
రూ.2,000 నోటులో జీపీఎస్ లేదు
ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్
దావణగెరె(కర్ణాటక): కేంద్రం కొత్తగా విడుదల చేసిన రూ.2,000 నోటులో ఎలాంటి జీపీఎస్ వ్యవస్థా అమర్చలేదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ ఏఎస్ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం ఆయన కర్ణాటకలోని దావణగెరె రాష్ట్రోత్థాన విద్యా కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడారు. భారత్ ప్రయోగిస్తున్న ఉపగ్రహాలతో ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు.
గతంలో తుపాన్లు వచ్చినప్పుడు పెద్దఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించేదన్నారు. ఇప్పుడు ఉపగ్రహాల సహాయంతో ప్రకృతి విపత్తులను ముందే గుర్తించగలుగుతున్నామని, తద్వారా ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించగలుగుతున్నామని తెలిపారు. సముద్రంలో నీటి రంగు ఆధారంగా చేపలున్న స్థలాన్ని గుర్తించడం వల్ల జాలర్లు తక్కువ సమయంలో ఎక్కువ చేపలు పట్టేందుకు వీలవుతోందన్నారు. రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించే రిసోర్స్ ఉపగ్రహాన్ని వచ్చే నెలలో ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా కేంద్రం ప్రధానోపాధ్యాయురాలు సుగుణ, కార్యదర్శి జయణ్ణ తదితరులు పాల్గొన్నారు.