మరో మైలురాయికి చేరువైన ఇస్రో | ISRO launchs100th Satellite | Sakshi
Sakshi News home page

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ–సీ40

Published Fri, Jan 12 2018 9:31 AM | Last Updated on Fri, Jan 12 2018 10:44 AM

ISRO launchs100th Satellite - Sakshi

శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయికి చేరువైంది. ఒకేసారి 30 చిన్న ఉపగ్రహాలతో పాటు తన 100వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది.  శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ–40 వాహక నౌక ద్వారా కార్టోశాట్‌–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను  ఒకేసారి నింగిలోకి మోసుకెళ్లింది. అన్ని దశలను విజయవంతంగా దాటుకుని పీఎస్‌ఎల్‌వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్ర‌వేశ‌పెట్టింది.

ఇందులో మూడు భారత్‌వి, కాగా మిగిలినవి విదేశాలకు చెందిన మైక్రో, నానో ఉపగ్రహాలు. దేశీయ అవసరాల కోసం భౌగోళిక పరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కార్టోశాట్‌ ఉపగ్రహ వ్యవస్థను 2005లో ప్రారంభించారు. భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ నాణ్యమైన ఛాయాచిత్రాలను ఈ వ్యవస్థ పంపుతోంది.

పట్టణ, గ్రామీణాభివృద్ధి, సముద్ర తీర ప్రాంతాల పర్యవేక్షణ, నీటి పంపిణీపై కీలక సమాచారాన్ని సమకూరుస్తోంది. భారత్‌కు చెందిన చివరి ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే ఇప్పటి వరకు ఇస్రో పంపిన స్వదేశీ ఉపగ్రహాల సంఖ్య వందకు చేరింది.

ఇస‍్రో శాస్త్రవేత్తలకు వైఎస్‌ జగన్‌ అభినందనలు
పీఎస్‌ఎల్వీ సీ–40 రాకెట్‌ ప్రయోగం విజయవంతంపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ...ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌ లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ఇస్రోకు బ్రహ్మాస్త్రం పీఎస్‌ఎల్‌వీ

ఇస్రోకు పోలార్‌ లాంచింగ్‌ శాటిలైట్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) తిరుగులేని బ్రహ్మాస్త్రంగా మారింది. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో అగ్రస్థానంలో వెలుగొందుతూ బహుళ ప్రయోజనకారిగా ఇది పేరొందింది. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి జరిగిన 61 ప్రయోగాల్లో 41 ప్రయోగాలు పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌దే కావడం విశేషం.

రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఇస్రో ఫ్రాన్స్, రష్యా నుంచి పంపిస్తుంటే అతిచిన్న విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయం తెచ్చిపెడుతోంది. చంద్రయాన్, మంగళ్‌యాన్‌ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలు, మళ్లీ 20 ఉపగ్రహాలు మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్‌ఎల్‌వీకే సొంతం. ఇప్పటివరకు 41 పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ల ద్వారా 210 విదేశీ ఉపగ్రహాలు, 39 స్వదేశీ ఉపగ్రహాలు ప్రయోగించారు.

రెండు రకాలుగా..  
పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ఇస్రో రెండు రకాలుగా ఉపయోగిస్తోంది. తక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకెళ్లేప్పుడు స్ట్రాఫాన్‌ బూస్టర్లు లేకుండా చేస్తారు. దీనిని కోర్‌ అలోన్‌ ప్రయోగమని ఇస్రో పరిభాషలో అంటారు. అదే ఎక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకెళ్లేందుకు అత్యంత శక్తివంతమైన స్ట్రాఫాన్‌ బూస్టర్లతో చేస్తారు. ఎక్సెఎల్‌ స్ట్రాపాన్‌ బూస్టర్లతో ఇప్పటివరకు 19 ప్రయోగాలు చేశారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు ద్వారా చిన్న తరహా ఉపగ్రహాలను పంపుతోంది.

అయితే గతేడాది ఆగస్ట్‌ 31న ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ39 ప్రయోగం విఫలమైంది. దిగ్విజయంగా జైత్రయాత్ర చేస్తున్న పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ రెండోసారి విఫలం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నాలుగు నెలలు పాటు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం 42వ పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా 28 విదేశీ ఉపగ్రహాలతో పాటు మూడు స్వదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే పీఎస్‌ఎల్‌వీ ద్వారా 238 విదేశీ, 40 స్వదేశీ ఉపగ్రహాలను పంపించినట్లవుతుంది. ఇస్రోకు వాణిజ్యపరంగా సంవత్సరానికి సుమారుగా రూ.1,500 కోట్లు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతోంది పీఎస్‌ఎల్‌వీ రాకెట్లే కావడం విశేషం.  
 

తేదీ  వెహికల్‌     ఉపగ్రహాలు
20–09–1993     పీఎస్‌ఎల్‌వీ–డీ1      విఫలం
15–10–1994     పీఎస్‌ఎల్‌వీ–డీ2     ఐఆర్‌ఎస్‌–పీ2
21–03–1996     పీఎస్‌ఎల్‌వీ–డీ3     ఐఆర్‌ఎస్‌–పీ3
29–09–1997     పీఎస్‌ఎల్‌వీ–సీ1     ఐఆర్‌ఎస్‌–1డీ
26–05–1999     పీఎస్‌ఎల్‌వీ–సీ2     ఓషన్‌శాట్‌–1
22–10–2001     పీఎస్‌ఎల్‌వీ–సీ3   టెస్‌
12–09–2002     పీఎస్‌ఎల్‌వీ–సీ4     కల్పన–1
17–10–2003     పీఎస్‌ఎల్‌వీ–సీ5     రీసోర్స్‌శాట్‌–1
05–05–2005     పీఎస్‌ఎల్‌వీ–సీ6     కార్టోశాట్‌–1,హామ్‌శాట్‌
10–01–2007     పీఎస్‌ఎల్‌వీ– సీ7     కార్టోశాట్‌–2
23–04–2007     పీఎస్‌ఎల్‌వీ–సీ8     వాణిజ్య  ప్రయోగం
21–01–2008     పీఎస్‌ఎల్‌వీ–సీ10     వాణిజ్య ప్రయోగం
28–04–2008     పీఎస్‌ఎల్‌వీ–సీ9     కార్టోశాట్‌–2ఏతో 10 ఉపగ్రహాలు
22–10–2008     పీఎస్‌ఎల్‌వీ–సీ11     చంద్రయాన్‌–1
20–04–2009     పీఎస్‌ఎల్‌వీ–సీ12     రీశాట్‌–2
23–09–2009     పీఎస్‌ఎల్‌వీ–సీ14     ఓషన్‌శాట్‌–2
12–07–2010     పీఎస్‌ఎల్‌వీ–సీ15     కార్టోశాట్‌–2బీ
20–04–2011     పీఎస్‌ఎల్‌వీ–సీ16     రీసోర్స్‌శాట్‌–2, యూత్‌శాట్‌
15–07–2011     పీఎస్‌ఎల్‌వీ–సీ17      జీశాట్‌–12
12–10–2011     పీఎస్‌ఎల్‌వీ–సీ18      మెఘాట్రోఫిక్‌
26–04–2012     పీఎస్‌ఎల్‌వీ–సీ19     రీశాట్‌–1
09–09–2012     పీఎస్‌ఎల్‌వీ–సీ21     వాణిజ్య ప్రయోగం
25–02–2013    పీఎస్‌ఎల్‌వీ–సీ20     సరళ్‌
01–07–2013     పీఎస్‌ఎల్‌వీ–సీ22     ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఏ
05–11–2013     పీఎస్‌ఎల్‌వీ–సీ25     మార్స్‌ ఆర్బిటర్‌ ఉపగ్రహం
04–04–2014     పీఎస్‌ఎల్‌వీ–సీ24     ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1బీ
30–06–2014     పీఎస్‌ఎల్‌వీ–సీ23     వాణిజ్య ప్రయోగం
16–10–2014     పీఎస్‌ఎల్‌వీ–సీ26     ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1సీ
28–03–2015     పీఎస్‌ఎల్‌వీ–సీ27     ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1డీ
10–07–2015     పీఎస్‌ఎల్‌వీ–సీ28     వాణిజ్యపరమైన ఉపగ్రహాలు
28–09–2015     పీఎస్‌ఎల్‌వీ–సీ30     ఆస్ట్రోశాట్‌
16–12–2015     పీఎస్‌ఎల్‌వీ–సీ29     వాణిజ్య ప్రయోగం
20–01–2016     పీఎస్‌ఎల్‌వీ–సీ31     ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఈ
16–03–2016     పీఎస్‌ఎల్‌వీ–సీ32     ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఎఫ్‌
28–04–2016     పీఎస్‌ఎల్‌వీ–సీ33     ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1జీ
22–06–2016     పీఎస్‌ఎల్‌వీ–సీ34     కార్టోశాట్‌–సీ, ప్రథమ్, ఫైశాట్‌తోపాటు 17 విదేశీ ఉపగ్రహాలు
26–09–2016     పీఎస్‌ఎల్‌వీ–సీ35     స్కాట్‌శాట్‌–1
07–12–2016     పీఎస్‌ఎల్‌వీ–సీ36     రీసోర్స్‌శాట్‌–2ఏ
15–02–2017     పీఎస్‌ఎల్‌వీ–సీ37     కార్టోశాట్‌–2 సీరిస్‌
23–06–2017     పీఎస్‌ఎల్‌వీ–సీ38     కార్టోశాట్‌–2 సీరిస్‌
31–08–2017     పీఎస్‌ఎల్‌వీ–సీ39     ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1హెచ్‌ విఫలం
12–01–2018      పీఎస్‌ఎల్‌వీ–సీ40   కార్టోశాట్‌–2సిరీస్‌లో మైక్రో, నానో  శాటిలైట్‌తో పాటు 28 విదేశీ ఉపగ్రహాలు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement