స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు
పరిశోధనల కోసం మహారాష్ట్ర నుంచి వదిలినట్లు గుర్తింపు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నాలుగు రోజులుగా కెమెరా లేని జీపీఎస్ ట్రాకర్‌తో తిరుగు తున్న రాబందును అటవీశాఖ అధికారు లు గురువారం చిన మిడిసిలేరు ప్రాంతంలో పట్టుకున్నారు. ఆదివారం నీరసంగా, కదల్లేని స్థితిలో నాయకకాలనీలోని ఏకలవ్య పాఠశాల సమీపంలో ఈ రాబందు కనిపించగా స్థానికులు మాంసాహారం పెట్టగా తినేసి వెళ్లిపోయింది.
ఈ విషయం బయటపడటంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే మహారాష్ట్రకు చెందిన ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ వారు నాగపూర్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి ఆగస్టు 10న ఇలాంటి రాబందులను వదిలిపెట్టినట్లు తెలిసింది. ఈ రాబందు ఎక్కువ దూరం వెళ్లలేకపోతుండటాన్ని జీపీఎస్ ద్వారా గుర్తించిన అక్కడి అధికారులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నట్లు తెలిసి అటవీశాఖ రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వగా చర్ల రేంజ్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు.
రేంజ్ కార్యాలయానికి తరలించి ఆహారం అందించి పశువైద్యుల ద్వారా పరీక్ష చేయిస్తున్నారు. కాగా, తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఈ రాబందు తిరుగుతుండటంతో మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు పోలీసులే పంపించారనే చర్చ జరిగింది. చివరకు పరిశోధనల కోసం విడిచిపెట్టినట్లు తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment