ISRO chairman Kiran Kumar
-
ఇస్రోకు ‘వంద’నం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక విజయం నమోదైంది. ఇస్రో తన వందో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వేదికగా 28 గంటల కౌంట్‌డౌన్ తర్వాత శుక్రవారం ఈ ప్రయోగం జరిగింది. నాలుగు ప్రయోగ దశల్లో మండిన పీఎస్ఎల్వీ సీ–40 వాహకనౌక కార్టోశాట్–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు 30 మైక్రో, నానో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి చేర్చింది. దీంతో అంతరిక్ష రంగంలో, వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాల్లో ఇస్రో తన సమర్ధతను మరోసారి చాటుకున్నట్లయింది. పీఎస్ఎల్వీ రాకెట్‌తో చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రయోగం ఇదే. ప్రయోగం విజయవంతమైనందుకు రాష్ట్రపతి కోవింద్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మైలురాయిగా 100వ ఉపగ్రహం... నాలుగు నెలల క్రితం నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ ప్రయోగ సందర్భంగా ఎదురైన వైఫల్యాన్ని పక్కనపెట్టి ఇస్రో తాజా విజయాన్ని అందుకుంది. ఈసారి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల్లో దేశీయంగా రూపొందించిన వందో ఉపగ్రహం ఉండటం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ–40 31 ఉపగ్రహాలతో నింగికెగిసింది. 17 నిమిషాల్లోనే కార్టోశాట్ ఉపగ్రహాన్ని 505 కి.మీ ఎత్తులోని సూర్యానువర్తిత ధృవకక్ష్యలో చేర్చింది. తర్వాత ఏడు నిమిషాల వ్యవధిలో భారత్‌కు చెందిన ఒక నానో ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 28 పేలోడ్లను ఒకదాని తర్వాత మరోదాన్ని కక్ష్యల్లో విడిచిపెట్టింది. మిగిలిన ఏకైక(వందో ఉపగ్రహం) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చడానికి కొంత సమయం పట్టింది. ఇందుకోసం ప్రయోగం ప్రారంభమైన సుమారు 105 నిమిషాల తరువాత రాకెట్ నాలుగో దహన దశను రెండుసార్లు పునఃప్రారంభించారు. చివరి దశను పూర్తిచేయడానికి సుమారు 2 గంటల 21 నిమిషాలు పట్టింది. అత్యంత ఎక్కువ సమయం తీసుకున్న పీఎస్ఎల్వీ మిషన్ ఇదే. ఇస్రో చైర్మన్‌గా చివరి ప్రయోగాన్ని విజయవంతంగా ముగించిన కిరణ్ కుమార్ సహచరులతో కలసి సంతోషం పంచుకున్నారు. కార్టోశాట్–2 వెంట ప్రయాణించిన ఉపగ్రహాల్లో కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కొరియా, యూకే, అమెరికాలకు చెందిన మూడు మైక్రో, 25 నానో ఉపగ్రహాలున్నాయి. కొత్త ఏడాది కానుక ఇదే: ఇస్రో చైర్మన్ ప్రయోగం పూర్తయిన తరువాత ఇస్రో చైర్మన్ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ...ఇస్రో కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించిందని అన్నారు. కార్టోశాట్ ఉపగ్రహాన్ని దేశానికి కానుకగా ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాము ప్రయోగించిన 100 ఉపగ్రహాల్లో విద్యార్థులు తయారుచేసిన వాటన్నింటికీ చోటిచ్చామని తెలిపారు. చంద్రుడిపై అధ్యయనం కోసం చేపట్టబోయే రెండో ప్రయోగం చంద్రయాన్–2 మిషన్‌కు ఏర్పాట్లు సజావుగానే జరుగుతున్నాయని వెల్లడించారు. ఫ్లైట్ మోడల్స్‌ను వివిధ దశల్లో పరీక్షిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నుంచి నెలకో ప్రయోగం చొప్పున జరిపేందుకు సన్నద్ధమవుతున్నామని వెల్లడించారు. తాజా ప్రయోగానికి ఎంత వ్యయమైందని ఓ విలేకరి అడగ్గా... ఖర్చు కన్నా మన రాకెట్ల సాయంతో వాణిజ్యపరంగా ఉపగ్రహాలను పంపించేందుకు ఎన్ని దేశాలు ముందుకొస్తున్నాయన్నదే ముఖ్యమని చెప్పారు. జీఎస్ఎల్వీ ఎంకే2, ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ప్రయోగాలు త్వరలో జరుగుతాయని తెలిపారు. బంగారు భవితకు సూచిక: మోదీ ఇస్రో వందో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం సంస్థ విజయాలు, అంతరిక్ష రంగంలో దేశ బంగారు భవిష్యత్‌కు సూచిక అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ...తాజా విజయంతో ప్రజలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇస్రో కృషిని అభినందించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: పీఎస్ఎల్వీ–సీ 40 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభినందించారు. మన శాస్త్రవేత్తల కృషి మరవలేనిదని, ఇది మన దేశానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. ఇస్రోకు జగన్ శుభాకాంక్షలు... సాక్షి, హైదరాబాద్: ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో భవిష్యత్‌లో మరిన్ని అద్భుత ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
రూ.2,000 నోటులో జీపీఎస్ లేదు
ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ దావణగెరె(కర్ణాటక): కేంద్రం కొత్తగా విడుదల చేసిన రూ.2,000 నోటులో ఎలాంటి జీపీఎస్ వ్యవస్థా అమర్చలేదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ ఏఎస్ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం ఆయన కర్ణాటకలోని దావణగెరె రాష్ట్రోత్థాన విద్యా కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడారు. భారత్ ప్రయోగిస్తున్న ఉపగ్రహాలతో ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు. గతంలో తుపాన్లు వచ్చినప్పుడు పెద్దఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించేదన్నారు. ఇప్పుడు ఉపగ్రహాల సహాయంతో ప్రకృతి విపత్తులను ముందే గుర్తించగలుగుతున్నామని, తద్వారా ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించగలుగుతున్నామని తెలిపారు. సముద్రంలో నీటి రంగు ఆధారంగా చేపలున్న స్థలాన్ని గుర్తించడం వల్ల జాలర్లు తక్కువ సమయంలో ఎక్కువ చేపలు పట్టేందుకు వీలవుతోందన్నారు. రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించే రిసోర్స్ ఉపగ్రహాన్ని వచ్చే నెలలో ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా కేంద్రం ప్రధానోపాధ్యాయురాలు సుగుణ, కార్యదర్శి జయణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇక మన జీపీఎస్
-
ఇక మన జీపీఎస్
పీఎస్ఎల్వీ-సీ31 సక్సెస్.. కక్ష్యలోకి ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఈ బుధవారం ఉదయం 9.31కి ప్రయోగం నావిగేషన్ సేవలకు మరింత తోడ్పాటు ఈ ఏడాదే ‘జీఎస్ఎల్వీ మార్క్-3’ ప్రయోగం: ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ శ్రీహరికోట (సూళ్లూరుపేట): పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత ఉపఖండంలో క్షేత్రీయ దిక్సూచీ వ్యవస్థ (రీజనల్ నావిగేషన్ సిస్టమ్-ఐఆర్ఎన్ఎస్ఎస్) కొద్దిరోజుల్లోనే అందుబాటులోకి రానుంది. ఈ వ్యవస్థలో భాగమైన ఐదో ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో... బుధవారం పీఎస్ఎల్వీ-సీ31 రాకెట్ ద్వారా 1,425 కిలోల బరువైన ‘ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఈ’ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం ద్వారా జీపీఎస్ తరహాలో దేశీయంగా సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన ‘ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్)’ మరింత బలోపేతం కానుంది. ప్రయోగం సక్సెస్‌తో ఇస్రో మొత్తంగా 51 విజయాన్ని, పీఎస్ఎల్వీ సిరీస్‌లో 32వ విజయాన్ని నమోదు చేసుకుంది. మేఘాలను చీల్చుకుంటూ.. ఈ ప్రయోగానికి సోమవారం 48 గంటల కౌంట్‌డౌన్‌ను ప్రారంభించగా... బుధవారం ఉదయం 9 గంటల 31 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగికెగిసింది. రాకెట్ మేఘాలను చీల్చుకుంటూ ఆకాశమార్గం పట్టగానే షార్‌లో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. 44.5 మీటర్ల ఎత్తయిన పీఎస్ఎల్వీ రాకెట్ 4 దశలను పూర్తిచేసుకుని.. పెరిజి(భూమికి దగ్గరగా) 284.1 కి.మీ., అపోజి (భూమికి దూరంగా) 20,667 కి.మీ. దూరం ఉండే భూస్థిర బదిలీ కక్ష్య(జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లో 19.2 డిగ్రీల వాలులో దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టింది. 19 నిమిషాల 36 సెకన్ల సమయంలో ప్రయోగం పూర్తయింది. ఆ వెంటనే ‘ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఈ’ ఉపగ్రహానికి ఇరు పక్కలా ఉన్న సోలార్ ప్యానల్స్ విచ్చుకుని, పనిచేశాయి. కర్ణాటకలోని హాసన్‌లో ఉన్న ‘మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ’ శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. వారం తర్వాత ఉపగ్రహంలోని ద్రవ ఇంధనాన్ని మండించి ‘భూస్థిర బదిలీ కక్ష్య’ నుంచి భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని ‘భూస్థిర కక్ష్య (జియో సింక్రోనస్ ఆర్బిట్)’లో ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలు అందించనుంది. కొత్త విజయంతో ప్రారంభించాం.. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిందని.. కొత్త సంవత్సరాన్ని ఈ విజయంతో ప్రారంభించామని ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. ‘ఐఆర్ఎన్ఎస్ఎస్’లతో భారత ఉపఖండంలో కచ్చితమైన నావిగేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ వ్యవస్థకు సంబంధించి మరో రెండు ఉపగ్రహాలను వచ్చే రెండు నెలల్లో ప్రయోగిస్తామన్నారు. ఇక ఈ ఏడాది భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగలిగే ‘జీఎస్ఎల్వీ మార్క్-3’ని ప్రయోగిస్తామన్నారు. అంతరిక్ష రంగంలో సహకారం కోసం కువైట్ అంతరిక్ష సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం వివరాలను అధికారులు సోమవారం కేంద్ర కేబినెట్‌కు అందజేశారు. రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు.. తాజా ప్రయోగం నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘శాస్త్రవేత్తలకు నా హృదయపూర్వక అభినందనలు. వారు మరో విజయం సాధించారు..’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ‘ఇస్రో శాస్త్రవేత్తలు తమ కృషితో దేశాన్ని గర్వపడేలా చేశారు. వారికి నా అభినందనలు..’ అని మోదీ ట్వీట్ చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన విజయం దేశానికే గర్వ కారణమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు, శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభతో ఈ విజయం సాధ్యమైందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: పీఎస్ఎల్వీ-సీప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఏమిటీ ఐఆర్ఎన్ఎస్ఎస్..? మన దేశ అవసరాల నిమిత్తం భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం)ను రూ.3,425 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించగా... ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ, 1బీ, 1సీ, 1డీలతో తాజాగా ‘1ఈ’ ఉపగ్రహంతో కలిపి ఐదింటిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మార్చి 10, 28 తేదీల్లో మిగతా రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ‘ఐఆర్ఎన్ఎస్ఎస్’ వ్యవస్థ భారతదేశం మొత్తంతో పాటు చుట్టూ మరో 1,500 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. ప్రాజెక్ట్ మొత్తం పూర్తయితే జీపీఎస్ తరహాలో భారత్‌కు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో విమానాలు, నౌకలు, రోడ్డు మీద వాహనాలకు దిక్సూచి వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ నెలాఖరుకు స్వదేశీ నావిగేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే ఇస్రో అధికారులు ప్రకటించారు. -
ఇస్రో @50
♦ ఇస్రో మరో వాణిజ్య విజయం ♦ విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలు ♦ హాఫ్ సెంచరీ విజయం ♦ షార్‌లో సంబరాలు భారత్- సింగపూర్మైత్రీబంధం 50 ఏళ్లు పూర్తిచేసుకున్న శుభతరణంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తన 50వ అంతరిక్ష ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. తద్వారా ఇస్రో వరుసగా మూడో వాణిజ్యపరమైన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి బుధవారం పీఎస్ఎల్వీ సీ-29 రాకెట్ ఆరు విదేశీ ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లడంతో 50 ప్రయోగాలతో ఇస్రో హాఫ్‌సెంచరీ చేసింది. 56 విదేశీ ఉపగ్రహాలను రోదసిలోకి పంపి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. 59 గంటల కౌంట్‌డౌన్ అనంతరం బుధవారం సాయంత్రం 6 గంటలకు చీకటిని చీల్చుకుంటూ పీఎస్ఎల్వీ సీ29 రాకెట్ నింగివైపునకు దూసుకెళ్లింది. మొత్తం 21.1నిమిషాల వ్యవధిలో ఒకదాని తర్వాత మరొకటిగా మొత్తం ఆరు ఉపగ్రహాలను 550కి.మీల ఎత్తులోని సన్ సింక్రోనస్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. అన్నింటినీ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో షార్ శాస్త్రవేత్తల ఆనందం వెల్లివిరిసింది. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్, షార్ డెరైక్టర్ కున్హికృష్ణన్ శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు. - శ్రీహరికోట(సూళ్లూరుపేట) ప్రయోగం సాగిందిలా.. షార్‌లో సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా సాగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే బుధవారం సాయంత్రం 6 గంటలకు మొదటి ప్రయోగవేదిక నుంచి 44.4 మీటర్ల పొడవైన పీఎస్ఎల్వీ సీ29 227.6 టన్నుల బరువుతో నింగి వైపు దూసుకెళ్లింది. తక్కువ బరువున్న ఉపగ్రహాలు కావడంతో స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండానే కోర్ అలోన్ దశతోనే ప్రయోగాన్ని పూర్తి చేశారు. మొదటి దశ 138.2 టన్నుల ఘన ఇంధన వినియోగంతో 111.8 సెకండ్లలో పూర్తవగా, రెండో దశను 41.35 టన్నుల ద్రవ ఇంధనాన్ని ఉపయోగించి 257.8 సెకండ్లలో, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 581.1 సెకండ్లలో మూడో దశను పూర్తి చేశారు. 0.82 టన్నుల ద్రవ ఇంధనంతో 1042.1 సెకండ్లలో నాలుగో దశ పూర్తవగా ఆ తర్వాత 1089.1సెకండ్లకు 400 కిలోల బరువైన టెలియోస్-1 ఉపగ్రహాన్ని, 1119.1 సెకండ్లకు 78 కిలోల బరువైన కెంట్రిడ్జ్ని, 1119.4 సెకండ్లకు 123 కిలోల బరువైన వెలాక్సి-సీ1ని, 1149.7 సెకండ్లకు 13 కిలోల బరువైన వెలాక్సి-11ని, 1204 సెకండ్లకు 3.4 కిలోల బరువైన గెలాషియోను, 1259.2 సెకండ్లకు ఎథినోక్సాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను భూమికి 550 కిలో మీటర్లు ఎత్తులోని సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 1999లో వాణిజ్యపరమైన ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో ఇప్పటి వరకు 20 దేశాలకు చెందిన 57 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇస్రోకు ఇది 32వ పీఎస్ఎల్వీ ప్రయోగం. వరసగా 31వ విజయమిది. సింగపూర్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తొలిసారిగా భూమిని పరిశోధించే దూర పరిశీలనా ఉపగ్రహాలను(రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్) పంపారు. సింగపూర్ శాస్త్రవేత్తలు కూడా షార్‌లోనే ఉండి ప్రయోగపనుల్లో బిజీగా గడిపారు. ప్రయోగం విజయంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సమష్టి కృషితోనే విజయం పీఎస్ఎల్వీ ప్రయోగం