ఇస్రో @50 | ISRO @ 50 | Sakshi
Sakshi News home page

ఇస్రో @50

Published Thu, Dec 17 2015 4:00 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

ఇస్రో @50 - Sakshi

ఇస్రో @50

♦ ఇస్రో మరో వాణిజ్య విజయం
♦ విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలు
♦ హాఫ్ సెంచరీ విజయం
♦ షార్‌లో సంబరాలు

 
 భారత్- సింగపూర్‌మైత్రీబంధం 50 ఏళ్లు పూర్తిచేసుకున్న శుభతరణంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తన 50వ అంతరిక్ష ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. తద్వారా ఇస్రో వరుసగా మూడో వాణిజ్యపరమైన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి బుధవారం పీఎస్‌ఎల్‌వీ సీ-29 రాకెట్ ఆరు విదేశీ ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లడంతో 50 ప్రయోగాలతో ఇస్రో హాఫ్‌సెంచరీ చేసింది. 56 విదేశీ ఉపగ్రహాలను రోదసిలోకి పంపి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. 59 గంటల కౌంట్‌డౌన్ అనంతరం బుధవారం సాయంత్రం 6 గంటలకు చీకటిని చీల్చుకుంటూ పీఎస్‌ఎల్‌వీ సీ29 రాకెట్ నింగివైపునకు దూసుకెళ్లింది. మొత్తం 21.1నిమిషాల వ్యవధిలో ఒకదాని తర్వాత మరొకటిగా మొత్తం ఆరు ఉపగ్రహాలను 550కి.మీల ఎత్తులోని సన్ సింక్రోనస్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. అన్నింటినీ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో షార్ శాస్త్రవేత్తల ఆనందం వెల్లివిరిసింది. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్, షార్ డెరైక్టర్ కున్హికృష్ణన్ శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు.                                                           
- శ్రీహరికోట(సూళ్లూరుపేట)

 
 ప్రయోగం సాగిందిలా..
 షార్‌లో సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా సాగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే బుధవారం సాయంత్రం 6 గంటలకు మొదటి ప్రయోగవేదిక నుంచి 44.4 మీటర్ల పొడవైన పీఎస్‌ఎల్‌వీ సీ29 227.6 టన్నుల బరువుతో నింగి వైపు దూసుకెళ్లింది. తక్కువ బరువున్న ఉపగ్రహాలు కావడంతో స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండానే కోర్ అలోన్ దశతోనే ప్రయోగాన్ని పూర్తి చేశారు. మొదటి దశ 138.2 టన్నుల ఘన ఇంధన వినియోగంతో 111.8 సెకండ్లలో పూర్తవగా, రెండో దశను 41.35 టన్నుల ద్రవ ఇంధనాన్ని ఉపయోగించి 257.8 సెకండ్లలో, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 581.1 సెకండ్లలో మూడో దశను పూర్తి చేశారు.

0.82 టన్నుల ద్రవ ఇంధనంతో 1042.1 సెకండ్లలో నాలుగో దశ పూర్తవగా ఆ తర్వాత 1089.1సెకండ్లకు 400 కిలోల బరువైన టెలియోస్-1 ఉపగ్రహాన్ని, 1119.1 సెకండ్లకు 78 కిలోల బరువైన కెంట్‌రిడ్జ్‌ని, 1119.4 సెకండ్లకు 123 కిలోల బరువైన వెలాక్సి-సీ1ని, 1149.7 సెకండ్లకు 13 కిలోల బరువైన  వెలాక్సి-11ని, 1204 సెకండ్లకు 3.4 కిలోల బరువైన గెలాషియోను, 1259.2 సెకండ్లకు ఎథినోక్సాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను భూమికి 550 కిలో మీటర్లు ఎత్తులోని సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 1999లో వాణిజ్యపరమైన ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో ఇప్పటి వరకు 20 దేశాలకు చెందిన 57 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇస్రోకు ఇది 32వ పీఎస్‌ఎల్వీ ప్రయోగం. వరసగా 31వ విజయమిది.

సింగపూర్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తొలిసారిగా భూమిని పరిశోధించే దూర పరిశీలనా ఉపగ్రహాలను(రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్) పంపారు. సింగపూర్ శాస్త్రవేత్తలు కూడా షార్‌లోనే ఉండి ప్రయోగపనుల్లో బిజీగా గడిపారు. ప్రయోగం విజయంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
 
 సమష్టి కృషితోనే విజయం
  పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం పూర్తయ్యాక మిషన్ కంట్రోల్ రూం నుంచి ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ మాట్లాడారు. ఈ ప్రయోగం శాస్త్రవేత్తలందరి సమష్టి విజయమన్నారు. వాణిజ్యపరంగా మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ విజయాల స్ఫూర్తితో మరిన్ని భారీ ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు.
 
 ప్రధాని మోదీ అభినందనలు
 పీఎస్‌ఎల్వీ విజయవంతం కావడంతో ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ‘అంతరిక్ష ప్రయోగాల్లో మరో ఘనత సాధించినందుకు మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. భారత్-సింగపూర్ బంధాన్ని ఈ విజయం మరింత బలపరుస్తుంది. కమ్యూనికేషన్, అబ్జర్వేషన్ ఉపగ్రహ ప్రయోగాలతో వచ్చే ఏడాదిలోనూ మనం దూసుకుపోవాలి’ అని ట్వీటర్‌లో అన్నారు.
 
 శాస్త్రవేత్తలకు జగన్ శుభాకాంక్షలు
 పీఎస్‌ఎల్వీ-సీ29 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఆరు ఉపగ్రహాలను నిర్ణీత లక్ష్యం మేరకు కక్ష్యలో ప్రవేశ పెట్టడం అద్భుతమైన విజయమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 
 చంద్రబాబు హర్షం..
 శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ29 రాకెట్ విజయవంతం కావడంపై ఏపీ సీఎం చంద్రబాబు  హర్షం వ్యక్తం చేశారు.  శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement