీ ఉపగ్రహాలు, 39 స్వదేశీ ఉపగ్రహాలు ప్రయోగించారు. రెండు రకాలుగా.. పీఎస్ఎల్వీ రాకెట్‌ను ఇస్రో రెండు రకాలుగా ఉపయోగిస్తోంది. తక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకెళ్లేప్పుడు స్ట్రాఫాన్ బూస్టర్లు లేకుండా చేస్తారు. దీనిని కోర్ అలోన్ ప్రయోగమని ఇస్రో పరిభాషలో అంటారు. అదే ఎక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకెళ్లేందుకు అత్యంత శక్తివంతమైన స్ట్రాఫాన్ బూస్టర్లతో చేస్తారు. ఎక్సెఎల్ స్ట్రాపాన్ బూస్టర్లతో ఇప్పటివరకు 19 ప్రయోగాలు చేశారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా పీఎస్ఎల్వీ రాకెట్లు ద్వారా చిన్న తరహా ఉపగ్రహాలను పంపుతోంది. అయితే గతేడాది ఆగస్ట్ 31న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ39 ప్రయోగం విఫలమైంది. దిగ్విజయంగా జైత్రయాత్ర చేస్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ రెండోసారి విఫలం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నాలుగు నెలలు పాటు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం 42వ పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా 28 విదేశీ ఉపగ్రహాలతో పాటు మూడు స్వదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే పీఎస్ఎల్వీ ద్వారా 238 విదేశీ, 40 స్వదేశీ ఉపగ్రహాలను పంపించినట్లవుతుంది. ఇస్రోకు వాణిజ్యపరంగా సంవత్సరానికి సుమారుగా రూ.1,500 కోట్లు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతోంది పీఎస్ఎల్వీ రాకెట్లే కావడం విశేషం. తేదీ వెహికల్ ఉపగ్రహాలు 20–09–1993 పీఎస్ఎల్వీ–డీ1 విఫలం 15–10–1994 పీఎస్ఎల్వీ–డీ2 ఐఆర్ఎస్–పీ2 21–03–1996 పీఎస్ఎల్వీ–డీ3 ఐఆర్ఎస్–పీ3 29–09–1997 పీఎస్ఎల్వీ–సీ1 ఐఆర్ఎస్–1డీ 26–05–1999 పీఎస్ఎల్వీ–సీ2 ఓషన్‌శాట్–1 22–10–2001 పీఎస్ఎల్వీ–సీ3 టెస్ 12–09–2002 పీఎస్ఎల్వీ–సీ4 కల్పన–1 17–10–2003 పీఎస్ఎల్వీ–సీ5 రీసోర్స్శాట్–1 05–05–2005 పీఎస్ఎల్వీ–సీ6 కార్టోశాట్–1,హామ్‌శాట్ 10–01–2007 పీఎస్ఎల్వీ– సీ7 కార్టోశాట్–2 23–04–2007 పీఎస్ఎల్వీ–సీ8 వాణిజ్య ప్రయోగం 21–01–2008 పీఎస్ఎల్వీ–సీ10 వాణిజ్య ప్రయోగం 28–04–2008 పీఎస్ఎల్వీ–సీ9 కార్టోశాట్–2ఏతో 10 ఉపగ్రహాలు 22–10–2008 పీఎస్ఎల్వీ–సీ11 చంద్రయాన్–1 20–04–2009 పీఎస్ఎల్వీ–సీ12 రీశాట్–2 23–09–2009 పీఎస్ఎల్వీ–సీ14 ఓషన్‌శాట్–2 12–07–2010 పీఎస్ఎల్వీ–సీ15 కార్టోశాట్–2బీ 20–04–2011 పీఎస్ఎల్వీ–సీ16 రీసోర్స్శాట్–2, యూత్‌శాట్ 15–07–2011 పీఎస్ఎల్వీ–సీ17 జీశాట్–12 12–10–2011 పీఎస్ఎల్వీ–సీ18 మెఘాట్రోఫిక్ 26–04–2012 పీఎస్ఎల్వీ–సీ19 రీశాట్–1 09–09–2012 పీఎస్ఎల్వీ–సీ21 వాణిజ్య ప్రయోగం 25–02–2013 పీఎస్ఎల్వీ–సీ20 సరళ్ 01–07–2013 పీఎస్ఎల్వీ–సీ22 ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ 05–11–2013 పీఎస్ఎల్వీ–సీ25 మార్స్ ఆర్బిటర్ ఉపగ్రహం 04–04–2014 పీఎస్ఎల్వీ–సీ24 ఐఆర్ఎన్ఎస్ఎస్–1బీ 30–06–2014 పీఎస్ఎల్వీ–సీ23 వాణిజ్య ప్రయోగం 16–10–2014 పీఎస్ఎల్వీ–సీ26 ఐఆర్ఎన్ఎస్ఎస్–1సీ 28–03–2015 పీఎస్ఎల్వీ–సీ27 ఐఆర్ఎన్ఎస్ఎస్–1డీ 10–07–2015 పీఎస్ఎల్వీ–సీ28 వాణిజ్యపరమైన ఉపగ్రహాలు 28–09–2015 పీఎస్ఎల్వీ–సీ30 ఆస్ట్రోశాట్ 16–12–2015 పీఎస్ఎల్వీ–సీ29 వాణిజ్య ప్రయోగం 20–01–2016 పీఎస్ఎల్వీ–సీ31 ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఈ 16–03–2016 పీఎస్ఎల్వీ–సీ32 ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఎఫ్ 28–04–2016 పీఎస్ఎల్వీ–సీ33 ఐఆర్ఎన్ఎస్ఎస్–1జీ 22–06–2016 పీఎస్ఎల్వీ–సీ34 కార్టోశాట్–సీ, ప్రథమ్, ఫైశాట్తోపాటు 17 విదేశీ ఉపగ్రహాలు 26–09–2016 పీఎస్ఎల్వీ–సీ35 స్కాట్‌శాట్–1 07–12–2016 పీఎస్ఎల్వీ–సీ36 రీసోర్స్శాట్–2ఏ 15–02–2017 పీఎస్ఎల్వీ–సీ37 కార్టోశాట్–2 సీరిస్ 23–06–2017 పీఎస్ఎల్వీ–సీ38 కార్టోశాట్–2 సీరిస్ 31–08–2017 పీఎస్ఎల్వీ–సీ39 ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ విఫలం 12–01–2018 పీఎస్ఎల్వీ–సీ40 కార్టోశాట్–2సిరీస్‌లో మైక్రో, నానో శాటిలైట్‌తో పాటు 28 విదేశీ ఉపగ్రహాలు