పూర్తయ్యాక మిషన్ కంట్రోల్ రూం నుంచి ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ మాట్లాడారు. ఈ ప్రయోగం శాస్త్రవేత్తలందరి సమష్టి విజయమన్నారు. వాణిజ్యపరంగా మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ విజయాల స్ఫూర్తితో మరిన్ని భారీ ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ప్రధాని మోదీ అభినందనలు పీఎస్ఎల్వీ విజయవంతం కావడంతో ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ‘అంతరిక్ష ప్రయోగాల్లో మరో ఘనత సాధించినందుకు మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. భారత్-సింగపూర్ బంధాన్ని ఈ విజయం మరింత బలపరుస్తుంది. కమ్యూనికేషన్, అబ్జర్వేషన్ ఉపగ్రహ ప్రయోగాలతో వచ్చే ఏడాదిలోనూ మనం దూసుకుపోవాలి’ అని ట్వీటర్లో అన్నారు. శాస్త్రవేత్తలకు జగన్ శుభాకాంక్షలు పీఎస్ఎల్వీ-సీ29 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఆరు ఉపగ్రహాలను నిర్ణీత లక్ష్యం మేరకు కక్ష్యలో ప్రవేశ పెట్టడం అద్భుతమైన విజయమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబు హర్షం.. శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ29 రాకెట్ విజయవంతం కావడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. -
రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజన్‌ను రెండోసారి విజయవంతంగా పరీక్షించడం ద్వారా.. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్‌ల తర్వాత.. స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ సామర్థ్యం సాధించిన దేశంగా గత ఏడాదే నిలిచిన భారత్ తాజా ప్రయోగంతో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ విజయం వచ్చే ఏడాది ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ మార్క్ 3కి మరింత ఊతమివ్వనుంది. మార్క్ 3 రాకెట్‌తో నాలుగు టన్నుల కంటే ఎక్కువ బరువుండే ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం లభిస్తుంది. ఇస్రో 17 ఏళ్ల కృషి..: రెండు టన్నుల కన్నా అధిక బరువు గల భారీ ఉపగ్రహాలను నింగిలోకి పంపించటానికి క్రయోజనిక్ ఇంజన్లు కీలకమైనవి. స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ల విజయం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల దశాబ్దాల శ్రమ ఉంది. 1990 ప్రాంతంలో అమెరికా ఆంక్షల కారణంగా ఈ సంక్లిష్టమైన టెక్నాలజీ మనకు అందకుండా పోయింది. అగ్రరాజ్యం ఒత్తిళ్లకు తలొగ్గిన రష్యా తయారీ టెక్నాలజీ బదలాయింపునకు చేసుకున్న ఒప్పందాన్ని కూడా కాదని ఏడు ఇంజన్లను అందించి చేతులు దులుపుకుంది. అప్పటి నుంచే ఈ ఇంజన్లను సొంతంగా తయారుచేసుకోవాలని ఇస్రో శాస్త్రవేత్తలు సంకల్పించా రు. 1994లో మొదలైన ఈ ప్రాజెక్టు 2010 నాటికి తొలి పరీక్షకు సిద్ధమైంది. అప్పుడు జీఎస్ఎల్వీ డీ3లో ఉపయోగించిన తొలి దేశీ క్రయోజనిక్ ఇంజన్ అసలు మండలేదు. ఈ వైఫల్యాన్ని అధిగమించేందుకు ఇస్రో ఎంతో కృషి చేసింది. శాస్త్రవేత్తలు ఎంతో పట్టుదలతో 37 రకాల పరీక్షలు నిర్వహించి క్రయోజనిక్ ఇంజన్‌ను అభివృద్ధి చేశారు. నాలుగేళ్ల తర్వాత 2014 జనవరి 5న జీఎస్ఎల్వీ-డీ5 ద్వారా స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌ను ఇస్రో దిగ్విజయంగా వినియోగించింది. మళ్లీ ఇప్పుడు స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌ను వినియోగించి చేసిన ప్రయోగం కూడా సఫలమవటంతో.. ఈ సాంకేతిక పరిజ్ఞానంపై భారత్ పూర్తిపట్టు సాధించినట్లేనని భావిస్తున్నారు. సంక్లిష్టమైన టెక్నాలజీ..: అంతరిక్ష ప్రయోగాలకు టన్నుల కొద్దీ ఇంధనం అవసరమవుతుంది. తక్కువ ఇంధనంతో ఎక్కువ శక్తిని పొందేందుకు క్రయోజనిక్ ఇంజన్లు మేలైనవి. కానీ ఈ టెక్నాలజీ చాలా సంక్లిష్టమైంది. రాకెట్ ఇంధనాలుగా వాడే హైడ్రోజన్ మైనస్ 253, ఆక్సిజన్ మైనస్ 183 డిగ్రీ సెల్సియస్ వద్ద ద్రవరూపంలోకి మారతాయి. ఇంతటి అత్యంత శీతలమైన స్థితిలో వీటిని నిల్వ చేయడం, ఇంజన్లలో వాడటం కత్తిమీద సామే. రాకెట్‌లోని ఇతర ఇంజన్ల నుంచి వెలువడే వేడి దీన్ని తాకకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అమెరికా 1969లోనే ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని చంద్రుడిపైకి ప్రయోగించిన రాకెట్లో ఉపయోగించింది. ఇక భారీ ప్రయోగాలే లక్ష్యం వాణిజ్యపరంగా ముందంజ: ఇస్రో చైర్మన్ సూళ్లూరుపేట: క్రయోజనిక్ ఇంజన్ రెండోసారి విజయవంతం కావడం తో జీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా వాణిజ్య ప్రయోగాలు చేయడానికి మార్గం సుగమం అయిందని ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. జీఎస్ఎల్ వీ డి6 ప్రయోగం తరువాత విలేకరులతో మాట్లాడుతూ అమెరికాఅంతరిక్ష సంస్థ ఆంట్రిక్స్ కార్పొరేషన్‌తో 20 ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పీఎస్ఎల్వీ సీ30 ద్వారా 4 నాసా ఉపగ్రహాలను పంపనున్నామన్నారు. క్రయోజనిక్ దశలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ జీఎస్ఎల్వీ మార్క్4 ద్వారా నాలుగు టన్నుల ఉపగ్రహాన్ని పంపే స్థాయికి పెంచుతామన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రోశాట్, డిసెంబర్లో సింగపూర్‌కు చెందిన ఐదు ఉపగ్రహాలతో పాటు 2016 మార్చిలోఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్‌లో 3 ఉపగ్రహాలను ప్రయోగిస్తామన్నారు. జీఎస్ఎల్వీ ఎఫ్05 ప్రయోగానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. -
భారీ ప్రయోగాలకు సిద్ధం కావాలి
ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ శ్రీహరికోట(సూళ్లూరుపేట) : భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) భవిష్యత్తు అంతా భారీ ప్రయోగాల మీదే దృష్టి పెట్టిందని, దీనికి ఇస్రో పనిచేసే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ పిలుపునిచ్చారు. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన వారికి షార్‌లోని ఎంఆర్ కురూప్ ఆడిటోరియంలో ఇస్రో ప్రతిభా పురస్కారాలను మంగళవారం సంస్థ చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ అందజేశారు. 2010, 2011 సంవత్సరాల్లో నిర్వహించిన పలు ప్రాజెక్టుల్లో అత్యంత ప్రతిభా పాఠవాలను చూపించడమే కాకుండా క్లిష్టమైన వ్యవస్థలను రూపొందించిన శాస్త్రవేత్తలకు, వారి సహాయకులకు, సాంకేతిక నిపుణులకు 110 మందికి ఇస్రో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. షార్‌లో న్యూ మిషన్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం, భారీగా ద్రవ ఇంధనాన్ని నిల్వచేసే వసతులు, నూతన వాహకనౌక ఎల్వీఎం-3 అనుసంధానం, భూ అనువాద పరీక్షలు, సూర్యగ్రహణంపై పరిశోధన మొదలగు క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో పాలు పంచుకున్న చిరుద్యోగుల నుంచి ప్రముఖ శాస్త్రవేత్తల వరకు ఈ పురస్కారాలను అందుకున్నారు. షార్ అసోసియేట్ డెరైక్టర్ డాక్టర్ ఎస్వీ సుబ్బారావు, వ్యాస్ట్ డిప్యూటీ డెరైక్టర్ టీ సుబ్బారెడ్డి లాంటి అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు కూడా ఈ పురస్కారాలను అందుకున్నారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్న వారు శాస్త్రవేత్తలైనా, చిరుద్యోగి అయినా సమానమేనన్నారు. షార్‌లో ఇక నుంచి సంవత్సరానికి 10 నుంచి 12 ప్రయోగాలు దాకా చేయాల్సి ఉంటుంది కాబట్టి, అందరూ దీనికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో షార్ డెరైక్టర్ పీ కున్హికృష్ణన్, షార్ కంట్రోలర్ జేవీ రాజారెడ్డి, గ్రూపు డెరైక్టర్ పీ విజయసారధి, విశ్వనాథ శర్మ పాల్గొన్నారు.