vulture
-
జీపీఎస్ ట్రాకర్‌తో రాబందు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నాలుగు రోజులుగా కెమెరా లేని జీపీఎస్ ట్రాకర్‌తో తిరుగు తున్న రాబందును అటవీశాఖ అధికారు లు గురువారం చిన మిడిసిలేరు ప్రాంతంలో పట్టుకున్నారు. ఆదివారం నీరసంగా, కదల్లేని స్థితిలో నాయకకాలనీలోని ఏకలవ్య పాఠశాల సమీపంలో ఈ రాబందు కనిపించగా స్థానికులు మాంసాహారం పెట్టగా తినేసి వెళ్లిపోయింది. ఈ విషయం బయటపడటంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే మహారాష్ట్రకు చెందిన ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ వారు నాగపూర్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి ఆగస్టు 10న ఇలాంటి రాబందులను వదిలిపెట్టినట్లు తెలిసింది. ఈ రాబందు ఎక్కువ దూరం వెళ్లలేకపోతుండటాన్ని జీపీఎస్ ద్వారా గుర్తించిన అక్కడి అధికారులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నట్లు తెలిసి అటవీశాఖ రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వగా చర్ల రేంజ్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. రేంజ్ కార్యాలయానికి తరలించి ఆహారం అందించి పశువైద్యుల ద్వారా పరీక్ష చేయిస్తున్నారు. కాగా, తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఈ రాబందు తిరుగుతుండటంతో మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు పోలీసులే పంపించారనే చర్చ జరిగింది. చివరకు పరిశోధనల కోసం విడిచిపెట్టినట్లు తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
అంతరించిపోతున్న రాబంధులు.. మనుగడ కోసం పోరాటం!
సాక్షి, మంచిర్యాల: జీవ వైవిధ్యం దెబ్బతింటుండటంతో పర్యావరణ పరిరక్షణలో తోడ్పడే రాబంధులు ప్రస్తుతం రాష్ట్రంలో మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయి. పూర్వం గ్రామాల్లో ఏదైనా పశువు చనిపోతే గుంపులుగా కనిపించేవి. జీవుల కళేబరాన్ని తిని ప్రకృతి నేస్తాలుగా పర్యావరణ రక్షణకు తోడ్పడేవి. అయితే మానవాళి ప్రకృతి విధ్వంసక చర్యలతో అవి పదుల సంఖ్యకు పడిపోయాయి. గ్రామాల్లో పశువుల సహజ మరణాలు తగ్గిపోయాయి. అవి చనిపోయే వరకు ఆగకుండా ముందే వధశాలలకు తరలిస్తున్నారు. దీంతో రాబంధులకు తిండి దొరక్క చివరకు అటవీ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు కనిపించడం తగ్గిపోయిన రాబంధులు చాలా కాలం తర్వాత 2013లో తొలిసారిగా కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట మండలం నందిగామ శివారులో కనిపించాయి. పెద్దవాగు, ప్రాణహిత నది కలిసే పాలరాపు గుట్టపై గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఇందులో 20 పెద్దవి, మరో పది వరకు చిన్నవి ఉన్నట్లు గుర్తించారు. కాగా, పొరుగున ఉన్న మహారాష్ట్రలోని సిరొంచ డివిజన్ కమలాపూర్ రేంజ్ చల్వడాతోపాటు మరో నాలుగు చోట్ల కూడా 60 నుంచి 70 వరకు రాబంధులు ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఇందులో పొడుగు ముక్కు (గిప్స్ ఇండికస్), ఓరియంటల్ వైట్ బ్లాక్, స్లెండర్ బిల్డ్ జాతులు ఉన్నట్లు చెపుతున్నారు. కాగా, పొడుగు ముక్కు రాబంధులు ప్రాణహిత తీరంలో సంచరిస్తున్నాయి. రోజుకు వంద కిలోమీటర్లు సులువుగా తిరిగే ఈ పక్షులు నదికి ఇరువైపుల స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. ఇదిలా ఉండగా చాలా కాలానికి నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు పరిసరాల్లోని కృష్ణానది తీరంలో కూడా కొన్ని రాబంధులు కనిపించినట్లు అటవీ అధికారులు చెపుతున్నారు. దెబ్బతీసిన డైక్లోఫినాక్.. గతంలో పశువుల్లో వ్యాధుల నివారణ కోసం డైక్లోఫినాక్ మందును ఎక్కువగా ఉపయోగించేవారు. దీంతో పశువుల కబేళరాలను తిన్న రాబంధులకు తీవ్ర ముప్పు ఏర్పడింది. వాటి మూత్రపిండాలు, పునరుత్పత్తిపై ఈ మందు ప్రభావం చూపడంతో రాబంధుల జాతి అంతరించేందుకు ఇది ప్రధాన కారణమైంది. 2006లో ఈ మందును కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే అప్పటికే 9 రాబంధు జాతుల్లో దేశంలో నాలుగు జాతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2002లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) అనే అంతర్జాతీయ పర్యావరణ సంస్థ రాబంధులను అంతరించిపోతున్న జాతుల్లో చేర్చింది. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల సెల్ టవర్లు, విద్యుత్ తీగలకు తాకి ఇవి చనిపోయినట్లు గుర్తించారు. పర్యావరణంలో ప్రముఖ పాత్ర రాబంధులు పర్యావరణ పరిరక్షణలో ప్రకృతి నేస్తాలుగా ఉంటాయి. మృతిచెందిన జీవ వ్యర్థాలను ఇవి ఆహారంగా తీసుకుని.. ఆంత్రాక్స్, రేబిస్, ట్యూబర్క్యులోసిస్ వంటి ప్రమాదకర రోగాలు ప్రబలకుండా కాపాడతాయి. అలాగే కళేబరాలను మట్టిలో కలిసిపోయేలా తోడ్పడతాయి. రాబంధులు ఉండే ప్రాంతాన్ని జీవ వైవిధ్యతకు చిహ్నంగా పర్యావరణ వేత్తలు చెపుతుంటారు. అటవీ శాఖ సంరక్షణ చర్యలు ప్రాణహిత తీరంలో రాబంధుల సంరక్షణ కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి స్థిరంగా ఉండలేకపోతున్నాయి. ఆ ప్రాంతంలో వేటను నిషేధించారు. అలాగే మనుషుల సంచారాన్ని తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదట ఈ ప్రాంతంలో గుట్టపై ఆరోగ్యకరమైన పశువు మాంసాన్ని ఆహారంగా వేశారు. అయితే అవి తినేందుకు ఇష్టపడలేదు. వానాకాలంలో గుట్టపై గూళ్లు దెబ్బతినడంతో మళ్లీ మహారాష్ట్రకు వైపు వెళ్లాయి. ఇటీవల కొన్ని తిరిగివచ్చాయి. సహజ ఆహార వేట అలవాటుతో అవి అధికారులు వేసిన ఆహారాన్ని ఇష్టపడక పలు చోట్ల సంచరిస్తున్నాయి. రాబంధులు సంచరిస్తున్న ఈ ప్రాంతాన్ని నాలుగేళ్ల క్రితమే ‘జఠాయువు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’గా ప్రకటించాలని అటవీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ఆ ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో అంతరించి పోయే దశలో ఉన్న రాబంధుల సంతతి పెరగకపోతే పర్యావరణానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అదిగో అరుదైన ‘అతిథి’ ఎర్ర బొరవ!
సాక్షి, అమరావతి: అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన రాబందు బుధవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల అటవీప్రాంతంలో కనిపించింది. స్థానికంగా ఎర్ర బొరవ (యూరేషియన్ గ్రిఫన్)గా పిలిచే దీనిని పర్యావరణవేత్త, బర్డ్ వాచర్ జిమ్మీ కార్టర్ గుర్తించి తన కెమేరాలో బంధించారు. ఆఫ్రికా, యూరోప్‌లోని కొన్ని ప్రాంతాలు, మన దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఈ జాతి రాబందులు ఎక్కువగా కనిపిస్తాయి. దీని రెండు ఉప జాతుల్లో ఒకటి యూరోప్‌లో, రెండోది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలో కనిపిస్తాయి. మైదాన ప్రాంతాలు, కొండలు, ఎడారి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కొండల్లో గూళ్లు ఏర్పర్చుకుని నివసిస్తాయి. పశువుల కళేబరాల్లో డైక్లోఫినాక్ వంటి డ్రగ్స్ ఎక్కువగా ఉండటంతో వాటిని తినడం వల్ల మన దేశంలో 95 శాతం ఈ రాబందులు అంతరించిపోయాయి. ఎప్పుడో ఒకసారి ఇలా కనిపిస్తున్నాయి. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ జాతి రాబందులు దక్షిణ భారత దేశంలోకి చాలా అరుదుగా వస్తాయి. రికార్డుల ప్రకారం ఇప్పటికీ రెండు సార్లు మాత్రమే మన ప్రాంతానికి వచ్చినట్టు నమోదైంది. పదేళ్ల కిందట మొదటిసారిగా శ్రీహరికోట సమీపంలోని పులికాట్ సరస్సు వద్ద కనిపించగా, నాలుగేళ్ల కిందట గుంటూరు జిల్లా ఉప్పలపాడు వద్ద రెండోసారి కనబడినట్టు రికార్డుల్లో నమోదైంది. -
రాబందును చూపిస్తే లక్ష నజరానా
రాబందులు.. అంతరించిపోయే పక్షి జాతిలో ఉన్న వీటిని ఈ తరం వారు చూసింది తక్కువమందే ఉంటారు. పర్యావరణ అసమతుల్యం.. వాతావరణంలో మార్పులతో పాటు మానవ జాతి చేసిన తప్పిదాలు ఈ పక్షుల మనుగడపైపెను ప్రభావం చూపాయి. దాంతో ఒకప్పుడు హైదరాబాద్ నగర పరిసరాల్లో వందల సంఖ్యలో ఉన్న రాబందులు క్రమంగా కనుమరుగయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రాబందును చూపిస్తే లక్ష రూపాయల నజరానా కూడా ప్రకటించారు. సాక్షి, హైదరాబాద్: నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారడం.. ఆ పక్షుల ఆహారమైన జంతువుల కళేబరాలు దొరకకపోవడం.. దొరికినా అవి విషతుల్యం కావడంతో ఇవి అంతరించిపోయే దశకు చేరాయి. కుళ్లిన మాంసం వ్యర్థాలను ఆహారంగా తీసుకునే ఈ జాతి ఉనికి గత పదేళ్లుగా కనిపించనే లేదు. నెహ్రూ జూలాజికల్ పార్కులో ఏడు మగ, నాలుగు ఆడ రాబందులు ఉన్నప్పటికీ వాటి జీవిత కాలం కూడా దాదాపు చరమాంకానికి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వీటి జాతి పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకోవడంతో పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రాబందుల జాతిని, సంతతిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. జూపార్కుకు కొన్ని రాబందులను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర సర్కారుకు ఈ ఏడాది ఫిబ్రవరి 16న లేఖ రాసింది. దీనిపై అక్కడి సర్కారు సానుకూలంగా స్పందించడంతో ఇటీవల కొందరు జూపార్కు అధికారుల బృందం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పర్యటించి 10 నుంచి 12 రాబందులను ఎంపిక చేశారు. వాటిని త్వరలో జూ పార్కుకు తీసుకురావాలని నిర్ణయించారు. తెలంగాణ వన్యప్రాణి సంరక్షణ విభాగం రాబందుల సంరక్షణ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందుకు అవసరమైన నిధులను సెంట్రల్ జూ అథారిటీ సమకూరుస్తుంది. అత్యంత అరుదైన పక్షి జాబితాలో రాబందు ఒకప్పుడు సామాన్య పక్షుల జాబితాలో ఉన్న రాబందులను భారత ప్రభుత్వం ‘అత్యంత అరుదైన పక్షుల’ జాబితాలో చేర్చింది. పశువుల్లో నొప్పుల నివారణకు వినియోగించే డైక్లో ఫినాక్ వంటి ఔషధాలను కొన్నేళ్ల క్రితం వరకు ఎక్కువగా వాడేవారు. ఈ ఔషధం ఆనవాళ్లు ఆ జంతువుల్లో అలాగే ఉండిపోవడంతో పశువులు చనిపోయినప్పుడు వాటి కళేబరాన్ని తిన్న రాబందులు ఎక్కువగా మరణిస్త్నుట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా పంటల ఎదుగుదలకు, సస్యరక్షణకు వినియోగించే ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం కూడా ఈ జాతి పాలిట శాపంగా మారినట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది. ♦ బెంగళూరు సమీపంలోని హండిగుండి వద్ద అత్యంత ఎత్తయిన రామదేవర గుట్టపై 2005లో కొన్ని రాబందులను గుర్తించారు. దాంతో కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని రాబందుల అభయారణ్యంగా ప్రకటించింది. అదేవిధంగా పంజాబ్‌లోని పింజర్‌లో బ్రీడింగ్ సెంటర్, మహరాష్ట్రలోని గడ్చిరోలిలో అభయారణ్యం ఏర్పాటుతో వీటి సంతానం క్రమంగా వృద్ధి చెందుతోంది. కాగా, 2013 లో రెండు రాబందులను ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు అటవి ప్రాంతంలోని పాలరాపు గుట్ట పై అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇవి గడ్చిరోలి నుంచి వలస వచ్చినట్లు తేల్చారు. ఏడాదికి ఒక్క గుడ్డు మాత్రమే.. నెహ్రూ జూ పార్కులో ప్రస్తుతం వైట్ బ్యాక్డ్ (తెల్ల వీపు) రకానికి చెందిన రాబందులు మాత్రమే ఉన్నాయి. లాంగ్ బిల్డ్ (పొడవు ముక్కు) రకాలకు చెందినవి ఒక్కటీ లేదు. ఒక్క ఆడ రాబందు ఏడాదికి ఒకసారి మాత్రమే గుడ్డు పెడుతుంది. ఈ గుడ్డు పొదిగి పిల్ల పుడితే వాటి జాతి క్రమేణ పెరిగేది. కానీ జూ పార్కులో ఉన్నవి ఏటా గుడ్లు పెడుతున్నప్పటికీ దాని పెంకు పలుచగా ఉండడంతో పొదిగి పిల్లగా మారడం లేదు. ఒకవేళ గుడ్డు పొదగి పిల్ల పుట్టినా అది బతకడం లేదని అధికారులు చెబుతున్నారు. జూలో ఉన్న రాబందులు కొన్నేళ్లుగా ఇవే ఉండటంతో జన్యుసంబంధిత లోపాలతో వాటి జాతి వృద్ధి చెందడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గడ్చిరోలి నుంచి తెచ్చే కొత్త రాబందులు, జూలో ఉన్నవి కలవడం వల్లయినా వాటి జాతి పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
అరుదైన రాబందు దొరికింది
