సాక్షి, శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయికి చేరువైంది. ఒకేసారి 30 ఉపగ్రహాలతో పాటు తన 100వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో శుక్రవారం ఉదయం ఈ ఘనత సాధించింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో అధికారులు సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కార్టోశాట్-2ను విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. ఇది కొత్త సంవత్సరం సందర్భంగా దేశానికి ఇస్రో ఇచ్చిన కానుక అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని ఆయన ప్రకటించారు. కొత్త ఛైర్మెన్ శివన్‌కు అద్భుత విజయంతో ఘన స్వాగతం పలికామన్నారు. ఫిబ్రవరిలో జీఎస్‌ఎల్‌వీ మార్క్2 ద్వారా సమాచార ఉపగ్రహాన్ని పంపేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ ఏడాది 3 జీఎస్‌ఎల్‌వీ, 9 పీఎస్ఎల్‌వీ రాకెట్లను కక్షలోకి పంపే దిశగా సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం 2 లాంచ్ ప్యాడ్‌ల ద్వారా ప్రయోగాలు జరుగుతున్నాయి, 3వ లాంచ్ ప్యాడ్ త్వరలోనే సిద్ధమవుతుందన్నారు. పీఎస్‌ఎల్‌వీ ద్వారా విస్తృతంగా ఉపగ్రహాలను పంపగలుగుతున్నాం కాబట్టే దేశ, విదేశాల ప్రతినిధులు ఇస్రోను సంప్రదిస్తున్నారు. చిన్న సమస్య వల్లే గతంలో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-39 విఫలమైందని కిరణ్ కుమార్ తెలిపారు.
షార్ డైరెక్టర్ కె కృష్ణన్ మాట్లాడుతూ పీఎస్‌ఎల్‌వీ సీ40 ప్రయోగం విజయవంతం కావడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఇదే ఉత్సాహంతో చంద్రయాన్-2.. జీఎస్‌ఎల్‌వీ మార్క్-2 ప్రయోగాలకు సన్నద్ధం అవుతామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందిస్తామన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి కృషితోనే ప్రయోగం విజయవంతమైందన్నారు. ఈసందర్భంగా ప్రయోగంలో కీలకంగా పనిచేసిన శాష్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment