ఆరు దశాబ్దాల అంతరిక్ష యానంలో 99 ప్రయోగాలు
ఈనెల 29న వందో ప్రయోగానికి సిద్ధం
592 ఉపగ్రహాలు, 9 రీ ఎంట్రీ మిషన్లు
99 ప్రయోగాల్లో 89 ప్రయోగాలు విజయవంతం
వందో ప్రయోగంగా జీఎస్‌ఎల్‌వీ ఎఫ్15 రాకెట్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆరు దశాబ్దాలుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఎంతోమంది మహామహుల కృషి ఫలితంగా నేడు 99 ప్రయోగాలను పూర్తిచేసి వందో ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. నాటి ఆర్యభట్ట నుంచి చంద్రుడిపై రోవర్‌తో పరిశోధనలు, డాకింగ్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చుకున్న స్పేడెక్స్ ఉపగ్రహ ప్రయోగాలతో భారత అంతరిక్ష యాత్ర అప్రతిహతంగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో.. శ్రీహరికోట రాకెట్ కేంద్రం ఈనెల 29న ప్రయోగించబోయే జీఎస్‌ఎల్‌వీ ఎఫ్15 ప్రయోగంతో సెంచరీ పూర్తిచేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఈ ప్రయోగంతో ఇస్రో సొంతంగా 100 ప్రయోగాలను పూర్తిచేసిన జాబితాలో చేరనుంది. ఎస్‌ఎల్‌వీ రాకెట్‌లు 4, ఏఎస్‌ఎల్‌వీలు 4, పీఎస్‌ఎల్‌వీలు 62, జీఎస్‌ఎల్‌వీలు 16, ఎల్‌వీఎం3– 7, ఎస్‌ఎస్‌ఎల్‌వీలు 3, స్క్రామ్‌జెట్ 1, ఆర్‌ఎల్‌వీ టీడీ 1, క్రూ ఎస్కేప్ సిస్టం 1 మొత్తం కలిపి 99 ప్రయోగాలు చేశారు. ఈ రాకెట్ల ద్వారా 129 స్వదేశీ ఉపగ్రహాలు, 18 స్టూడెంట్ ఉపగ్రహాలు, 9 రీఎంట్రీ మిషన్లు, 433 విదేశీ ఉపగ్రహాలు, రెండు ప్రైవేట్ ఉపగ్రహాలు, ఒక గగన్‌యాన్ టెస్ట్ వెహికల్–డీ1 పేర్లతో 592 ఉపగ్రహాలను ప్రయోగించి చరిత్ర సృష్టించారు. ఇక ఈ 99 ప్రయోగాల్లో 89 విజయవంతమయ్యాయి.
ఉపగ్రహాలతో ఉపయోగాలు..
సముద్రాలు, భూమిపై అధ్యయనం చేసేందుకు.. భూమి పొరల్లో దాగివుండే నిధి నిక్షేపాలను తెలియజేసేందుకు.. పట్టణ ప్రణాళికాభివృద్ధి, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం.. రైతులకు ఉపయోగపడే ఎన్నో ప్రయోజనాల కోసం దూర పరిశీలనా ఉపగ్రహాలు (రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్), రేడియో, టెలివిజన్, డీటీహెచ్, టెలీ ఎడ్యుకేషన్, టెలీ మెడిసన్, ఇంటర్‌నెట్, ఆండ్రాయిడ్ టెక్నాలజీ లాంటి ఎన్నో ప్రసారాలను మెరుగుపరిచేందుకు సమాచార ఉపగ్రహాలు (కమ్యూనికేషన్ శాటిలైట్స్)ను పంపించారు.
విశ్వంలోని చంద్రుడు, సూర్యుడు, అంగారక గ్రహాల మీద పరిశోధనకు చంద్రయాన్–1, 2, 3 మంగళ్‌యాన్–1, సూర్యయాన్–1 అనే మూడు ఉపగ్రహాలతో పరిశోధనలు చేస్తున్నారు. ఉపగ్రహాల సామర్థ్యాన్ని కూడా నిర్థారించుకునేందుకు ఎక్స్‌పరిమెంట్ ఉపగ్రహాలు, నావిగేషన్ వ్యవస్థకు చెందిన ఉపగ్రహాలు, ఖగోళం, వాతావరణం గురించి తెలియజేసేందుకు స్పేస్ సైన్స్ ఉపగ్రహాలు, విద్యార్థులకు ఉపయోగపడే స్టూడెంట్ శాటిలైట్స్ అన్నీ కలుపుకుంటే ఇప్పటివరకూ 159 ఉపగ్రహాలను పంపారు.
ఇస్రో చరిత్రలోకి వెళ్తే..
1961లో డాక్టర్ హోమీ జే బాబా అనే శాస్త్రవేత్త అంతరిక్ష ప్రయోగాలకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ)ని ప్రారంభించారు. ఈ సంస్థను అభివృద్ధి చేసి 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్‌గా ఉద్భవించింది. దీనికి అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో కేరళలోని తిరువనంతపురం సమీపంలో తుంబా ఈక్విటోరియల్ లాంచింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. 1963 నవంబర్ 21న 5 దేశాల సాయంతో దిగుమతి చేసుకున్న ‘నైక్ అపాచి’ అనే 2 దశల సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించారు.
సారాభాయ్ ఆధ్వర్యంలో..
దేశంలో సొంతంగా రాకెట్ కేంద్రం, ఉపగ్రహాల తయారీ కేంద్రం ఏర్పాట్లు చేసుకోవాలని డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ముందుకు సాగారు. ఆయన చేసిన ప్రయత్నాలకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో తుంబాలో సౌండింగ్ రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటుచేసుకుని 1967 నవంబర్ 20న రోహిణి–75 అనే సౌండింగ్ రాకెట్‌ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి విజయంతంగా ప్రయోగించారు. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సంస్థను 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థగా పేరు మార్చారు.1970లో డిపార్ట్‌మెంట్ స్పేస్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1963లో తుంబా నుంచి సౌండింగ్ రాకెట్ ప్రయోగాలతో మన
అంతరిక్ష ప్రయోగాల వేట మొదలైంది.
తూర్పు తీర ప్రాంతాన..
డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ఇందిరాగాంధీ 1969లో ముందుగా అరేబియా సముద్ర తీర ప్రాంతంలో స్థలాన్వేషణ చేశారు. ముందుగా గుజరాత్‌లో చూసి అక్కడ గ్రావిటీ పవర్ ఎక్కువగా ఉండడంతో తూర్పున బంగాళాఖాతం తీర ప్రాంతంలో స్థలాన్వేషణ చేస్తున్న సమయంలో పులికాట్ సరస్సుకు బంగాళాఖాతానికి మధ్యలో 44 చదరపు కిలోమీటర్లు విస్తరించిన శ్రీహరికోట దీవి ప్రాంతం కనిపించింది. ఈ ప్రాంతం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడం, గ్రావిటీ పవర్ తక్కువగా ఉండడంతో రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉంటుందని సారాభాయ్ శ్రీహరికోటను ఎంపిక చేశారు. ఇక్కడున్న సుమారు 56 గ్రామాలను ఖాళీ చేయించి రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దురదృష్టవశాత్తూ 1970 డిసెంబరు 30న డాక్టర్ విక్రమ్ సారాభాయ్ మృతిచెందడంతో ఆ బాధ్యతలను వెంటనే ప్రొఫెసర్ సతీష్ ధవన్‌కు అప్పగించారు.
ఆర్యభట్టతోనే అడుగులు..
ఒకవైపు శ్రీహరికోటలో రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తూనే మరోవైపు బెంగళూరులో శాటిలైట్ తయారీ కేంద్రంలో 1975లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని తయారుచేసుకుని రష్యా నుంచి ప్రయోగించి మొదటి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం పూర్తిస్థాయిలో రూపాంతరం చెందాక మొదటి ప్రయోగ వేదిక నుంచి 1979 ఆగస్టు 10 ఎస్‌ఎల్‌వీ–3 ఇ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం.. ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లను అభివృద్ధిచేశారు.
ఇండియన్ రాకెట్‌ల ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు) రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూరపరిశీలనా ఉపగ్రహాలు), ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (భారత క్షేత్రీయ దిక్చూచి ఉపగ్రహాలు), వాతావరణ పరిశోధనలకు ఆస్రోనాట్ ఉపగ్రహాలు, గ్రహంతర ప్రయోగాలు (చంద్రయాన్–1, మంగళ్‌యాన్–1, చంద్రయాన్–1), అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం సేడెక్స్ ఉపగ్రహాలతో డాకింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకుని నాలుగో దేశంగా భారత్ ఖ్యాతి గడించింది. అలాగే, రష్యా, అమెరికా, ఫ్రాన్స్ దేశాల అంతరిక్ష సంస్థల నుంచి రాకెట్ల ద్వారా 30 ఉపగ్రహాలను పంపించిన ఇస్రో ఇప్పుడు 37 దేశాలకు చెందిన 433 విదేశీ ఉపగ్రహాలను పంపించి రికార్డు నెలకొల్పింది.
షార్‌లో అత్యాధునిక సౌకర్యాలు..
ఇక శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా గుర్తించిన మొదటి రోజుల్లో సౌండింగ్ రాకెట్లు, ఆ తరువాత చిన్నపాటి లాంచ్‌ప్యాడ్‌ల మీద ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ రాకెట్లను ప్రయోగించారు. చిన్నచిన్న ప్రయోగాల్లో రాటుదేలడంతో పెద్ద ప్రయోగాలు చేయడానికి మొదటి ప్రయోగ వేదికను నిర్మించారు. దీనిపై 1990 నంచి 2005 దాకా ఎన్నో ప్రయోగాలు చేసి విజయాలు సాధించారు. ఆ తరువాత భవిష్యత్తులో అత్యంత బరువైను ఉపగ్రహాలను ప్రయోగించేందుకు మరో ప్రయోగ వేదిక అవసరాన్ని 2002లో గుర్తించారు. అంచెలంచెలుగా ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు.
ఇస్రో చైర్మన్లు వీరే..
1963–71: డాక్టర్ విక్రమ్ సారాభాయ్
1972లో 9 నెలలు పాటు ఎంజీకే మీనన్
1973–84 : ప్రొఫెసర్ సతీష్ ధవన్
1984–94 : డాక్టర్ యూఆర్ రావు
1994–2003 : డాక్టర్ కస్తూరి రంగన్
2003–2009 : ఈకే మాధవన్ నాయర్
2009–2014 : డాక్టర్ కే రాధాకృష్ణన్
2015లో 11 రోజులపాటు శైలేష్ నాయక్
2015–2018 : ఏఎస్ కిరణ్‌కుమార్
2018–2022 : డాక్టర్ కైలాసవాడివో శివన్
2022–2025 : డాక్టర్ ఎస్ సోమనాథ్
2025 జనవరి 14 నుంచి : డాక్టర్ వీ నారాయణన్
షార్ డైరెక్టర్లు..
1969–76 : వై జనార్థన్‌రావు
1977–85 : కల్నల్ ఎన్ పంత్
1985–89 : ఎంఆర్ కురూప్.
1989–94 : ఆర్. అరవాముదన్
1994లో : (6 నెలలు) శ్రీనివాసన్
1994–99 : డాక్టర్ ఎస్ వసంత్
1999–2005 : డాక్టర్ కాటూరి నారాయణ
2005–2008 : ఎం అన్నామలై
2008–2012 : ఎం చంద్రదత్తన్
2013–2015 : ఎంవైఎస్ ప్రసాద్
2015–2018 : పీ కున్హికృష్ణన్
2018–2019 : ఎస్ పాండ్యన్
2019 నుంచి : ఎ.రాజరాజన్
Comments
Please login to add a commentAdd a comment