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మనదేశంలో అంతరించే ప్రమాదమున్న రాబందు జాతికి చెందిన గద్ద పిల్ల హైదరాబాద్‌లో అటవీ అధికారులకు దొరికింది. దాదాపు ఇరవై ఏళ్ల కిందట ఇక్కడి వనస్థలిపురంలో కనిపించిన ఈ జాతి రాబందు.. తర్వాత కాలంలో కనిపించకుండా పోయింది. దేశంలోనే అరుదైన రాబందు జాతికి చెందినదిగా (వైట్ బ్యాక్డ్ వల్చర్) భావిస్తున్న ఈ జాతికి సంబంధించిన రాబందు పిల్ల దొరకడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ పక్షి ఇక్కడి ఆసిఫ్‌నగర్‌లో తమకు కనిపించిందంటూ అరణ్యభవన్‌లో ఏర్పాటు చేసిన అటవీశాఖ హెల్ప్‌లైన్‌కు శుక్రవారం రాత్రి ఫోన్ ద్వారా సమాచారం అందింది. దీంతో స్పందించిన యాంటీ పోచింగ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని మహ్మద్ అబ్దుల్ నయీం, మహ్మద్ అబ్దుల్ అజీమ్‌ల నుంచి ఈ పక్షి పిల్లను తీసుకున్నారు. అనంతరం దాన్ని నెహ్రూ జూలాజికల్ పార్కులోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన ఎండల కారణంగా నీరు దొరకక పక్షి నీరసించిపోయినట్లు గుర్తించారు. జూలో ఎలక్ట్రాల్ పౌడర్‌తో కూడిన నీటిని అందించడంతో శనివారం ఉదయం కల్లా కొంత తేరుకుందని, చిన్న చిన్న మాంసం ముక్కలను తినడం మొదలుపెట్టిందని అధికారులు తెలిపారు. అరుదైన రాబందు జాతికి చెందిన ఈ పక్షి ప్రస్తుతం జూ అధికారుల పర్యవేక్షణలో ఉందని చెప్పారు. ఈ పక్షి పిల్ల ఎక్కడి నుంచి తప్పిపోయి ఇక్కడకు చేరుకుంది, ఇంకా పక్షులకు సంబంధించిన గూళ్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాన్ని పరిశోధించి, దీనికి సంబంధించిన సమాచారాన్ని అన్వేషించే చర్యలు చేపట్టినట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓఎస్డీ శంకరన్ తెలిపారు. -
రాబందులకో రెస్టారెంట్..
ముంబై: మనుషులకే కాదు రాబందులకు కూడా రెస్టారెంట్లుంటాయి.. అంతే కాదు మన రెస్టారెంట్ల మెనూలాగే వాటికి కూడా ఓ ప్రత్యేక మెనూ ఉంటుంది. అవును మీరు చదువుతున్నది నిజమే.. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా పన్సాడ్ పక్షుల సంరక్షణ కేంద్రంలో రెండెకరాల విస్తీర్ణంలో రాబందుల రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. హానికర రసాయనం డైక్లోఫినాక్ ఇచ్చిన జంతు మృతకళేబరాలను తినడం వల్ల తరచూ రాబందులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో రాబందులు అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో చేరాయి. అందుకే పరీక్షించిన జంతువుల మృతకళేబరాలను ఈ రెస్టారెంట్లో మెనూగా పెట్టారు. అక్కడ రాబందులు తమకు కావలసిన ఆహారాన్ని స్వేచ్ఛగా తినొచ్చు. ఒకవేళ రాబందులు మృతకళేబరాలను తినకుంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఆ వ్యర్థాలు భూమిలో చేరి వాటి ద్వారా నీరు, ఆహారం కలుషితమై అతిసార వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. -
రా.. రాబందు
♦ పాలరపు సంరక్షణ కేంద్రంలో 30కి చేరిన సంఖ్య.. ♦ రాబందులకు పశుమాంసం అలవాటు చేస్తున్న అటవీ అధికారులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: దేశంలో వేగంగా అంతరించి పోతున్న రాబందుల జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ చేపట్టిన చర్యలు కొంతమేరకు ఫలితాలనిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే వీటి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు రాబందుల సంరక్షణ ప్రాజెక్టు అధికారులు గుర్తించారు. గతేడాది 19 పెద్ద రాబందులు, ఎనిమిది చిన్న రాబందులున్నట్లు గుర్తించిన అధికారులు, ఈ ఏడాది పెద్ద రాబందుల సంఖ్య 24కు పెరిగినట్లు తేల్చారు. చిన్నవి ఆరు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వీటి ఆహారం అలవాట్లలో కూడా మార్పులు వస్తున్నట్లు వారంటున్నారు. వేటా డే అలవాటు లేని రాబందులు చనిపోయిన జంతు కళేబరాలను మాత్రమే తిని జీవిస్తాయి. అయితే, వీటి సంరక్షణలో భాగంగా అధికారులు గతేడాది నుంచి రాబందులకు పశుమాంసాన్ని అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పశువులను కొనుగోలు చేసి, చంపి వాటిని రాబందుల స్థావరాల వద్ద పడేస్తున్నారు. రాబందులు ఆకలితో అలమటించకుండా ఈ ఏర్పాటు చేశారు. అయితే, గతేడాది చేసిన ఈ ప్రయత్నం ఫలించలేదు. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఇలాంటి ప్రయత్నం చేయగా, ఈ మాంసాన్ని రాబందులు తినడం ప్రారంభించాయని రాబందుల సంరక్షణ ప్రాజెక్టు ఫీల్డ్ రీసెర్చ్ బయోలజిస్టు రవికాంత్ పేర్కొన్నారు. పాలరపుగుట్ట స్థావరంగా.. ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు అటవీ రేంజ్ పరిధి మొర్లిగూడ శివారులోని పాలరపు గుట్ట వద్ద రాంబందుల స్థావరాలను అటవీ శాఖ అధికారులు 2014లో గుర్తించారు. ఇక్కడ తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా వీటి ఉనికి లేదు. కేవలం మహారాష్ట్ర సరిహద్దుల్లోని ప్రాణహిత-పెద్దవాగు సంగమం సమీపంలో మాత్రమే వీటి సంచారం ఉంది. దీంతో ఈ ప్రాంతాన్ని పొడవు ముక్కు రాబందుల సంరక్షణ (లాంగ్బిల్ట్ వల్చర్స్ కన్జర్వేటివ్) ప్రాజెక్టుగా 2015లో గుర్తించారు. ఎత్తై ఈ పాలరపు గుట్టలో రాబందులు గూడు కట్టుకునేందుకు వీలుగా సహజసిద్ధమైన బొయ్యారాలున్నాయి. సుమారు 40 వరకు ఈ బొయ్యారాలున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఒక్కో గూటిలో ఒక్కో జంట రాబందులు నివాసముంటాయి. ప్రస్తుతం 12 గూళ్లలో 24 రాబందులున్నట్ల్లు, ఆరింటిలో జంటలతో పాటు, ఒక్కో పిల్ల రాబందులున్నట్లు గుర్తించారు. ఏటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఇవి గుడ్లు పెడుతుంటాయి. జంట రాబందులు కలిసి ఈ గుడ్లను పొదిగితే పిల్లలు వస్తుంటాయి. ఆరు మాసాల్లో ఈ పిల్లలు బయటకు ఎగిరిపోతున్నాయి. వీటి సంరక్షణ చర్యల్లో భాగంగా అటవీ శాఖ ఈ కొండ చుట్టు కొంత భాగం ఫెన్సింగ్ వేశారు. వీటి కదలికలను గమనించేందుకు ఎత్తై మంచెను ఏర్పాటు చేశారు. నలుగురు ఫారెస్టు వాచర్లను, ఫీల్డ్ రీసెర్చ్ బయోలజిస్టును నియమించామని ఫారెస్టు రేంజ్ అధికారి మాడిచెట్టి రాంమోహన్ తెలిపారు. మొత్తానికి అంతరించిపోతున్న రాబందుల జాతిని సంరక్షించేందుకు అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తుండడంతో జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.