అంతరిక్ష యానంలో మరో పెద్ద అడుగు ముందుకు పడింది. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి 550 కిలోల చిన్న రాకెట్ ‘విక్రమ్ ఎస్’ గతవారం గగనంలోకి దూసుకుపోవడం చారిత్రక ఘట్టం. దీంతో, రోదసీ రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం విషయంలో మన దేశం ఒక్క ఉదుటున ముందుకు ఉరికినట్టయింది. భారత్‌లో ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన తొట్టతొలి రాకెట్ ఇదే. హైదరాబాద్‌కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సంస్థ దీన్ని రూపొందించడం మరింత ఆనందదాయకం. రానున్న కాలంలో ఈ సంస్థ మరింత పెద్ద రాకెట్లను వరుసగా ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. అంటే, అంబర వీధిలో అనేక సంవత్సరాల భారత ప్రయత్నాలు మరో పెద్ద మలుపు తిరగనున్నాయన్న మాట. దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఒకపక్క ‘ఇస్రో’ ప్రధానపాత్ర కొనసాగిస్తుంటే, మరోపక్క దానికి పూరకంగా ప్రైవేట్ రంగం నిలబడనుంది. దీని పరిణామాలు, విపరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
భారత అంతరిక్ష ప్రయోగాల మార్గదర్శి విక్రమ్ సారాభాయ్ పేరిట ‘విక్రమ్ ఎస్’ రాకెట్‌తో సాగించిన ఈ ‘ప్రారంభ్’ ప్రయోగం శుభారంభం. భారతీయ అంకుర సంస్థలు మరింతగా పాలు పంచుకొనేలా భారత అంతరిక్ష కార్యక్రమానికి తలుపులు తెరవాలన్న కేంద్ర ప్రభుత్వ చొరవ వల్ల ఇది సాధ్యమైంది. నిజానికి, వినువీధిలోకి అంతరిక్ష ప్రయోగ వాహన నౌకలను పంపడం మంచి గిరాకీ ఉన్న వ్యాపారం. ఇటీవలి దాకా అందులో ఆయా దేశ ప్రభుత్వాలదే ఆధిపత్యం. ఎలన్ మస్క్ తన ‘స్పేస్ ఎక్స్’ సంస్థతో దానికి గండి కొట్టింది. త్వరలోనే అమెజాన్ వారి ‘బ్లూ ఆరిజన్’ రాకెట్ మార్కెట్‌లోకి రానుంది. అంతరిక్షంలోని సరికొత్త వాణిజ్య అవకాశాలను అంది పుచ్చుకోవడానికి అంతర్జాతీయ సహకారం పెరుగుతుండడంతో ప్రైవేట్ రంగ వికాసానికి దారులు పడ్డాయి.
ఒకప్పుడు మన విహాయస ప్రయోగాలకు అభివృద్ధి, దేశ ప్రతిష్ఠలే మూలమంత్రాలు. ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్‌కు ఉపగ్రహ వినియోగం, చంద్రమండల శోధన, గగనాంతర గవేషణ లాంటివి ముందుకొచ్చాయి. అలా వ్యాపారం, ఆర్థికవ్యవస్థ వచ్చి చేరాయి. శరవేగంగా పెరుగుతున్న ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ ప్రస్తుతం 45 వేల కోట్ల డాలర్లు. పదేళ్ళలో ఇది ఏకంగా లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందట. ఇందులో ఇప్పుడు భారత్ వాటా 2 శాతమే. రానున్న వత్సరాల్లో మన వాటాను చకచకా 8 శాతానికి పెంచాలన్నది ప్రధాని మాట. ప్రైవేట్ రంగ సంస్థలకు సైతం పెద్ద పీట వేస్తేనే ఆ వాటా పెరుగుదల సాధ్యం. ఆ క్రమంలో వచ్చినదే తాజా ‘విక్ర’మార్కు విజయం!
ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో అనేక ప్రపంచ దేశాలు ఇప్పటికే చాలా ముందుకు పోయాయి. వారిని అందుకొనేందుకు మనం బహుదూరం ప్రయాణించాల్సి ఉంది. మన ప్రైవేట్ రంగంలోనూ ప్రతిభాపాటవాలున్నాయి. వాటి వినియోగానికి ప్రభుత్వం విధానపరంగా తగిన వాతావరణం కల్పిస్తే సుదీర్ఘ యానం సంక్షిప్తమవుతుంది. ఇన్నేళ్ళ భారత అంతరిక్ష ప్రయోగ పరిణామ క్రమంలో ప్రైవేట్ రంగ పాత్ర లేనే లేదనుకుంటే పొరపాటు. గోద్రెజ్ అండ్ బోయిస్, లార్సెన్ అండ్ టుబ్రో, వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్ లాంటి అనేక ప్రైవేట్ రంగ సంస్థలు తమ వంతు భాగస్వామ్యం వహించాయి. ఇప్పుడిక స్కైరూట్ లాంటి స్టార్టప్‌లు నక్షత్రపథాన నవీన కల్పనలకు పాదులు వేస్తాయి. అయితే, ఆకసాన బలమైన ఆర్థికశక్తిగా ఎదగాలంటే భారీ సంస్థల ప్రవేశం అనివార్యం.
ప్రస్తుతానికి మన అంకుర సంస్థలకు విదేశీ మూలధనమే ఆధారం. మచ్చుకు విక్రమ్‌ను ప్రయోగించిన స్కైరూట్ సంస్థలో ప్రధాన పెట్టుబడులు సింగపూర్‌వి. రేపు మన అంతరిక్ష ప్రయోగాలు తలుపులు బార్లా తెరిచినప్పుడు పాశ్చాత్య సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం ఖాయం. ఇవాళ ప్రపంచమంతటా జాతీయ అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ భాగస్వామ్యమూ పెరుగుతోంది. 50 ఏళ్ళ క్రితం చంద్రునిపై మానవుడి ‘అపోలో’ ప్రయోగాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా అమెరికా నిర్వహించింది. వారం క్రితం నవంబర్ 16న మరోసారి చంద్రుని పైకి ‘ఆర్టెమిస్1’ రాకెట్ ప్రయోగాన్ని ఫ్రాన్స్, కెనడా, జపాన్‌లతో కలసి బహుళ దేశాల ప్రయత్నంగా జరిపింది. రష్యా, చైనాలు చుక్కలతోవలో చెట్టపట్టాలు వేసుకోవడమే కాక నెలవంకపై దీర్ఘకాల మానవ ఆవాసానికి సంయుక్త స్థావరం నెలకొల్పే పనిలో ఉన్నాయి.
రయ్యిమంటూ రోదసీలోకి సాగిన మన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని వీటన్నిటి నేపథ్యంలో చూడాలి. వచ్చే పదేళ్ళలో దేశంలో 20 వేలకు పైగా చిన్న ఉపగ్రహాలు నింగికి ఎగురుతా యట. వ్యాపార సంస్థలు, విద్యాలయాలు, ప్రైవేట్ ప్రయోగశాలలు తాము తీర్చిదిద్దిన ఉపగ్రహా లను ప్రైవేట్ రాకెట్లతో దివికి పంపి, వాతావరణ, భూవిజ్ఞాన సమాచారాన్ని సేకరిస్తాయి. వెరసి, నిన్నటి దాకా ప్రభుత్వ ఆధిపత్యంలోని అంబర చుంబన యాత్రలో ప్రైవేట్ పాదముద్రలు బలంగా పడనున్నాయి. 2020 జూన్‌లోనే అంతరిక్ష కార్యకలాపాలన్నిటా ప్రైవేట్‌కు సర్కారు ద్వారాలు తీసింది. పరిశోధనలకూ, పోటీ తత్త్వానికీ తోడ్పడే ఈ మార్పును స్వాగతిస్తూనే తగు జాగ్రత్తలూ తప్పవు. అంతా ప్రైవేటైపోతే, దేశ రక్షణ మాటేమిటన్న భయాలను పాలకులు పోగొట్టాలి. ఇస్రో అనుభవాన్నీ, మార్గదర్శనాన్నీ వాడుకోవాలి. అమెరికాలో నాసాలా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానం మేలు. 350కి పైగా ప్రైవేట్ అంతరిక్ష సంస్థలతో అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీల తర్వాత మనది 5వ స్థానం. భవిష్యత్తులో చుక్కల తోటలో ఎక్కడుంటామో ఆసక్తికరం.
ఇదీ చదవండి: సైన్సు అవార్డుల్లో కోతలా?
Comments
Please login to add a commentAdd a comment